"కొక్కోరొకో" చెరువు పక్కనున్న చెట్టుకొమ్మపై నుంచొని కూశాడు, కోడిపుంజు 'రాజు'.
"అప్పుడే తెల్లారిందా?" ఒళ్ళు విరుచుకుంటూ కళ్లు తెరిచాడు 'బాలు' బాతు. ఉదయిస్తున్న చిట్టి సూర్యుడు నేరుగా కళ్ళెదుటే కనిపించాడు బాలుకి.
"ఓ సోమరి బాలూ తెల్లారింది- లే!" అన్నాడు సూర్యుడు నవ్వుతూ.
"నువ్వు ఇంత తొందరగా నిద్ర ఎలా లేస్తావు?" అడిగాడు బాలు సూర్యుణ్ణి ఆశ్యర్యంగా చూస్తూ.
"నేను నీలాగా సోమరిని కాదు" నవ్వి టాటా చెప్తున్నట్టు చేయి ఊపుతూ తన దారిన తాను వెళ్ళాడు సూర్యుడు.
చెట్టుపైనున్న కోడిపుంజు 'రాజు' బాలు ముందుకు దూకాడు రోజూలాగే.
"అలా దూకుతుంటే భలే సరదాగా ఉంటుంది కదా?! నేను కూడా పక్షినే, కానీ చూడు, చెట్టెక్కలేను. నీలా దూకలేను!" బాలు అన్నాడు దానితో, బాధగా.
"చెట్టైతే ఎక్కుతాకాని, మిగతా పక్షుల్లా నేను ఆకాశంలో ఎగరలేను కదా, అందుకని నాకు కూడా బాధగా ఉంటుంది బాలూ!" అన్నాడు రాజు ఆకాశంకేసి చూస్తూ.
బాలు తలెత్తి ఆకాశంలోకి చూశాడు. పక్షులన్నీ రకరకాల విన్యాసాల్లో ఎగురుతూ కనబడ్డాయి దానికి.
"తనకు కూడా అలా ఎగరాలని ఉంది. అయినా తను ఎగరలేడు. కనీసం చెట్టుపైకైనా ఎక్కి కూర్చోలేడు. అక్కడినుండి కిందికి దూకలేడు..”

తన కోరికను రాజుకు చెప్పుకున్నాడు బాలు. బాలు కన్నీటిని చూసి కరిగిపోయాడు రాజు. ఎలాగైనా బాలుకు చెట్టెక్కడం నేర్పించాలని నిర్ణయించుకున్నాడు-
"దిగులు పడకు. నీకు నేను నేర్పిస్తాను, చెట్టెక్కడం!" అంటూ బాలును చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. "కొంచెం పైకి ఎగిరి రా! నీ రెక్కని నాకు అందించు! నేను నిన్ను పైకి లాగుతాను" అంటూ తన రెక్కను చాపాడు.
కోడిపుంజు రెక్కను అందుకొని పైకి ఎగ-బ్రాకేందుకు ప్రయత్నించాడు రాజు. అయితే బాలు బరువును ఆపలేని రాజు దబ్బున కింద పడ్డాడు!
దాంతో "క్షమించు బాలూ! నువ్వు చాలా బరువుగా ఉన్నావు. కొంచెం బరువు తగ్గు. అప్పుడు తేలికగా పైకెగరవచ్చు!" అంటూ సలహా ఇచ్చేశాడు.
అప్పటినుండి బాలు డైటింగు చేస్తూ బరువు తగ్గడానికి రకరకాల వ్యాయామాలు చేశాడు. చివరకు కొంచెం సన్నబడినట్లయ్యాక, దాన్ని చెట్టెక్కించేందుకు మరోసారి ప్రయత్నించి విఫలమయ్యాడు పుంజురాజు. "రాజూ, నీకు చెట్టెకడం నేను నేర్పలేనయ్యా" అంటూ రెక్కలెత్తేశాడు. నిరాశగా తలపట్టుకుని కూర్చున్నాడు బాలు.
బాలును అలా చూసిన కప్పపిల్ల "ఎందుకు బాలూ, విచారంగా ఉన్నావు?" అని భుజం మీద చెయ్యి వేస్తూ అడిగింది.
"ఏం చెప్పను దోస్త్! నేను పక్షిని కదా, కానీ చెట్టెక్కలేను; పైకెగరనూలేను" జలజలా కన్నీళ్లు రాలాయి బాలు కళ్ళనుండి. "బాధపడకు మిత్రమా. ఏదో ఒక దారిని వెదుకుదాం" అంటు తన స్నేహితుడుడైన కాకి దగ్గరకు బాలును తీసుకెళ్ళింది కప్పపిల్ల.

