మొదటి భాగం
అనగనగా ఒక గురువుగారి దగ్గర చాలా మంది శిష్యులు విద్యలు నేర్చుకునేవారు. ఆయనకు దేశ విదేశాల్లో గొప్ప ఉపాధ్యాయునిగా పేరుండేది. అలా వివిధ దేశాల రాజకుమారులు ఆయన శిష్యులుగా వచ్చి చేరేవాళ్ళు. గురువుగారు తన శిష్యులందరికీ 'మంచిని పెంచాలి' అని చెప్పేవారు.
అలాంటి పాత శిష్యులలో ఒకడు మహేంద్రుడు, తను రాజు అయిన తర్వాత కొంతకాలానికి గురువుగారిని గుర్తు చేసుకుంటూ "మా రాజ్యంలో తమరు చెప్పిన అనేక సూత్రాలను ఆచరణలో పెట్టాం. తమరు మా రాజ్యాన్ని సందర్శించి మమ్మల్ని ధన్యుల్ని చేయాలి" అంటూ ఆహ్వానించాడు. తను చెప్పిన పరిపాలనా సూత్రాలను ఆచరణలో పెట్టిన శిష్యుడు ఉన్నందుకు గురువుగారికి చాలా సంతోషం వేసింది. కుతూహలం కొద్దీ ఆయన మహేంద్రుడి రాజ్యాన్ని చూసేందుకు వెళ్లాడు.
గురువుగారు రాజ్య పొలిమేరలలోకి చేరుకోగానే మహేంద్రుడు ఎదురేగి, ఆయనను సాదరంగా ఆహ్వానించి, తన పరిపాలన ఎలా ఉన్నదో చూపించేందుకు తీసుకువెళ్ళాడు.
తన ప్రభుత్వం స్థాపించిన అనేక ఆసుపత్రులూ, కారాగృహాలూ, రక్షకభట నిలయాలూ, అన్నదాన శిబిరాలూ- ఇలా రకరకాల కొత్తవన్నీ చూపించిన రాజు, "నేను నెలకొల్పిన ఇన్నిన్ని ప్రజాహిత సంస్థలను చూసి గురువుగారికి సంతోషం కలిగి ఉంటుంది" అనుకున్నాడు.
కానీ గురువుగారు మటుకు చాలా నిఃస్పృహ చెందారు. "చూసింది చాలులే" అన్నారు, నిష్టూరంగా.
తరవాత మహేంద్రుడు బాధపడి కారణం అడిగితే ఆయన అన్నారు- "నిజంగా నువ్వు నా పాఠాల్నే గనక పాటించి ఉంటే ప్రజలందరూ చక్కటి ఆహార-విహారాలు చేసే పరిస్థితుల్ని కల్పించి ఉండేవాడివి. అప్పుడు ఆసలు రోగాలే ఉండేవి కావు. రోగాలు అంతమయ్యేవి; రోగులంటూ లేకుండా పోయేవాళ్ళు. అందరూ మంచి మనసులతో ఉంటే అసలు నేరాలే జరగవు కదా, ఇక అప్పుడు కారాగృహాల అవసరం ఏముంటుంది? పరిపాలన మంచిగా ఉంటే మనుషులందరూ మంచిగా ఉంటారు- ఇక రక్షకభటనిలయాలు ఎందుకు? అలాగే అసలు బీద ప్రజలే లేకుంటే 'పేదలకు అన్నదానం' ఎందుకు?
నీ రాజ్యంలో ఆసుపత్రులు అన్నన్ని ఉండి, 'రాజ్యమంతా రోగుల మయం' అని చెప్పకనే చెబుతున్నాయి. ఇక అన్నన్ని చెరసాలలు- 'రాజ్యమంతా నేరమయం' అని ఘోషిస్తున్నాయి. అన్నదాన సత్రాలు నీ రాజ్యంలోని అసంఖ్యాకులు ఆకలితో అలమటిస్తున్నారని చెబుతున్నాయి. నీది సుపరిపాలన కాదు మహేంద్రా" అన్నారు అతన్ని మందలిస్తున్నట్లు.
మహేంద్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు.
రెండవ భాగం
తర్వాత గురువుగారు "తనకి ఇంకో రాజకుమారుడు, సురేంద్రుడు శిష్యుడుగా ఉండేవాడు కదా" అని గుర్తుకు తెచ్చుకున్నారు.
