చింతపర్తిలో రంగయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు. కొడుకులు పెద్దవాళ్ళయ్యాక ఒక్కొకరికీ ఒక్కో వ్యాపారాన్ని ఒప్పజెప్పి విశ్రాంతిగా రోజులు గడుపుతున్నాడు. మొదటి ఆరుగురు కొడుకులకీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక ఏడవ వాడికి కూడా పెళ్ళి చేసేసి, ఏడుగురు కొడుకులూ-కోడళ్ళ చేత షష్టిపూర్తి చేయించుకోవాలని షావుకారుకి కోరిక కలిగింది. వచ్చే ఏడాదికే ఆయనకి అరవై ఏళ్ళు నిండుతాయి. ఏడవ కొడుక్కి కూడా త్వరగా సంబంధాలు తీసుకురమ్మని పెళ్ళిళ్ళ పేరయ్యని తొందర పెట్టసాగాడు ఆయన.

ఆ ఊళ్ళోనే ఉండే మరో షావుకారు తిరుమలయ్యకి ఈ సంగతంతా తెలిసింది పేరయ్య ద్వారా. తిరుమలయ్యకి ఒక్కగానొక్క కూతురు సరోజ. ఒకే కూతురు కావటంతో ఆ పిల్లని అతి గారాబంగా పెంచాడు రంగయ్య. దాంతో ఆ పిల్లకి ఏ పనీ చేత కాకుండా అయ్యింది.

రంగయ్య కొడుక్కి గనక తన బిడ్డను ఇస్తే, ఆ అమ్మాయి ఉన్న ఊళ్ళోనే, కంటికెదురుగా, కుదురుగా ఉంటుందనుకున్న తిరుమలయ్య పెళ్ళిళ్ళ పేరయ్యకి బాగా డబ్బు ముట్టచెప్పి, 'ఏదో ఒక రకంగా ఈ సంబంధం కుదర్చాల్సిందే' అని నొక్కి చెప్పాడు.

పేరయ్య నేరుగా వచ్చి ఈ సంబంధం సంగతి రంగయ్యతో‌ ప్రస్తావించాడు. వివరాలు వినగానే రంగయ్య భార్య "అయ్యో! ఆ పిల్లకి ఒక్క పని కూడా చేతకాదుటండీ!" అంది. ఊళ్ళో ఆవిడకి తెలీని సమాచారం నిజంగానే ఏమీ లేదు మరి!

"పని చేతకాకపోతే ఏమిలే- చిన్నగా నేర్చుకుంటుంది" అన్నాడు రంగయ్య, షష్టిపూర్తి చేయించుకోవాలనే తొందరలో.
నెల తిరక్కుండానే ఏడో కొడుకుకి సరోజనిచ్చి పెళ్ళి జరిపించి, వెంటనే అత్తవారింటికి కూడా తీసుకొచ్చారు. అత్తగారింట్లో సరోజ ఒక్క పనీ చేయదు. ఎవరైనా ఏదైనా పని చెప్పినా, సగం చేసి సగం వదిలేసేది. లేకపోతే ఒక్కోసారి తికమకగా, ఎంత గందరగోళం చేసేదంటే ఆమె చేసిన పనిని సవరించుకోవటం ఇంకా పెద్ద పని అయ్యేది. ఎప్పుడూ రాణిలాగా బట్ట నలక్కుండా గదిలో కూర్చుని ఉండే సరోజని చూస్తే మిగిలిన తోడికోడళ్లు ఆరుగురికీ కడుపు మంటగా ఉండేది.

షస్టిపూర్తి పండగ దగ్గర పడుతోంది. ఆరుగురు తోడికోడళ్ళూ ఒక చోట చేరి, 'వచ్చిన చుట్టాలందరికీ మనమే ఎందుకు వడ్డించాలి? అందరం పనులు వంతులు వేసుకుందాం' అనుకున్నారు. అత్తగారి దగ్గరకు చేరారు. విషయాన్ని మెల్లగా ఆమె చెవిన వేశారు. అత్తగారు సరోజను కూడా పిలిచారు-
"ఆ! ఇప్పుడు చెప్పండి. ఎవరు ఏం పనులు చేస్తారో" అంది అత్తగారు.

"నేను విస్తళ్ళు వేస్తా" అంది పెద్ద కోడలు.

"నేను అన్నం వడ్డిస్తా" అంది రెండో ఆమె.

"నేను పిండివంటలు వడ్డిస్తా" అంది మూడో ఆమె.

ఈ విధంగా మిగతా ముగ్గురూ 'కూరా, పప్పూ. పచ్చడీ' అని చెప్పారు.
ఏడో ఆమెకి ఏం చెప్పాలో తెలియలేదు.

"విస్తళ్ళు తీసేయమనండి" అంది పెద్ద తోడికోడలు.

"సరే! నువ్వు విస్తళ్ళు తీసేయమ్మా" అంది అత్త.

సరోజ తల ఊపి తన గదిలోకి వెళ్ళింది.

షష్టిపూర్తి పండగ రోజు రానే వచ్చింది. బంధువులు అంతా వచ్చారు. కార్యక్రమాలన్నీ ముగిశాయి. అందరూ భోజనాలకి కూర్చున్నారు. పెద్దామె విస్తళ్ళు వేసింది. రెండో ఆమె అన్నం వడ్డించింది. మిగతా నలుగురూ వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్న పదార్ధాలను వడ్డించసాగారు.

అందరూ తిందామనుకునేలోపు ఏడో ఆమె వచ్చింది. విస్తళ్ళన్నీ ఉండచుట్టి తీసేయసాగింది. విస్తళ్ళముందు కూర్చున్న బంధువులందరూ విస్తుపోయారు. కొందరు మొహమాటం కొద్దీ లేచి పోబోయారు. కొందరు విస్తళ్ళు వెనక్కి లాక్కొని గొడవ పెట్టుకోసాగారు.

పనులు పంచుకున్న సంగతి భార్య ద్వారా వివరంగా విన్న రంగయ్య పాపం షష్టిపూర్తి రోజున తల బాదుకున్నాడు. తోడికోడళ్ళూ, అత్తా ఏడుపు ముఖాలు పెట్టారు. సంగతి తెలుసుకున్న బంధువులు పకపకా నవ్వారు.

వియ్యంకుడు తిరుమలయ్య చాలా బాధ పడ్డాడు. బిడ్డ సరోజను ఇంటికి పిలుచుకెళ్ళాడు. పనులన్నీ నేర్చుకునేంత వరకూ అత్తవారింటికి పంపించేది లేదని గట్టిగా చెప్పాడు. సరోజ కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నది. మనసుపెట్టి పనులన్నీ‌ నేర్చుకున్నది. ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంటున్నది!