కాకికి తన సమస్యను వివరించాడు బాలు. కాకి కొంచెం సేపు ఆలోచించి, "ఐడియా" అంటూ చిటికేసింది.
"నీ నడుముకు ఒక తాడుకట్టి నేను నిన్ను పైకి లాగుతాను. అప్పుడు నువ్వు మెల్లగా పైకొచ్చి కొమ్మమీద కూర్చుందువుగాని" చెప్పింది కాకి.
తాడుకోసం కప్పను పురమాయించగా, అది ఇక్కడా అక్కడా వెదికి, చివరికి నీళ్ళలో ఉండే నాచు తీగలను సంపాయించుకొచ్చి ఇచ్చింది.
తాడును బాలు నడుముకు కట్టి బిగించి, తను కొమ్మపైకి ఎగిరి, బాలును నెమ్మదిగా పైకి లాగసాగింది కాకి. కొంచెం ఎత్తుకు వెళ్ళిందో లేదో బాలు బరువుకు ఆ నాచుతీగ కాస్తా పుటుక్కున తెగిపోయింది- దబ్బుమని కింద పడ్డాడు బాలు!
"బాలూ! నావల్ల కాదు" అంటూ ఇంకో చెట్టుమీదకు ఎగిరి కూర్చుంది కాకి, ఆయాసంతో వగరుస్తూ.
"ఇక నేను ఈ‌ జీవితంలో చెట్టెక్కలేను, ఎగరలేను!" అనుకుంటూ ఉదాసీనంగా నీటిమొక్కల మధ్య నక్కి కూర్చున్నాడు బాలు.

ఈదుతూ అటుగా వచ్చిన మొసలి పిల్ల "ఏంటి సంగతి?" అని అడిగింది. కన్నీళ్లు తుడుచుకుంటూ తన సమస్యను వివరించాడు బాలు.
"ఏడవద్దులే. నేను నీకు సాయపడతాను" అంటూ బాలుకన్నీళ్లు తుడుస్తూ ధైర్యం చెప్పింది మొసలి పిల్ల.
అప్పుడే ఎగురుతూ వచ్చి చెరువులో వాలిన కొంగలకు 'బాలు దీనగాధను చెప్పింది మొసలి. కొంగలకు ఏం చెప్పాలో తెలీలేదు. అవి కొంచెం ఆలోచించి "సరే, మా ముక్కుల్ని నువ్వు గట్టిగా పట్టుకో. మేం నిన్ను పైకెత్తి కొమ్మమీద కూర్చోబెడతాం" అన్నాయి.
బాలు తన ముక్కుతో కొంగల ముక్కును పట్టుకున్నాడు. కొంగలు ఒక్కసారిగా గాలిలోకి లేచాయి. తోలుముక్కు అవడం చేత బాలు కొంగల ముక్కుల నుండి జారి, కింద పడిపోయాడు. చాలా సేపు చూసిన కొంగలు కూడా "మావల్ల కాదయ్యో, బాలయ్యా!" అనేశాయి.
"పక్షిగా పుట్టి ఎగరలేని బ్రతుకు ఎందుకు?" అని వెక్కి వెక్కి ఏడుస్తున్న బాలును చూసి కప్పపిల్ల కలత పడి, అతన్ని గుడ్లగూబ తాత దగ్గరికి తీసుకెళ్లింది.
తాత ప్రశాంత వదనం చూసి బాలు ధైర్యం తెచ్చుకున్నాడు. "తాతా! నేను పక్షిని కదా! మరెందుకు నేను ఎగరలేకపోతున్నాను?" అమాయకంగా అడిగాడు బాలు.

"చెబుతాను, కొంచెంసేపు నన్ను ధ్యానం చేసుకోనివ్వండి. తర్వాత మీతో మాట్లాడతాను" అంటూ పద్మాసనం వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు తాత. శబ్దం చెయ్యకుండా బాలు, కప్పపిల్ల ఒక పక్కగా ఒదిగి కూర్చున్నారు.
అరగంట తర్వాత మెల్లగా కళ్ళుతెరిచిన తాత నవ్వుతూ "బాలూ, నేను ధ్యానంలో దేవుడితో మాట్లాడాను. నీ సంగతి చెప్పాను. ఆయన నవ్వుతూ నాకిలా చెప్పాడు" అన్నాడు.
"ఏమని చెప్పాడు తాతా?" ఆత్రుతగా అడిగాడు బాలు. "తొదరపడకు- ఇది చెప్పు- మనందరినీ భగవంతుడే కదా, సృష్టించింది?" "అవును" అంటూ బాలు, కప్పపిల్ల తలూపారు.