"వాడు కూడా ఇప్పటికి రాజై ఉంటాడే , మరి కబురేమీ లేదే, ఎలా ఉన్నాడో, ఏమిటో" అనుకున్నారు. ముఖ్యంగా మహేంద్రుడిని చూశాక సురేంద్రుడిని చూడాలనే కోరిక బలంగా కలిగింది ఆయనకు. "నాకు ఆహ్వానం ఎందుకు, నేనే వెళ్లి చూస్తా" అనుకొని గురువుగారు రెండో శిష్యుడి రాజ్యానికి బయలుదేరి పోయారు.
కాలి నడకన సురేంద్రుడి రాజ్యంలోకి ప్రవేశించి, రాజధాని వైపు ప్రయాణిస్తూ, దారిలో గ్రామస్తులతో సాధారణ ప్రజల స్థితి గతుల గురించి మాట్లాడసాగారు గురువుగారు.
ఒక ఊరి పెద్ద చెప్పాడు ఆయనకు- "అయ్యా, రక్షక భటులని తీసేశాక కొన్ని రోజులు మాకు చాలా బాగా అనిపించింది. 'ఎంత సుఖమో!' అనుకున్నాము. కానీ దోపిడీలు ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి. అయ్యా, మా ఊరి ప్రజలు చాలా మంచి వాళ్లు. ఎప్పుడూ తప్పుడు పనులు చేయరు. కానీ బయటివాళ్లు మా ఊరికి వచ్చి దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళు-
కొన్ని రోజులు మేము మా రాజు గారు చెప్పినట్లుగా సత్ప్రవర్తన పాటించడానికి ప్రయత్నించాము. ఒకరోజున ఒక ఇంట్లో బిందెలు దొంగిలించడానికి వచ్చిన వాళ్ళకి "పాపం మీరు కష్టాలలో ఉన్నట్లున్నారు, ఈ కంచాలు కూడా తీసుకువెళ్లండి" అని చెప్పాం- వాళ్లలో హృదయ పరివర్తన కలిగించే ఉద్దేశంతో. కానీ వాళ్లు ఎలాంటి ఘోరమైన మనుషులంటే, కంచాలతో పాటూ నగలూ, వగైరా కూడా తీసుకెళ్లడమే కాకుండా, ఇంకొన్ని రోజుల తర్వాత మా ఊరికే ఇంకా చాలా మందిని వేసుకొని ఊరి దోపిడీకి వచ్చారు!" అని.
"మరి ఇంక ఎలా చేశారు?" అని ఆడిగారు గురువుగారు కంగారు పడుతూ.
"ఇంకేమి చేస్తాం? మా ఊరి యువకులతో ఆ దొంగలగుంపుని ఎదుర్కొన్నాం. ఆ రోజు జరిగిన పోరాటంలో మా వాళ్లకి చాలా గాయాలు తగిలాయి- దొంగలు చాలా ధాన్యం వగైరాలు ఎత్తుకెళ్ళారు. అయినా ఇంక అప్పటినుండి మా ఊరికి మా యువసేనే రక్షణ!" అన్నాడు ఊరి పెద్ద.
గురువుగారు సంతోషంగా "మరింకేమి? ఇప్పుడు అంతా బాగుందిగా!" అన్నారు.
ఊరి పెద్ద జవాబు చెప్పాడు-'ఏం బాగు స్వామీ! చిన్న-చితక దొంగలను మా వాళ్లు ఎదుర్కొనగల్గుతారు గానీ, మారణాయు-ధాలతో వచ్చే బందిపోటు దొంగలని మేం ఏం చేయగలం?" అని.
ఇలా మాట్లాడుతూ ఉండగా ఒక ప్రక్కన ఏదో కోలాహలం వినవచ్చింది. ఏమిటో చూద్దామని అందరూ అటు వెళ్లారు. అక్కడ ఒక యువకుడిని చెట్టు కొమ్మకి తల క్రిందులుగా వ్రేలాడదీసి చాలా మంది కొడుతున్నారు. గురువుగారూ, ఊరి పెద్దా జనాలను శాంత పరిచి కనుక్కుంటే తెలిసింది- 'యువసేనకి ఒక దొంగ దొరికాడు. అతనికి వాళ్ళు దేహశుద్ధి చేస్తున్నారు' అని.
అంతలో అ దొంగ పెద్దగా అరిచాడు "అయ్యా, కాపాడండి! నేను దొంగని కాదు! నిజం!" అని.
