దూరదర్శి అన్నది: "ప్రభూ! మనం ఆ హిరణ్యగర్భుడిని ఓడించగల్గామంటే, అది కేవలం మాయోపాయం వల్లనే తప్ప, నిజమైన బలం వల్ల కాదు. ఆ రాజు కూడా మామూలు వాడు కాదు: హిరణ్య గర్భుడు మహా బలవంతుడు, ప్రజలందరికీ ఆమోద యోగ్యుడు, అభిమాన ధనుడు. అందువల్ల ఈ అవమానాన్ని సహించి అతను ఊరికే ఉండడు- ఉన్నట్లుండి ఎప్పుడో ఒకసారి, మనం ఏమరుపాటున ఉన్న సమయంలో- మన మీద పడి పగతీర్చుకుంటాడు. 'అలాంటి సమయం ఎప్పుడొస్తుందా' అని కాపు వేసి ఉండే రకం, అతను.
ఇక అతని మంత్రి కూడా అసాధారణమైన తెలివి తేటలు గలవాడు, అన్ని రంగాల-లోనూ ప్రతిభావంతుడు, మంచితనం వల్ల ధన్యుడైన జీవి, శౌర్య సంపదతో ప్రకాశించేవాడు. అతని సమయం బాగుండక వాళ్ళ రాజే అతని మాటల్ని లెక్క చేయక, అనాదరంతో ప్రవర్తించాడు కాబట్టి మన మేఘవర్ణుడికి వాళ్ళ రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది తప్ప, హిరణ్యగర్భుడు తన మంత్రి మాటలనే అనుసరించి ఉంటే మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళమో తమకు వేరుగా మనవి చేసుకోనక్కరలేదు.
ఇప్పుడు ఆ రాజుకు బుద్ధి వచ్చి ఉంటుంది. గతంలో మంత్రి సలహాలను పాటించక, కాకిని నమ్మి, దెబ్బ తిని ఉన్నాడు గనక, ఇప్పుడు అతను జాగ్రత్తగా ఉంటాడు. తన మంత్రి ఇచ్చే ప్రతి సలహానూ వేదవాక్యంగా స్వీకరిస్తాడు. అట్లా ఇక మన ఆటలేవీ అతని ముందు సాగవు.
అంతేకాదు- ఇప్పుడు రానున్నది వానా కాలం! అతని సైన్యంలో ఉన్నవన్నీ నీటి పక్షులే. అందువల్ల, ఒకవేళ తిరిగి యుద్ధం అంటూ వస్తే, ఋతువు అతని సైన్యాలకు అనుకూలిస్తుంది. భూభాగాన్ని ఆశ్రయిం-చుకొని జీవించే మన బోటి పక్షులకు వర్షాకాలం అంతా చెడుదినాలు.
అందువల్ల, 'మనం హిరణ్యగర్భుడితో సంధి చేసుకొని, అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చేయటం మంచిది' అని నాకు తోస్తున్నది. 'అతన్ని యుద్ధంలో ఓడించాం' అన్న కీర్తి మనకు ఇదివరకే వచ్చింది. ఇప్పుడు ఇలా చేస్తే తమ పేరు లోకంలో శాశ్వతంగా నిలచి పోతుంది. అంతకంటే మనకు కావలసింది ఏముంది? ఇట్లా కాక అతని స్థానంలో మరెవరిని నిలిపినా, హిరణ్యగర్భుడు సమయం చూసుకొని మళ్ళీ యుద్ధానికి రాక తప్పడు. శత్రువుల రహస్యాలన్నిటినీ ఛేదించేందుకు కావలసినన్ని ఉపాయాలు తెలిసిన వాడు, అతని మంత్రి సర్వజ్ఞుడు. తన పరాక్రమానికి బుద్ధిబలాన్ని కూడా తోడుచేసుకొని యుద్ధానికి వచ్చే హంసను ఎదురొడ్డి నిలవటం ఈసారి అసాధ్యమే అవుతుంది. వాళ్లతో ఇంకోసారి యుద్ధం చేసి, ఓడిపోయి, దశదిశల్లోనూ వ్యాపించిన తమ కీర్తి సంపదను కోల్పోయేది ఎందుకు? ఒకసారి సంపాదించిన కీర్తిని నిలుపుకొనటమే మంచిది- అని నాకు అనిపిస్తున్నది. అటుపైన తమరి ఇష్టం" అని ఊరుకున్నది.