"మనల్ని, అంటే పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని, చెట్లని అన్నిటినీ?"
"అవును, నేను గుడికి వెళ్లినప్పుడూ పంతులుగారు ఇలానే చెప్పారు" చెప్పాడు బాలు.
"నువ్వుచాలా తెలివిగలవాడివి బాలు. దేవుడలా పక్షుల్ని తయారుచేస్తూ, చిన్ని బాతుపిల్లను కూడా చేశాడు. పక్షులన్నింటీనీ ఎగిరేటట్లు విసిరేసేవాడు. అవి ఎగురుకుంటూ దూరంగా వెళ్ళిపోయేవి. అయితే చిన్ని బాతు పిల్ల ఒక్కతీ ముద్దుగా ఉండటం వలన దాన్ని ఆయన తన దగ్గరే అట్టిపెట్టుకున్నాడు. అది ఆయన చుట్టూతే తిరుగుతూ ఇక ఎగరటం నేర్చుకోలేదు!..” "అప్పుడేమయింది?" ఆసక్తిగా అడిగాడు బాలు.
"ఒకరోజున పక్షులన్నీ ఎగరటం చూసి, నీలానే ఆ బాతుకూడా దేవుణ్ణి అడిగింది- 'నేనెందుకు ఎగరలేను?' అని. దేవుడు మంచివాడు కదా! దాన్ని చేతుల్లోకి తీసుకుని అన్నాడు- "నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకనే నీకు ఎగరటం నేర్పలేదు. నువ్వు నా దగ్గరే ఉందువు. బదులుగా నీకు నీళ్ళలో ఈదటం నేర్పిస్తాను!" అన్నాడు. బాతుని ఒక కొలనుకు తీసుకెళ్ళి బాతుకు ఈత నేర్పే పనిని ఒక చేప పిల్లకు అప్పచెప్పాడు.
మొదట్లో నీళ్లల్లోకి దిగాలంటేనే వణికిపోయేది బాతు. చేప ఎంత బతిమాలినా అది నీళ్లలోకి వచ్చేది కాదు. దాంతో కోపం వచ్చింది చేపపిల్లకు. చివరికి అది బాతు పాదాన్ని నోటితో పట్టుకుని నీళ్లలోకి లాగింది. ఉక్కిరి బిక్కిరయిన బాతు నీళ్లపైకి తేలి, అట్లా ఈదటం నేర్చుకుంది. అప్పటినుండి పక్షులన్నీ ఎగిరినా బాతులు మాత్రం నీళ్లలోనే ఈదుతాయి" చెప్పటం ముగించి బాలు వంక చూశాడు తాత.
అప్పటివరకూ ఆశ్చర్యంగా కళ్లను అటుఇటూ తిప్పుతూ విన్న బాలు మళ్లీ దిగులుగా ముఖం దించుకున్నాడు.
"మళ్లీ ఏమయింది?" అడిగాడు తాత.
"తాతా! ఒక్కసారంటే ఒక్కసారి చెట్టుపైకెక్కి కూర్చోవాలని ఉంది. ఏదైనా ఉపాయం చెప్పవా?" అడిగేశాడు.
"ఓఁ చెప్తానాగు" అంది గుడ్లగూబ. అంతలోనే దాని కబురందుకొని గెంతుతూ వచ్చాడు కోతి. "నేను నీకు చెప్పింది ఈ బాలు గురించే. తనని ఒక్కసారి నీ చేతులతో ఎత్తుకుని చెట్టుకొమ్మపై కూర్చోపెట్తావా?" అడిగాడు గుడ్లగూబ, దాన్ని.
ఆశ్చ్యర్యంగా బాలును చూశాడు అల్లరి కోతి. "నాకే పిచ్చిపిచ్చి కోరికలు ఉంటాయనుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారన్నమాట!" అని మనసులోనే నవ్వుకున్నాడు. బాలును మెల్లగా తన పొట్టకు ఆనించుకుని, చెట్టుపైకి ఎక్కి, పెద్దగా ఉన్న ఒక కొమ్మ మీద దాన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు-
ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది బాలుకు.
చెట్టుపైనుండి కిందికి చూసిన బాలుకు నవ్వుతూ, ఉత్సాహంగా తనవైపే చూస్తున్న మిత్రులు- కప్పపిల్ల, మొసలిపిల్ల, కొంగలు, కాకి, కోడిపుంజు కనబడ్డాయి.
వాళ్ళను చూసి సిగ్గుపడుతూ తన రెక్కలతో ముఖం కప్పుకున్నాడు బాలు!