మిథిలా నగరపు మహారాజు నివసించే రాజ మహలుని ఆనుకొని ఉన్న అడవిలో ఓ పక్షి ఉండేది- అది చాలా శ్రావ్యంగా పాటలు పాడేది. రాజమహలును చూసేందుకు వచ్చిన యాత్రికులు పక్షి పాడే పాటలు వినటంకోసం అడవిలోకి కూడా వెళ్తుండేవాళ్ళు.
అయితే రాజుగారు మటుకు దాన్ని ఎప్పుడూ చూడలేదు. అందరూ దాన్ని గురించి చెప్పుకోగా విని విని ఒకసారి ఆయనకు దాన్ని చూడాలని కోరిక కలిగింది. రాజుగారు అనుకుంటే కానిదేమున్నది? భటులను పంపించాడాయన- "పాటలు పాడే పక్షిని వెతికి పట్టుకొని రండి!" అని.
భటులు అడవంతా తిరిగారు. చెట్టూ పుట్టా అంతటా గాలించారు. అడవిలో తిరిగి తిరిగి అలసిపోయారు. కనబడిన వాళ్లనల్లా అడిగారు. చివరికొక పాప చెప్పింది- "నేను చూశాను దాన్ని!" అని. "నా పని ముగించుకొని సాయంత్రం ఇంటికి పోతున్నానా, నిన్న?! అప్పుడు కనిపించిందది. నావెంటే వచ్చింది కూడా. మంచి మంచి పాటలు పాడుతూ నా అలసటను పోగొట్టింది"
ఇలా చెబుతూ ఆ పాప పక్షిలాగానే చక్కగా పాడింది- "నా బంగారు పక్షీ! మా రాజావారు నీ తియ్యటి పాట వినాలని కోరికగా ఉన్నారు. మరి నువ్వు వారి కోరిక తీర్చరాదా?!" అని పాడింది.
పాప పాట వినగానే ఎక్కడినుండి వచ్చిందో మరి, పాటలు పాడే పక్షి అక్కడికి వచ్చేసింది. "నా పాటలు విని అడవిలోని చెట్లు, జంతువులు అన్నీ తృప్తిగా ఉంటున్నాయి కదా, ఇప్పుడు రాజా వారిని కూడా నా పాటతో సంతోషపెడతాను" అని భటులతోపాటు రాజభవనానికి బయలుదేరింది.
మరునాడు రాజుగారి కొలువులో పక్షి సంగీత కచేరి చేసింది. ఆ గానానికి సభలో ఉన్నవారంతా పరవశించి పోయారు. రాజుగారు ఎంత ముగ్ధులైపోయారంటే, ఆనందంతో ఆయన కళ్ళలో నీరు నిండింది. "ఓయి సంగీతపు పక్షీ! నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండిపో! నీ పాట వింటూ నేను రాజ్యపరిపాలనలోని శ్రమనంతా మరచిపోగలను. మా ఆస్థానంలో ఉంటూ నువ్వు ప్రజలందరికీ సంతోషం కలిగించినదానివౌతావు" అన్నారు.
రాజుగారి కళ్లలో కనిపించిన ఆదరానికి పక్షి కరిగిపోయింది. "సరే మహారాజా! మీ సంతోషం కోసం నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను" అన్నది.
మరుసటిరోజుకల్లా రాజుగారు పక్షికోసం బంగారు పంజరాన్నొకదాన్ని తయారు చేయించారు. ఏనాటికానాడు దానికి నచ్చే పండ్లు, కాయలు, గింజలు అన్నీ తెచ్చిపెట్టసాగారు. దాన్ని అపురూపంగా చూసుకోసాగారు.
రాజుగారు ఆదరించే సరికి, సంగీతపు పక్షికి మరింత పేరు వచ్చింది. దాని ఖ్యాతి ఇప్పుడు రాజ్యం నలుమూలలకూ విస్తరించింది. ప్రతిరోజూ రాజుగారు దాని చేత పాటలు పాడించుకొని వినేవాళ్ళు. దాని సంగీతంతో తన శ్రమను మరచిపోయేవాళ్ళు.
ఒకరోజున ఆస్థానానికి రైతులు కొందరు వచ్చారు. సంగీతపు పక్షి పాటను విని వాళ్ళు అందరిలాగా "ఆహా! ఓహో!" అనలేదు. "బాగుంది.. పర్లేదు" అన్నారు. ఆ తర్వాత తమకు ఎదురవుతున్న కష్టాలను వివరించారు రాజుకు.
