కృష్ణాపురం గ్రామ పెద్ద సమధర్ముడు ఎంతో తెలివైనవాడు. సమస్యలకు పరిష్కారాలు, తీర్పులు చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి. సమధర్ముడు చెప్పే సందర్భోచితమైన సలహాలు, సూచనలు, తీర్పులూ గ్రామస్థులందరికీ నచ్చేవి. అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం ఉండేది.
రాను రాను సమధర్ముడి పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలుకూడా చాలామంది ఆయనదగ్గరకు వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించుకునేవాళ్ళు.
ఇది ఇలా ఉండగా, ఒకనాడు దేవలోకంలో దేవతలందరూ కలిసి సభ ఏర్పాటు చేసుకున్నారు: 'యమధర్మరాజు ఎంత కఠినమైన శిక్షలు వేస్తున్నాకూడా, భూలోకంలో మనుషులు మాత్రం మారటం లేదు. ఎందుకు?' అని వారంతా చర్చించుకుంటున్నారు.
చర్చ మధ్యలో, నారదుడు అన్నాడు"అందరికీ ఒకే తరహాలో చాలా కఠినమైన శిక్షలు వేస్తున్నాడు మన యమ ధర్మరాజు. అందుకే జనాలంతా వాటికి స్పందించటం మానేశారు. అయితే మరి భూలోకంలో సమధర్ముడు ఎంత చక్కగా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నాడంటే, మనుషులంతా వరసపెట్టి మారిపోతున్నారు" అని.
వెంటనే యమధర్మరాజుకి కోపం వచ్చింది. "ముందు ఆ సమధర్ముడు సమస్యల్ని ఎలా పరిష్కరిస్తున్నాడో చూస్తా- ఆ తర్వాత నారదుడి పని పడతా" అని వెంటనే మానవ రూపంలో సమధర్ముడు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు.
ఆ రోజున రంగన్న అనే రైతు పొలంలో దారినపోయే వ్యక్తులు ఐదుగురు దూరారు. మామిడి పండ్లు కోసుకొని ఆరగించ బోతూ పట్టుబడ్డారు. రంగన్న ఆ ఐదుగురినీ సమధర్ముడి దగ్గరికి తెచ్చి నిలబెట్టాడు. సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తాడో చూసేందుకు యముడితో పాటు చాలామంది వచ్చి నిలబడ్డారు.
సమధర్ముడు ఐదుగురినీ చూశాడు. మొదటివాడు, రెండోవాడు తల వాల్చుకొని నిలబడి ఉన్నారు. మూడోవాడు, నాలుగోవాడు తల మామూలుగా పెట్టుకొని ఉన్నారు. ఐదోవాడు తల ఎత్తి నిలబడి ఉన్నాడు.
"మీరు అందరూ అసలు తోటలోకి ఎందుకు వెళ్ళారు?" అడిగాడు సమధర్ముడు.
"మేం అందరం పట్టణం వెళ్ళేందుకు ఆటోలో బయలుదేరాం. దారి మధ్యలో అది చెడిపోయింది. మేం నడుస్తూ వెళ్తూ, ఈయన తోటలో ఆగాం. ఇలా పట్టుబడ్డాం" అన్నారు వాళ్ళు.
"అందరిదీ ఒకే ఊరా?" అడిగాడు సమధర్ముడు. "కాదు" అన్నారు వాళ్ళు.
సమధర్ముడి చూపు యమధర్మరాజు మీదికి ప్రసరించింది. "నువ్వెవరు? కొత్తవాడిలా ఉన్నావు?" అన్నాడు. "కొత్తవాడినే, నీ న్యాయ విచారణ ఎలా ఉంటుందో చూసేందుకు వచ్చాను"అన్నాడు.
సమధర్ముడు యమధర్మరాజును తీసుకొని, ఒక గదిలోకి వెళ్ళాడు. మొదటి వాడిని లోనికి రమ్మన్నాడు. "నీ పేరు, ఊరు, వృత్తి?" అడిగాడు సమధర్ముడు.
"అయ్యా, నా పేరు శ్యామ సుందరశాస్త్రి. మాది బాకారం. నేను పురోహితుడిని" అన్నాడు మొదటివాడు. "పండ్లు ఎందుకు కోసావు?" సమధర్ముడు అడిగాడు.
