గ్రీసు దేశపు రాజధాని ఏథెన్సుకు ఆ పేరు వచ్చేందుకు కారణం 'ఏథెనా' అనే దేవత. జ్ఞానానికి, నేర్పుకు అధిదేవత అయిన ఆవిడ, స్వయంగా అద్భుతమైన వస్త్రాలు నేసేదట. తను నేసిన వస్త్రాలను అనేక సందర్భాలలో నగరవాసులకు బహుమతు-లుగా ఇస్తుండేదట కూడా.
అలా ఆ రోజుల్లో ఏధెన్సు నగరంలో చాలామంది సంతోషం కోసం, ఉత్సాహం కోసం చక్కని వస్త్రాలను నేస్తూ, తాము నేసిన వస్త్రాలను బంధుమిత్రులతో పంచుకుంటూ ఉండేవాళ్ళు. ఆడపిల్లలు నేతపనిని ఒక కళగా నేర్చుకొని, సాధన చేస్తుండేవాళ్లు. చక్కగా నేసే అమ్మాయిల గురించి వాళ్ల తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునేవాళ్ళు.
అట్లా చాలా చక్కని వస్త్రాలు నేసేది, ఒకమ్మాయి అరాకెన్. ఆమె నేసే వస్త్రాలు గొప్ప పనితనం ఉట్టిపడుతూ, దేవతా వస్త్రాలను తలపించేట్లు ఉండేవి. ఊళ్ళోవాళ్ళంతా ఆమె పనితనాన్ని పొగిడేవాళ్ళు- "మీ అమ్మాయికేమమ్మా! ఎంత గొప్ప వస్త్రాలు నేస్తుందంటే, గొప్ప గొప్ప మహారాజులు సైతం ఆమెకు పాదాక్రాంతులు అవుతారు!" అనేవాళ్ళు కొందరు. "మీ అమ్మాయికి సాటి వచ్చే నేర్పరులు ఈ ఏథెన్సులోనే లేరు!" అని కొందరు మెచ్చుకునేవాళ్ళు.
"అయ్యో!‌ఒక్క ఏథెన్సులోనే కాదు- గ్రీసు దేశం మొత్తంలోనూ అరాకెన్ అంత గొప్పగా నేయగలవాళ్ళు ఉండరు!" అనేవాళ్ళు మరికొందరు.

ఆ మాటలు విని అరాకెన్ తల్లిదండ్రులు పొంగిపోయేవాళ్ళు. తమ బిడ్డ అంత చక్కగా నేస్తున్నందుకు మురిసిపోయేవాళ్ళు. అయితే రాను రాను జనాల ఈ పొగడ్తలు అరాకెన్ తలకెక్కటం మొదలయింది. దాంతో ఆమె పొంగిపోవటమే కాదు; క్రమంగా ఆమెలో అహంకారమూ, గర్వమూ, పొగరూ చోటు చేసుకోవటం మొదలు పెట్టాయి.
ఒకసారి ఎవరో ఆమెతో- "అబ్బ!‌అరాకెన్! ఎంత చక్కని బట్ట! నిజంగా నీకు సాటిరాగల కళాకారులు గ్రీసు దేశంలోనే ఉండరెవ్వరూ! మన దేవత ఏథెనా తర్వాత నువ్వే గొప్ప పనిమంతురాలివి!‌ ఆ తల్లి చలవ వల్ల నీకు గొప్ప నైపుణ్యం అలవడింది" అని మెచ్చుకున్నారు.
అది విని అరాకెన్ గట్టిగా, వెగటు పుట్టేట్లు నవ్వింది- "అబ్బ! మీకెందుకో అస్సలు అర్థం కావట్లేదేమి?! నా పనితనం ముందు నిజానికి ఆ ఏథెనా ఎంత, ఆవిడ నేసిన వస్త్రాలెంత?! కళను గుర్తించే నేర్పు అందరికీ ఉండదు సుమా! నా వస్త్రాలు ఇక్కడ ఒక్క చోటే కాదు; దేవలోకంలోకెల్లా ఉత్తమమైనవి!నన్ను మించిన పనితనం ఏథెనాకే కాదు; ఏ దేవతకూ లేదు!" అని.
"లేదు బిడ్డా!‌ నువ్వు మరీ అతిశయంతో మాట్లాడుతున్నట్లున్నది. నువ్వు చాలా చక్కగా నేస్తున్నావు- సందేహంలేదు. కానీ ఆ పొగడ్తని అంతటితో ఆపు చేసుకోవాలి. ఇతరులతోటి- అందునా దేవతలతోటి- నీకు పోలిక అవసరం లేదు. సాధారణ మానవస్త్రీవి నువ్వు- ఆ కళామతల్లితో నీకు పోటీ ఏమిటి?! ఊరుకో" అన్నారు అరాకెన్ తల్లిదండ్రులూ, పరిచయస్తులు అందరూ.
