రాత్రి-పగలు!
టీచర్: వంశీ! సూర్యునికీ, చంద్రునికీ తేడా ఏంటో చెప్పరా?
వంశీ: సూర్యుడు పగటిపూట వెలుగుతాడు. చంద్రుడు రాత్రిపూట వెలుగుతాడు సార్!!

రాయటం-రాయించటం
టీచరు: రామూ, నెమలిని గురించి పది వాక్యాలు రాసుకురమ్మన్నాను, రాసుకొచ్చావా?
రాము: టీచర్, మరి...మరి...మా నాన్నగారు కాంపు వెళ్ళారు టీచర్! ఆయన రాగానే రాయించి తీసుకొస్తానండీ!!

చేదు నిజం! టీచరు: స్వాతీ, ప్రతిరోజూ హోంవర్కు చేయకుండా వస్తావు. సాయంకాలం బడి అయిపోయాక ఇంట్లో ఏం చేస్తుంటావే?
స్వాతి: కసువులు, సామాన్లు, ఇంకా మొత్తం 'హోం వర్క్' అంతా నేనే చేస్తాను టీచర్!!!

ఏం చెప్పను?
టీచర్: పిల్లలూ! కెటిల్ అనే మాట వినగానే ఎవరు గుర్తొస్తారో చెప్పండి!
రాము: గాంధీ గారు సార్. ఆయన ఆ పదం స్పెల్లింగు తప్పు రాశారు.
టీచర్: మరి 'రోజ్' అనగానే గురొచ్చేదెవరు?
పిల్లలు: చాచా నెహ్రూ సార్! ఆయన రోజాపువ్వును జేబుకు పెట్టుకుంటారు.
టీచర్: బాగుంది! మరి ఏ పదం విన్నప్పుడు మీకు నేను గుర్తుకొస్తాను?!
పిల్లలు: 'స్లీప్' సార్! మీరు తరగతిలో నిద్ర పోతారు.

మా నాయనే!
వెంగళప్ప తన కొడుకుతో: ఒరేయ్ చిన్నా! శనివారానికి ముందు వచ్చే వారం ఏదో చెప్పరా?
చిన్న వెంగళప్ప: నాకు తెలీదు- మా బళ్లో తరువాత వచ్చే వారాలే చెబుతారు గాని, ముందు వచ్చే‌ వారాలు చెప్పరు నాన్నా!!!!

కారు కూతలు!
తెలుగు మాష్టారు: నాయనా రవీ! 'మారుతి' అని ఎవరిని పిలుస్తారో చెప్పరా!
రవి: కొత్త మారుతి సుజుకి గురించే కదండి సార్, మీరడుగుతోంది? నాకు తెలుసండి.

ఆకలి పిట్ట!
సైన్సు మాష్టారు: రాజూ! ఆపిల్ పండు కింద పడగానే, న్యూటన్ 'అది కిందికే ఎందుకు పడింది?' అని ఆలోచించాడు కదా! మరి నువ్వే అక్కడ ఉండి ఉంటే ఏం చేసేవాడివి?
రాజు: గబుక్కున దాన్ని తినేసి, రెండోది ఎప్పుడు కిందకు పడుతుందో నని ఎదురు చూసేవాడిని సార్!

భారము మోయువాడు!
దారిన పోయేవాడు: గుర్రం మీద కూర్చొని నీ సూట్కేసు నువ్వే మోస్తున్నావెందుకు?
వెంగళప్ప: పాపం ఈ గుర్రం నా బరువునే మోయలేక పోతున్నదంటే, ఇంక నా సూట్కేసు బరువు కూడా మోయించమంటావా, దాంతో?!

ప్రేమతో భయం!
భర్త: కాంతం! సుమంగళి వ్రతాలతో డబ్బులన్నీ ఖర్చుచేస్తున్నావు. నాకేమైందని?!
కాంతం: ఏమీ లేదండీ, మీరు నెల రోజులుగా ఐరన్ టానిక్ తాగుతున్నారు కదండీ?! మరి మీ పేగులు తుప్పు పట్టకూడదని ఈ‌ వ్రతం చేస్తున్నానండి!

రంగుల టీవీ ఖద:
సోమరాజు: అదేమిట్రా లింగరాజూ, ఆ టీవీ ని అలా రంగునీళ్ళతో కడిగేస్తున్నావు?
లింగరాజు: ఏమీలేదు, ఇది బ్లాక్ అండ్ వైటుది. రంగునీళ్ళతో కడిగితే కలర్ టీవీ అవుతుందేమో చూద్దామని!!

టివి తెలివి!
ఇంగ్లీషు టీచరు: డిస్కవరీ అంటే అర్థం ఏమనిరా రవీ?
రవి: చానల్ నెం: 425 అని సార్!!

డీజిల్ టీ!
హరి-గిరి మాట్లాడుకుంటున్నారు.
హరి: మొన్నీమధ్య మా మామగారు కొత్త కారు కొన్నారురా!
గిరి: అవునా! ఏ కారు?
హరి: ఏదో కారురా, టీ తో స్టార్టు అవుతుంది.
గిరి: నిజమా? అదే మేలురా! మా మామ కొన్న కారైతే పెట్రోలుతో తప్ప స్టార్టవ్వదు!

తిక్క తెలివి!
టీచరు: చింటూ!‌ ఛైర్మన్ అంటే ఎవరురా?
చింటూ: ఛైర్లు మోసే మనిషిని ఛైర్మన్ అంటారు టీచర్!

వేమన పద్యాలు నేర్చుకుందాం!
గంగ పారునెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్నతనము పేర్మి యీలాగురా
విశ్వదాభి రామ వినురవేమ

భావం: పవిత్రమైన గంగానది సున్నితంగా, అల్లనల్లన పారుతుంటే, మురికి వాగు మటుకు గొప్పగా శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాళ్ళకు, అల్పులకు కూడా తేడా ఇదే.

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాడు చెరుచు వాని వంశమెల్ల
జరకు వెన్నుపుట్టి చెరచదా తీపెల్ల :
విశ్వదాభి రామ వినురవేమ

చెరకు గడ చివర్లో పుట్టిన వెన్ను వల్ల చెరకు మొత్తం నింద చెందుతుంది కదా?! అదే విధంగా ఎంత మంచివాడికైనా, దుర్మార్గుడైన కొడుకు పుట్టినట్లయితే వాడివల్ల అతని వంశం మొత్తం అపకీర్తి పాలు అవుతుంది.

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను మిగుల గోడు గులుగు
గోపమడచెనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ వినురవేమ

కోపం వల్ల మన గొప్పతనం అంతా నశిస్తుంది. కోపం వల్ల లెక్కలేనంత దు:ఖం వస్తుంది. ఆ కోపాన్నే గనక అణచుకోగలిగితే మన కోర్కెలన్నీ నెరవేరుతాయి.