నెమలి రాజు చిత్రవర్ణుడు ఆ మాటలు విని బలగర్వంతో పకపకా నవ్వి, మంత్రి మాటలను తీసి పారేస్తూ "నువ్వేమో లోకంలో లేని ఊహలన్నిటినీ అల్లుతున్నావు. ఎలాంటి ఆధారమూ లేని చోట, పునాది లేకుండానే, చాలా నేర్పుగా ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాలని చూస్తున్నావు. కానీ అది 'తెలివి' అనే గాలి తాకిడికి తట్టుకొని నిలబడజాలదు-
యుద్ధంలో తన సర్వస్వాన్నీ పోగొట్టుకొని, ఓడి, పారిపోయిన హిరణ్యగర్భుడెక్కడ? కదన రంగంలో విజయం సాధించి ఎదురులేని యోధుడై, అజేయ బల సంపన్నుడై, అలరారుతున్న చిత్రవర్ణుడిని అతడు యుద్ధంలో ఎదుర్కొని మాన ప్రాణాలు రెండింటినీ కోల్పోకుండా నిలిచేదెక్కడ? ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు.
భుజబలంతో సంపాదించుకున్న రాజ్యాన్ని ఏలుకోలేక, నిష్కారణంగా చేజారనివ్వటం వీరధర్మం కాదు. యుద్ధంలో పరాజయం పాలైన హిరణ్యగర్భుడు ఇప్పుడు నా చేతిలోని వాడే. అతన్ని, అతని రాజ్యాన్ని ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్లు చెయచ్చు.
నువ్వు ఇప్పుడు వెయ్యి మాటలు చెప్పినా నేను అతని రాజ్యాన్ని విడిచిపెట్టేది లేదు. ఈ విషయంలో ఇంక నువ్వు నాతో ఏమీ చెప్పకు" అని, వీరగర్వంతో చకచకా సభను వదిలి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. దాంతో మంత్రి మొదలైనవాళ్ళు కూడా లేచి తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. నేను కూడా తమరికి వార్తా విశేషాలు విన్నవించుకోవటంకోసం త్వరత్వరగా వచ్చేశాను" అని చెప్పింది ధవళాంగుడు.
అప్పుడు సర్వజ్ఞుడు రాజుగారి అభిమతాన్ని ఆయన ముఖ కవళికలద్వారానే గ్రహించి, కొంగతో "ధవళాంగా! నువ్వు చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చి చాలా అలసిపోయి ఉంటావు. ఇప్పుడు ఇక ఇంటికిపోయి, కొంత తేరుకొని, అలసట పోగొట్టుకొని, తర్వాత నెమ్మదిమీద మరొకసారి ప్రభువులవారిని సందర్శించుకో. నీకు మేం చాలా శ్రమనిచ్చాం. నీ స్వామిభక్తికీ, పనిని నెరవేర్చుకొని వచ్చిన తీరుకు, నేను-ప్రభువులవారు కూడా చాలా సంతోషించాం. నువ్వు ఇక పోయిరా" అని చెప్పి పంపింది. ఆ కొంగ కూడా మనసులో చాలా సంతోషం, భయం, గౌరవం ముప్పిరిగొనగా రాజుగారికి, మంత్రికి మళ్ళీ మళ్ళీ నమస్కరిసూ తన ఇంటికి పోయింది.