కానీ అరాకెన్ ఇంకా పొగరుగా మాట్లాడింది- "నేను ఏథెనా కంటే బాగా నేస్తాను కనుకనే అలా అన్నాను. నాదేం తప్పు?! నేనెందుకు ఊరుకోవాలి?" అన్నది.
అంతలోనే అక్కడికొక ముసలమ్మ వచ్చింది. వంగిపోయిన నడుముతో, చాలా బలహీనంగా, 'అసలు నడవనేలేదేమో' అన్నట్లు ఉన్నదామె. కానీ ఆమె కళ్ళు మటుకు చురుకుగా, చైతన్యం ఉట్టి పడేట్లున్నాయి. ఆమె అరాకెన్‌తో చాలా మృదువుగా మాట్లాడింది- "నువ్వు చాలా చక్కగా నేస్తున్నావు పాపా! చాలా అంటే చాలా చక్కగా! భలే అందంగా నేస్తావు నువ్వు! అయితే మానవస్త్రీలు ఎవ్వరూ కళలరాణి ఏథెనా అంత గొప్పగా నేయలేరు. అసలు ఆవిడతో ఎవ్వరూ పోటీ‌ పెట్టుకోనే లేరు!" అన్నది.

అరాకెన్ చాలా దురుసుగా సమాధానం ఇచ్చింది: "నాకు నీ అభిప్రాయంతో పని లేదు. కావాలంటే పోయి మీ మనవరాళ్లకు చెప్పుకో, నువ్వు ఏమనుకునేదీ!" అన్నది.
ముసలమ్మ తలపైకెత్తి సూటిగా చూసింది అరాకెన్ కళ్ళలోకి. ఆమె కళ్ళు ఇప్పుడు వింతగా మెరుస్తున్నాయి. అరాకెన్‌కి కొంచెం భయం వేసింది. కానీ ఆమె చాలా మొండిది:
"నేను నేరుగా ఏథెనాని కలిసే వీలుంటే బాగుండును! నాతో నేసే పందానికి ఆమెను ఆహ్వానించేదాన్ని, నన్ను గెలిచి చూపించమని సవాలు చేసేదాన్ని!" అంది పొగరుగా.
మరుక్షణం ముసలమ్మ నిటారుగా నిలబడ్డది. ఆమె వేసుకున్న నల్లటి బట్టలు జారి నేలమీద పడిపోయాయి. ధగ ధగా మెరిసే వెండి దుస్తుల్లో- బలంగా,అందంగా, ఎత్తుగా, ఠీవిగా నిల్చున్న ఏథెనా దేవత ఉన్నది, ఆమె స్థానంలో! అరాకెన్ నివ్వెరపోయి చూస్తూండిపోయింది.
ఆమె అన్నది: "నేనే ఏథెనాను! ఇంకా నాతో పందెం కట్టాలని ఉందా?" అడిగిందామె.
ఆసరికి ఇరుగు-పొరుగున ఉండేవాళ్లంతా అబ్బురంగా వాళ్ల చుట్టూ మూగి ఉన్నారు. వాళ్లంతా అరాకెన్‌కి నచ్చజెప్పబోయారు: మెల్లనైన- గుసగుస గొంతులతో గబగబా గొణిగారు-"పాపా!‌ఏథెనా దేవతను క్షమాపణ కోరు! దయగల ఆ తల్లి, జ్ఞానదాయిని, నిన్ను ఏమీ అనదు- క్షమాపణ కోరు, వెంటనే!" అన్నారు.

కానీ మొండితనంతో అరాకెన్ మరింత గట్టి పడింది- "నేను అట్లా ఊరికే క్షమాపణ కోరేది లేదు. ఖచ్చితంగా చెబుతున్నాను- ఏథెనా! పోటీకి నేను సిద్ధం! నీకంటే నేనే బాగా నేస్తానని ఈరోజున ప్రపంచానికి తేట తెల్లం చేస్తాను! రా, పోటీకి!‌" అన్నది. అరాకెన్ తన నేతపని అందరికీ కనబడేట్లు కూర్చున్నది. ఏథెనా దేవత అందరికీ కనబడుతోంది; కానీ ఆవిడ చేతిపని మటుకు మరుగున ఉన్నది. ఇద్దరూ పనిని ఒకేసారి ఆరంభించి, ఒకేసారి ముగించారు. అక్కడ ఉన్న స్త్రీలంతా అరాకెన్ చేతి పనిని చూసి ఆశ్చర్యపోయారు. అద్భుతంగా ఉండింది, ఆమె పనితనం! వాళ్ళు మెచ్చుకున్న కొద్దీ అరాకెన్ మరింత ఉబ్బిపోయింది. ఏథెనా దేవత మౌనాన్ని ఆవిడ చేతగానితనంగా పరిగణించింది- 'నేను చెప్పలేదూ? నా పనితనం ముందు ఏ దేవతా నిలువదనని?!' అంది, గర్వంగా.
