ఆ అమ్మాయి పేరు సునీత. పేరుకు తగినట్టుగానే చాలా సున్నితమైన, మంచి మనసుగల అమ్మాయి. పేద కుటుంబంలో పుట్టినా చక్కగా మనసు పెట్టి చదివేది. అది చూసిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. గొప్ప చదువులు చదవాలని, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని బోధించారు.
వాళ్ళందరి సహకారంతో పదో తరగతి తర్వాత 'ట్రిపుల్ ఐటీలో' సీటును సంపాదిం-చింది సునీత. సునీత తల్లితండ్రుల తమ బిడ్డ సామర్ధ్యానికి సంతోషించారు.
అటుపైన తన లక్ష్యం ఇంజనీరింగ్‌గా పెట్టుకొని, దాన్ని సాధించేదాకా విశ్రమించలేదు ఆ అమ్మాయి.
ఇంజనీరింగులో మంచి ర్యాంకు సంపాదించి, పేరొందిన ప్రభుత్వ కాలేజీలో చేరగల్గింది. తన తెలివితేటలతో అక్కడ కూడా అందరినీ మెప్పించింది. గొప్ప కంపెనీవారు ఒకరు మంచి జీతంతో ఉన్నతమైన ఉద్యాగాన్ని ఒకదాన్ని ఇచ్చారు ఆమెకు. సునీతకు ఇప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. చక్కటి సంపాదన, మంచి జీవితం ఆమె సొంతం అయ్యాయి.
అలాంటి సమయంలో ఒకసారి సునీత ఊరుకు వెళ్ళింది. "తను చదివిన బడిని చూడచ్చు; తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను కలవొచ్చు; ఇప్పుడు ఆ బళ్ళో చదువుతున్న చిన్న సునీతలను చూసి ముచ్చట్లాడచ్చు.." అనుకుంటూ బడి దగ్గరకు వెళ్ళిన సునీత నిర్ఘాంతపోయే పరిస్థితులు ఎదురయ్యాయి-
బడి పరిసరాలన్నీ ముళ్ళ పొదలతోనూ, చెత్తా చెదారంతోనూ నిండిపోయి, కంపు కొడుతున్నాయి! బడిలో తాము కూర్చున్న తరగతులు ఇప్పుడు తరగతులలాగానే లేవు- పశువుల కొట్టాలలాగా మురికిగా, చీకటిగా, బాగా పాతబడి, ఎప్పుడు కూలతాయో అన్నట్లు, నీరసంగా నిలబడి ఉన్నాయి. వాటిలో పాఠాలు నిర్వహించలేక, టీచర్లు చెట్ల క్రిందనే పాఠాలు కానిచ్చేస్తున్నారు!
బడికి కరెంటు సౌకర్యం లేదు; మంచి నీటి వసతి లేదు; గ్రంధాలయం లేదు; ప్రయోగశాల అసలే లేదు! తాము చదివినప్పటికంటే ఇప్పుడు బడిలో ఎక్కువమంది టీచర్లున్నారు; కానీ పిల్లలు తగ్గిపోయారు. బడి బాగా లేదని ఊళ్ళో పిల్లలందరినీ ప్రైవేటు బళ్ళలో చేరుస్తున్నారు తల్లిదండ్రులు. ఆ బడి ఇప్పుడు అసలు బడిలా లేనే లేదు!
అది చూసి సునీత చలించిపోయింది. తన సుఖ సంతోషాలకు పునాది ఈ బడి. తను ఇవాళ్ళ చక్కని ఉద్యోగాన్ని పొందడానికి కారణం ఈ బడి!
"నాలాంటి అనేకమందిని తీర్చిదిద్దాల్సిన బడి ఇలా ఉండడానికి వీల్లేదు!" అనిపించింది సునీతకు. పాఠశాల వాతావరణం బాగయ్యేవరకూ ప్రతి నెలా కొంత సమయం బడి కోసమే కేటాయించాలని నిశ్చయించుకున్నది ఆమె. తన సంపాదనలో కొంత మొత్తాన్ని నెలకింత చొప్పున బడికోసం వెచ్చించాలని, బడి నిర్వహణలో పాలుపంచుకోవాలని నిశ్చ-యించుకున్నది.
సంబంధిత అధికారులను కలిసింది. తన నిర్ణయాన్ని తెలిపి, మొదటి విడత డబ్బునందించింది. వెంటనే మరమత్తు పనులు మొదలయ్యాయి. ఆ పనుల్లో సునీత చురుకుగా పాలు పంచుకున్నది. తనలాగే జీవితంలో స్థిరపడిన మిత్రులందరినీ సంప్రతించి, వారందరినీ కూడా బడిని మెరుగు పరచేందుకు ఆహ్వానించింది. సునీత సారధ్యంలో 'పాత విద్యార్థుల బృందం' ఒకటి ఏర్పడింది.
ఆ బృందంలోని యువతీ యువకులంతా ఎవరికివారు సునీతలాగే తమకు చేతనయినంత సాయం అందించటంతో ఒక్కసారిగా పాఠశాల రూపురేఖలు మారిపోయాయి.
పాఠశాల చుట్టూ ఉన్న ముళ్ల పొదలన్నీ మాయమయ్యాయి; మళ్ళీ పిల్లలకొక ఆటస్థలం తయారైంది. దాని చుట్టూ ప్రహరీ గోడ, చక్కని గదులు, గ్రంధాలయం నిండా పుస్తకాలు, కూర్చొని చదువుకునేందుకు అనువుగా కుర్చీలు, బల్లలు; ప్రయోగశాల నిండుగా రకరకాల పరికరాలు; పరిశుభ్రమైన మరుగుదొడ్లు; శుద్ధి చేసిన త్రాగునీటి సౌకర్యం- ఒకదాని వెనక ఒకటిగా అన్నీ ఏర్పడ్డాయి.
పాఠశాల మళ్ళీ మొదలయింది. ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసం వారి పాఠాల్లో మళ్ళీ ఓసారి ప్రతిఫలించింది. "ఇప్పుడు ఇక్కడ చెప్పినంత బాగా ఇంకెక్కడా చెప్పరట" అంటూ ఊళ్ళోవాళ్ళంతా తమ పిల్లల్ని తిరిగి ఈ బడిలో చేర్పించసాగారు.
విషయం తెలుసుకున్న పత్రికలవాళ్లు "పాఠశాల పునరుజ్జీవం" అంటూ గొప్పగా రాశారు. సునీత చేసిన మంచిపని అనేకమందికి స్ఫూర్తి అయ్యింది.