అతని తల మరింత వాలిపోయింది. "ఆకలేసింది.." అని గొణిగాడు.
"అయ్యా, శాస్త్రిగారూ, మీ ఇంటి ముందు నిలబడ్డ బిచ్చగాళ్ళు ఆకలితో 'అమ్మా అన్నం పెట్టు తల్లీ' అని అడుగుతారా, లేకపోతే మీ ఇంట్లోకి దూరి చేతికందింది తింటారా?అడిగాడు సమధర్ముడు.
అతని కళ్లలో నీళ్ళు తిరిగాయి. "అయ్యా! నన్ను మన్నించండి. తప్పు చేశాను. ఇకపై ఇట్లాంటి తప్పు ఎన్నడూ చేయను" అన్నాడు సమధర్ముడి కాళ్ళ మీద పడుతూ. సమధర్ముడు అతన్ని పట్టుకొని ఆపాడు. "మీరు మంచివాళ్ళు. అర్థం చేసుకోగలరు. ఇలాంటి తప్పు ఎన్నడూ చేయకండి" అని చెప్పి అతన్ని వదిలేశాడు.
"మరి శిక్ష..?" నివ్వెరపోయాడు యమధర్మరాజు. తర్వాత రెండవ వాడిని పిలిపించాడు సమధర్ముడు.
"నీ పేరు? వృత్తి? నీ వెందుకు నీ ఇలాంటి పని చేశావు?" అడిగాడు అతన్ని. "అయ్యా! నా పేరు కుబేరుడు. వ్యాపారిని. ఓ పండు తినేసి వెళ్తే నగరంలో టిఫిన్,భోజనాల ఖర్చులు మిగులుతాయని.." గొణిగాడు అతను.
"సరే, మరి ఊర్లో ఉన్న జనాలను పిలుస్తాను; నీ సరుకులన్నీ ఎత్తుకెళ్ళమంటాను; వాళ్ళకూ ఏదో కొంచెం మిగులుతుంది కద" అన్నాడు సమధర్ముడు.
శెట్టి కళ్ళు తేలవేశాడు. "అయ్యా !అంతపనిచేయకండి . నేను రెండు మామిడిపళ్ళు తిన్నమాట నిజం. వాటికి గాను ఆ రైతుకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పండి; డబ్బు ఇచ్చి నా తప్పును సరి దిద్దుకుంటాను" అన్నాడు. "ఐదు వందల రూపాయలు జరిమానా విధించాడు సమధర్ముడు.
కుబేరుడి ముఖం వికసించింది. చటుక్కున జేబులోంచి ఐదు వందల రూపాయలు తీసి ఇచ్చాడు. " అయ్యా, ఈ డబ్బుదేముంది, రెండు రోజులలో సంపాదించుకోగలను. ఊర్లో వాళ్లంతా ఒక్కో సరుకు ఎత్తుకెళితే 10వేలు పోవును గద!" అన్నాడు పోబోతూ. "ఆగాగు- జరిమానా కట్టావు కదా అని తప్పు మళ్ళీ చేసేవు- ఈసారి దొరికావంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది జాగ్రత్త!" వేలెత్తి బెదిరించాడు సమధర్ముడు.
"అయ్యో, స్వామీ! ఇక మీరు స్వయంగా వచ్చి నిలబడి తప్పు చేయమన్నా చేయను నేను.. మీ పాదాల ఆన" అని పాదాలంటి మొక్కి పోయాడు శెట్టి.
సమధర్ముడు మూడవ వాడిని రమ్మన్నాడు.
"నువ్వెందుకు దొంగ పని చేశావు?" అడిగాడు సమధర్ముడు.
"అయ్యా, నా పేరు రాజశేఖర్. ఆ రైతు పొలం బాగుంది; చక్కని కాత కాసింది అని చూస్తూ ఉన్నాను. అంతలో తెగి పడిన పండు ఒకటి కనిపిస్తే తిన్నాను తప్ప, వేరే ఏమీ లేదు" సమాధానం ఇచ్చాడు మూడోవాడు.
"నీ వృత్తి?" అడిగాడు సమధర్ముడు.
