ఒక మేకల కాపరికి చాలా మేకలున్నాయి. అతను రోజూ ఆ మేకలన్నిటినీ అడవికి తీసుకెళ్తూ ఉండేవాడు.
ఒకసారి వాటిల్లో మేక ఒకటి మందలోంచి విడిపోయింది. దారి తప్పి, అటూ ఇటూ తిరిగి తిరిగి అలసిపోయి తనకు కనబడ్డ ఓ గుహలోకి దూరి పడుకున్నది.
ఆ గుహ ఒక తెలివి తక్కువ సింహంది. మేక పడుకునే సమయానికి ఆ సింహం వేటకని బయటికి వెళ్ళి ఉన్నది. కొంత సేపటికి వెనక్కి తిరిగి వచ్చిన సింహం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది: తన గుహలో ఎవరో దూరారు! నిద్రపోతున్నట్లు నటిస్తున్నారు!
అంతకు ముందు ఎన్నడూ సింహం అలాంటి జీవిని చూసి ఉండలేదు: పెద్ద గడ్డం,వాడిగా ఉన్న కొమ్ములూ, చూసేందుకు చిన్నగానే ఉన్నా, బలిష్ఠంగా వంపులు తిరిగి ఉన్న శరీరం!- ఆ వింత జంతువును చూడగానే సింహానికి భయం వేసింది. గుహలోంచి బయటికి పరుగెత్తి, గుహద్వారం ముందు అటూ ఇటూ తిరుగుతూ పచార్లు చేయటం మొదలెట్టిందది.
అలికిడికి నిద్రలేచిన మేక, సింహాన్ని చూసి చాలా భయపడ్డది. అయితే సింహం తోకముడుచుకొని బయటికి పరుగెత్తటం చూసేసరికి, దానికి ఎక్కడలేని తెగింపూ వచ్చేసింది. అది నేరుగా గుహ ముందుకే వెళ్ళి, "ఎవర్రా నువ్వు?!" అంటూ సింహాన్ని గద్దించింది. "నేను సింహాన్ని" భయం భయంగా చెప్పింది సింహం.
"రా! ఒక్క సింహాన్నయినా చంపనిదే ఈ గడ్డాన్ని తీసేది లేదని ప్రతిజ్ఞ చేశాను. రా, ఇప్పుడు నిన్ను చంపి నా గడ్డానికి విముక్తి కలిగిస్తాను" అని ఒక్క ఉదుటున సింహం మీదికి దూకింది మేక.
హడలిపోయిన సింహం పరుగే పరుగు. 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ మేకపోతు మరో వైపుకు పరుగు!