ధవళాంగుడు అలా బయలుదేరాక ఆ మందిరంలో హిరణ్యగర్భుడు-మంత్రి ఇద్దరే ఏకాంతంగా మిగిలిపోయారు. అప్పుడు హంస "విన్నావుగా, ఇప్పుడేం చేద్దాం?" అని అడిగింది మంత్రిని.
అప్పుడు సర్వజ్ఞుడు దానితో "ప్రభూ! మనం ఇప్పటికే యుద్ధంలో ఓటమి పాలై, గౌరవం చెడి ఉన్నాం. మనం ఉన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ శత్రు సైన్య సమూహాలను ఒంటరిగా ఎదుర్కొనబోతే ఇంకొక పరాజయం తప్పదు. 'బలశాలి ఐన విరోధిని ఓడించాలనుకుంటే అంతకంటే బలవంతుడితో స్నేహం చేసి, ఆతనిని శత్రువుపై కయ్యానికి ప్రేరేపించాలి'అని నీతి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెబుతారు. మదించిన ఏనుగు ఊబిలో చిక్కుకొన్నప్పుడు దాన్ని బయటికి లాగటం మరొక మదగజానికే సాధ్యం- తప్ప, వేరే చిన్న ప్రాణి వల్ల కాదు.
సింహళ ద్వీపానికి అధిపతిగా 'మహాబలుడు' అనే సారస పక్షి, మనకు పరమ స్నేహితుడు- ఒకడున్నాడు. అతనికి ఇప్పుడే కబురు పంపుదాం. మనకు సహాయంగా జంబూ ద్వీపం మీద యుద్ధం ప్రకటించమని కోరదాం. నావరకు ఇప్పటికి ఇదే తక్షణ కర్తవ్యం అనిపిస్తున్నది" అన్నది.
హంసరాజుకు కూడా దాని మాటలు చాలా నచ్చాయి. అది మంత్రిని మెచ్చుకొని, వెంటనే అది చెప్పినట్లు రహస్యంగా ఒక ఉత్తరం వ్రాయించి, దానిపై పదిలంగా తన రాజ ముద్ర వేయించి, 'విచిత్రుడు' అనే కొంగ చేతికి ఇచ్చి సింహళానికి పంపింది.
ఇక అక్కడ, చిత్రవర్ణుడు ఒక రోజున సభలో ఆ సంగతీ ఈ సంగతీ ముచ్చటిస్తుండగా కర్పూరద్వీపం ప్రసక్తి వచ్చింది. ఆ సమయంలో కాకి మేఘవర్ణుడు నెమలి ప్రక్కనే ఉన్నది. నెమలిరాజు కాకితో "ఓ మేఘవర్ణా!నువ్వు చాలా కాలం పాటు కర్పూర ద్వీపంలో ఉండి వచ్చావు కదా?! హిరణ్యగర్భుడు ఎట్లాంటివాడో, అతని మంత్రి ఎట్లాంటివాడో నీకు బాగా అర్థం అయిఉండాలి. వాళ్ళెలాంటివాళ్ళో కొంచెం వివరంగా చెప్పు" అన్నది.
ఒకనాడు హిరణ్యగర్భుడిని నమ్మించి, మోసంతో కర్పూర ద్వీపపు కోటను తగలబెట్టి వచ్చిన ఆ కాకి అప్పుడు ఆలోచిస్తున్నట్లు కొంచెంగా కళ్ళు మూసుకొని, ఇట్లా అన్నది- "హిరణ్యగర్భమహారాజు చాలా గొప్ప మనసున్నవాడు. సత్య వంతుడు, మెలకువతో ప్రవర్తించేవాడు. ఆయన మంత్రి సర్వజ్ఞుడు అన్నివిధాలుగానూ సమర్ధుడు. మంత్రిగా అతనితో సమానమైన వాడు మరొకడు లేడు అని నా అభిప్రాయం" అని.
అదివిని నెమలిరాజు చిత్రవర్ణుడు "అట్లానా?!" అని పరిహాసంగా తల ఊపి నవ్వి- (ఏమన్నదో మళ్ళీ చూద్దాం..!)