"వ్యవసాయం" అన్నాడతను.
"సరే, మరైతే ఇప్పుడు పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పు" అన్నాడు సమధర్ముడు.
"అయ్యా! అసలైతే నేను అక్కడ ఉండి ఉండకూడదు. ఉన్నాను, అడక్కుండా తిన్నాను- అది తప్పే. దానికి గాను మీ ఊరందరి ఉపయోగం కోసం నన్నేం చేయమంటే అది, సంతోసంగా చేస్తాను" అన్నాడు అతను. "అయితే సరే, వెళ్ళు. ఊరి బాగుకోసం నీకు నచ్చిన పని ఏదైనా చేసి పో" అని విడిచి పెట్టాడు సమధర్ముడు.
"ఏం పనో కూడా చెప్పలేదే..?" నోరు నొక్కుకున్నాడు యమధర్మరాజు.
నాలుగోవాడు వచ్చి చెప్పాడు- "అయ్యా! నా పేరు మల్లన్న. వయసు మల్ళిన అమ్మా నాన్నలు, భార్య, పిల్లలు- ఇంతమంది ఆధారపడి ఉన్నారు, నామీద. నా తల్లి దండ్రులు పెద్దవాళ్ళు; పిల్లలు చిన్నవాళ్లు. భార్య ఆరోగ్యం అంతంత మాత్రం కావడంతో నేనొక్కడినే పనిచేసి, వచ్చిన డబ్బులతో ఇంటిని గుట్టుగా నడుపుకుంటూ వస్తున్నా. నిన్న రాత్రి మాకు ఇంట్లో అన్నం సరిపోలేదు- ఇంటి పెద్దగా నేను కొంచెమే తిని ఊరుకున్నాను. అందువల్ల బాగా ఆకలిగా ఉండింది. చక్కని పండ్లు కనిపిస్తే ఆశకు లోనై తిన్నాను.
నేను అడగకుండా తినటం తప్పే. అందుకు గాను ఈ రోజంతా తమరు ఏ పని చెబితే అది చేస్తాను. కేవలం మాకుటుంబానికి సరిపడ భోజనం పెట్టించండి చాలు- ఇకమీద నేనెప్పుడూ ఇలాంటి పని చేయనంటే చేయను. నన్ను నమ్మండి" అన్నాడతను. సమధర్ముడు అతనికే వెంటనే పని కల్పించాడు.
"అదేం శిక్ష?!" అనలేక ఊరుకున్నాడు యమధర్మ రాజు.
5వ వాడు రంగు రంగుల జులపాలతో , చలువ కళ్ళద్దాలతో, కొత్త తరం బట్టలు ధరించి మెరిసిపోతున్న యువకుడు. అతను చెప్పాడు "అంకుల్!నా పేరు రాంకి. ఫ్రూట్స్ బాగా కనిపిస్తే కోసుకొని తిన్నా,అంతే" అని.
"మరి రైతు సంగతి ఎట్లా, రాంకి?" అడిగాడు సమధర్ముడు.
"నాకేంతెలుసు? నేనేమీ చెయ్యలేను. నా దగ్గర డబ్బులుకూడా ఏమీ లేవు. మీరెవ్వరూ నన్ను ఏమీ చేయలేరు" అన్నాడు రాంకీ. "చూడు నాయనా! మంచి ప్యాంటు, షర్టు, కళ్లజోడు- ఎంత బాగున్నావు! ఇరవై ఏళ్ళ యువకుడివి- ఇలా మాట్లాడరాదు.
ఏదోఒక విధంగా రైతుకు న్యాయంచేయాల్సిందే" అన్నాడు సమధర్ముడు. "నేను చిన్నప్పటినుండీ ఏనాడూ పనిచేసింది లేదు. అసలు పని చేయటం అంటేనే నాకు అసహ్యం. కావాలంటే వేరేవాళ్లచేత పని చేయించగలనేమో, చూస్తాను" అన్నాడు రాంకీ.
"సరేలే నాయనా! ఏమైనా చదువుకున్నావా?" అడిగాడు సమధర్ముడు. "లేదు! ప్రతి పరీక్షా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. అందుకని అవంటే ననాకు అస్సలు ఇష్టం లేదు" అన్నాడు అతను చిరునవ్వు నవ్వుతూ.