అప్పుడు ఏథెనా దేవత అందరికీ తన పనితనం చూపించింది, అది నిజంగా మానవాతీతమైన ఓ అద్భుతమే! ధగ ధగా మెరిసే అందమైన పూలు, తీగలు- జీవం ఉట్టిపడే ఆ చిత్రం చూసి అందరూ అబ్బురంతో నోళ్ళు తెరిచారు. అత్యంత ఆశ్చర్యకరమైన ఆ పని నిజంగా మానవమాత్రులెవ్వరికైనా అసాధ్యమే!" అని గుసగుసలు పోయారందరూ. దాన్ని చూసిన క్షణాన్నే అరాకెన్ ముఖం‌ పాలిపోయింది. కోపంతోటీ, అవమానం-తోటీ ఆమె పెదవులు వణికాయి.
చుట్టూ చేరిన స్త్రీలంతా అరాకెన్‌కు మళ్ళీ‌మళ్ళీ చెప్పారు- "అరాకెన్! అరాకెన్! చెప్పెయ్యి అరాకెన్! ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏథెనా తల్లిని క్షమించమని కోరు. ఆ తల్లి గొప్పదనాన్ని అంగీకరించు. దయగల ఆ తల్లి ఎవరినైనాక్షమిస్తుంది. నీ పనిని, ఆ తల్లి పనితనాన్ని చూశావుగా? ఇప్పుడు క్షమించమని అడిగి, నీ ఓటమిని అంగీకరిస్తే తప్పేముందు? నీ చిన్నతనాన్ని ఒప్పుకునేందుకు సిగ్గెందుకు? కావాలంటే నీ తరపున మేమే ఆ తల్లిని క్షమాపణ కోరతాం" అని గుసగుసగా ప్రాధేయపడ్డారు.
అరాకెన్‌కు భయం వేసింది. కానీ మొండితనాన్ని ఆమె భయం ఏమీ చెయ్యలేకపోయింది. ఆమె పొగరు ఏమాత్రం అణగలేదు. "దానిదేముంది?! నా చేతిపని ఆమె పనికి ఏమీ తీసిపోలేదు. ఆమె పనిలో ఎన్ని తప్పులున్నాయో మీకేం తెలుసు? నేను లెక్కపెట్టి చూపించినా మీకు అర్థం కాదేమో! నేను ఆమెను క్షమాపణ కోరేదేంటి?! ఆమె ఎవరు, అసలు?!..." అని ఇంకా ఏదేదో అనబోయింది.

ఏథెనా దేవత కళ్ ళు చింతనిప్పులయ్యాయి. ఆవిడ ఉగ్రరూపిణి అయి, ఉరుములాంటి స్వరంతో "చాలు! ఇక చాలు అరాకెన్! అహంకారం, పొగరు, నీ మనసును పూర్తిగా నాశనం చేశాయి. నీ నెత్తిమీద నువ్వే ఎక్కి కూర్చున్నావు. అలాగే కానియ్యి! దీని ఫలితాన్ని నువ్వూ, నీ రాబోయే తరాలూ, తప్పక అనుభవింతురుగాక! నువ్వూ, నీ సంతతీ ఇక నిరంతరం నేస్తూనే ఉంటారు. మనుషులు మిమ్మల్ని చూడగానే తరుముతారు. చీకటి మూలలే మీ గతి అవుతాయి. మీ అల్లికల్ని మనుషులు మెచ్చరు సరికదా, ఎప్పటికప్పుడు నాశనం చేస్తుంటారు. ఆ బాధకొద్దీ మీరు మళ్ళీ మళ్ళీ అల్లుకుంటూ జీవిస్తారుగాక!" అని అరాకెన్ నేసిన వస్త్రాన్ని పొడవాటి తన చేతికర్రతో నిలువునా చీల్చివేసి, ఆమె తలను బలంగా మోదింది. మరుక్షణం అరాకెన్ చిన్న పురుగులా మారిపోయింది!‌ ఆరు కాళ్లతో, వికారంగా ఉన్న ఆ పురుగు, పుట్టగానే వెలుతురును భరించలేనట్లుగా గబగబా ఓ మూలకు వెళ్ళిపోయింది.
వెనువెంటనే ఆ పురుగు నోట్లోంచి వెలువడ్డ బంకతో తీగలు సాగటం మొదలయ్యింది. ఆ తీగతో అది అల్లికలు మొదలు పెట్టేసింది కూడాను! అయితే అంతకు మునుపు అరాకెన్ వెలువరించిన గొప్ప అల్లికలు ఇప్పుడు లేవు- ఆ పురుగులు అల్లేవి అసలు వస్త్రాలే కావు! అంద విహీనమైన ఆ అల్లికల్ని చూడగానే నాశనం చేయబుద్ధి అయింది అందరికీ. ఆ పురుగులే, ఈనాటి సాలీళ్ళు!
క్షణం తీరికలేకుండా అల్లుతూ, అవి 'అహంకారం,పొగరు వద్దు' అని మనకి ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉన్నాయి.