"మరి ఏంటి, ఇది?" అని కనుక్కుంటే గురువుగారికి తెలిసింది- 'ఆ కుర్రవాడు వేరే వాళ్ల మామిడి చెట్టునుంచి ఒక కాయ కోసుకొని తింటూ యువసేన కార్యకర్తల చేతికి దొరికాడు!'అని. గురువుగారు 'ఇంక చాలులే, చిన్న తప్పుకు చాలా ఎక్కువ శిక్ష అయిపోయిందిలే!' అని సర్ది చెప్పాక, వాళ్ళు ఆ మనిషిని వదిలేశారు.
గురువుగారు అక్కడినుండి ముందుకి సాగారు. ఇంకో ఊరిలో రోగులు వైద్య సేవ కోసం రాజ్యం బయటకు చాలా దూరాలు వెళ్ళటం, ఇబ్బందులు పడటం చూశారు-
అక్కడి ప్రజలు చెప్పారు, 'అయ్యా , రోగాలు రకరకాల కారణాల వల్ల కలుగుతున్నాయి. ఏదైనా పని చేస్తూ ఉంటే పొరపాటు వల్ల ప్రమాదం జరుగుతుంది; గాయాలవుతాయి- అప్పుడు కూడా మాకు వైద్య సౌకర్యాలు లేవు. కొన్ని సార్లు అంటువ్యాధులు వస్తూ ఉంటాయి; వృద్ధాప్యం వల్ల కూడా జబ్బులు చేస్తూ ఉంటాయి; కొన్ని సార్లు రోగం ఎందుకు వచ్చిందో మాకు తెలీదు, కానీ వైద్య సదుపాయాలు అసలు లేకపోవడం మాకు చాలా కష్టంగా ఉంది' అని.
గురువుగారు ముందుకు సాగి రాజధానికి చేరి, నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లారు. సురేంద్రుడు గురువుగారిని చూడగానే లేచి నిలబడి మర్యాద చేశాడు.
రాజ్యంలో తను చూసిన సంగతుల్ని గురువుగారు వివరించే లోపలే సురేంద్రుడు చెప్పటం మొదలుపెట్టాడు: 'గురువు గారూ, మీ దగ్గర నేర్చుకున్నట్లుగా అన్ని రకాలుగానూ మంచిని పెంచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాను-
ప్రతి పట్టణంలోనూ యోగ శిబిరాలు నిర్వహిస్తున్నాను; పిల్లలకు నీతి కథలూ, సూక్తుల పాఠాలూ చెప్పిస్తున్నాను; రక్షకభటులనూ, కారాగృహాలనూ తీసేశాను-
కానీ గురువుగారూ, నా ప్రజలకి కష్టాలు పెరుగుతున్నాయి. బీదరికం పెరుగుతోంది; చాలామంది ప్రజలు నా రాజ్యం వదిలి వెళుతున్నారు; వ్యాపారస్తులు కూడా నా 'రాజ్యంలో అంతా అరాచకం' అని ప్రచారం చేస్తున్నారు. మీరే ఏదైనా మార్గం చూపించండి' అని వేడుకున్నాడు.
గురువుగారు చెప్పారు- "సత్ప్రవర్తన అందరికీ అవసరమే. ప్రతి మనిషీ మంచిగా ఆలోచించటం, మంచిగా మాట్లాడటం, మంచి పనులు చేయటం అవసరం. దానివల్ల చుట్టుపక్కల వారందరిలోనూ మంచితనం ఇంకా పెరుగుతుంది. అందుకని మంచిని పెంచే పనుల్ని నిస్సందేహంగా అందరూ చేయాలి. అయితే రాజన్నవాడు గమనించాల్సిన విషయం ఏంటంటే, 'ప్రజల్లో చెడు కూడా ఉన్నది' అని. 'చెడు లేదు' అని పాలు తాగుతున్న పిల్లి లాగా భ్రమించకుండా, చెడుని గమనించి, దాన్ని నివారించేందుకు అవసరమైన పనులన్నిటినీ చేస్తూ ఉండాలి. అందుకని కొంత మధ్యేమార్గం అవలంబించడం అవసరం. రక్షక భట నిలయాలూ, కారాగృహాలూ, వృద్ధాశ్ర-మాలూ, ఆసుపత్రులూ అన్నీ వేటికవి అవసరమే!" అని.