వెంటనే ఒకవ్యక్తికి చెవిలో ఏదో చెప్పి బయటికి వెళ్ళాడు సమధర్ముడు.
మరుక్షణం ఇద్దరు ముసుగు వీరులు లోనికి వచ్చి రాంకీని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. గబగబా అతని కళ్ళకి గంతలు కట్టారు. గబగబా అతన్ని కుళ్ళ బొడుస్తూ "ఒరేయ్, మేం ఇప్పుడు నీనుండి ఐదు లీటర్ల రక్తం తీసుకుంటాంరా! ఇంకొంచెం సేపటికి డాక్టరు గారు రాగానే నీ కిడ్నీ కూడా తీయిస్తాంరా! సోమరి పోతు వెధవా!" అ కుళ్లబొడవ సాగారు.
అప్పటివరకూ చిరునవ్వులు చిందించిన అతను ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకొని "అయ్యా ! వద్దయ్యా! మీరు వేరే ఏ పని చెబితే ఆ పని చేస్తాను! నన్ను కొట్టకండి!" అనిఏడవటం మొదలు పెట్టాడు.
వాళ్ళు అతన్ని కొట్టటం ఆపి "సరే! అయితే ఈ రోజంతా గొడ్లకు కాపలా ఉండు" అని చెప్పి వెళ్ళారు. వాడు రోజంతా మర్యాదగా తలెత్తకుండా గొడ్లు కాసి, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళాడు.
యమధర్మరాజు అసలు ఇవేం శిక్షలో అర్థం కాలేదు. సమధర్ముడి శిక్షలు సమానంగా ఎక్కడున్నాయి? మొదటి వాడిని ఊరికే పంపించాడు.రెండవ వాడికి చిన్న జరిమానా వేశాడు. మూడవ వానితోనేమో ఊరికి పనికొచ్చే పని ఏదైనా చేయమని చెప్పి పంపించేశాడు. నాలుగవ వాడికి జీతంతో పని కల్పించాడు. ఇక ఐదవ వాడిని చిదక బాదించి, వాడి చేత గొడ్లు కాయించి పంపాడు!
మరి అందరు చేసిన తప్పు పనీ ఒకటే క కదా?! శిక్షల్లో ఇంత భేదం ఉంటే ఎలాగ? అదే అడిగితే సమధర్ముడు నవ్వి,చెప్పాడు- "అయ్యా! నేరం చేసిన వాడికి శిక్ష అసలు ఎందుకు వెయ్యాలి? అతనిలో మార్పు తేవటం కోసం. అట్లాంటి బాహ్య చర్యలు తెచ్చే మార్పులు అందరిలోనూ ఒకేలా ఉండవు. వారి వారి వ్యక్తిత్వాలను బట్టి శిక్షలు వారిమీద వేరు వేరు ప్రభావాలను చూపుతుంటాయి. కావాలంటే మీరే స్వయంగా వాళ్ల ఇండ్లకు వెళ్ళి చూడండి. మొదటి వాడు నా మాటలకే బాధపడుతూ ఉంటాడు. చివరివాడు ఆ దెబ్బలను కూడా లెక్క చేయకుండా ఉంటాడు. పోయి చూసి రండి, మీకే తెలుస్తుంది" అన్నాడు.
యమధర్మరాజు ఆ ఐదుగురి ఇండ్లకూవెళ్లి చూశాడు. నిజంగానే అంతా సమధర్ముడు చెప్పినట్లుగానే ఉంది: మొదటివాడు ఇంకా బాధ పడుతూనే ఉన్నాడు; చివరివాడు అంతా దులపరించుకొని పోయాడు!
"సమధర్ముడు చెప్పింది నిజం. శిక్షలు వేయాల్సింది వ్యక్తుల్లో మార్పు రావటం కోసం. అట్లా కాక వాళ్ళు మరణించేలాగా చేస్తే, అది కక్ష అవుతుంది తప్ప, శిక్ష కాదు. మనసుని బట్టి శిక్ష ఉండాలి- అంతే" అని యముడు కూడా నిట్టూర్చాడు.