అప్పుడు సంగీతపు పక్షి రాజుగారితోఅన్నది- "ప్రభూ! తమరు అనుజ్ఞ ఇస్తే నేను వీరివెంట వెళ్లి, మన గ్రామాలన్నీ చుట్టి వస్తాను. ప్రజల కష్ట సుఖాలతో నిమిత్తం లేని సంగీతం సంగీతం కాదు కదా! వారి జీవితాలను గమనించిరావటం వల్ల నా సంగీతం మరింత సుసంపన్నం అవుతుందని నా నమ్మకం" అని.
రాజుగారు అనుమతించారు. పక్షి దేశ సంచారం మొదలు పెట్టింది. దేశంలోని శ్రమజీవుల జీవితాలను నేరుగా గమనించింది. ప్రజల జీవితాలకు, ప్రభువుల జీవితాలకు అసలు పొంతన లేదు. ప్రజల కష్టాలు వేరు; ప్రభువుల కష్టాలు వేరు. ప్రజల బ్రతుకులను చూస్తున్న పక్షి కాల గమనాన్ని మరచిపోయింది. వెనక్కి వెళ్ళాలన్న సంగతే గుర్తు రాలేదు దానికి.
అయితే అక్కడ, రాజుగారు సంగీతపు పక్షి కోసం కలవరించటం మొదలుపెట్టారు. దానిపై బెంగతో ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. క్రమంగా ఆయన మంచం పట్టారు. ఆయన పరివారం అంతా ఆందోళన చెందసాగింది.
గ్రామాల్లో తిరుగుతున్న పక్షికి ఆ సంగతి తెలిసే సరికి చాలా సమయం పట్టింది. వార్త అందిన మరుక్షణం అది బయలుదేరి వచ్చింది రాజుగారి దగ్గరికి. మంచం మీద ఉన్న రాజుగారు దాన్ని చూసి చిరునవ్వు నవ్వారు. ఆయన ప్రక్కనే చేరిన పక్షి పాట మొదలు పెట్టింది. విషాదాన్నీ, ఆశనూ ప్రతిఫలించే ఆ పాటని అది ఎంత అద్భుతంగా పాడిందంటే, దాన్ని విన్నవాళ్లంతా పరవశించి పోయారు. మరునాటికల్లా రాజుగారి ఆరోగ్యం కుదురుకున్నది.
ఆయన అన్నారు పక్షితో- "ఓ సంగీతపక్షీ! నీ గానం అలౌకికం! నీ పాట అద్భుతం. మధురమైన నీ గానం నుండి నన్ను ఇక ఏనాటికీ దూరం చెయ్యనని మాట ఇవ్వు" అని. పక్షి ఏమీ మాట్లాడలేదు.
"నీ పాటలో ఇప్పుడు ఇదివరకటికంటే ఎక్కువ భావం వినవస్తున్నది. మిత్రమా, ఇంతకూ నీ గానానికి ఇంత బలం ఎక్కడినుండి వచ్చిందో ! ఏ బ్రహ్మ నీ పాటకు ఇంత జీవాన్నిస్తున్నాడో! నువ్వే చెప్పాలి, ఊరికే ఉంటే కుదరదు" అన్నారు రాజుగారు.
పక్షి అన్నది- "ప్రభూ! మీ దగ్గరనుండి వెళ్ళాక సాధారణ పౌరులను చాలామందిని కలిశాను. ప్రజల జీవితాలను దగ్గరగా చూడగల్గాను. నా సంగీతంలోకి అలా జీవం ప్రవేశించింది. అంతకు ముందు నేను పాడిన పాట అందమైనదే- కానీ దానిలో ప్రాణం లేదు. ప్రజల జీవితాలకు దూరమైన సంగీతం నిజంగానే సంగీతం కాదు అని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఆజ్ఞాపించినట్లు నేను మీదగ్గరే ఉండిపోతానేమో; కానీ కాలం గడిచేకొద్దీ నా సంగీతంలో జీవం తగ్గిపోతుందేమో అని, సంకోచిస్తున్నాను" అని.
రాజుగారు స్వతహాగా మంచివాడు. పక్షి మాటలలోని అర్థం ఆయన్ని ఆలోచింపజేసింది. కొంతసేపు మౌనంగా ఉండి, ఆయన ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ తర్వాత అన్నారు చిరునవ్వు నవ్వుతూ- "మరైతే నువ్వు మళ్ళీ రాజ్య సంచారానికి పోవచ్చు. కానీ కనీసం నెలకొకసారి నాకు కనబడాలి. ఆనెలరోజుల్లోనూ నువ్వు నేర్చుకున్న పాటలు నాకూ నేర్పాలి. నా పాలనకూడా సజీవం కావాలిగా, మరి?!" అని.
పక్షి సంతోషంగా తలూపింది. అటుపైన అది ప్రతినెలా తిరిగివచ్చి రాజుగారికి ఒక క్రొత్త పాటను నేర్పింది. ప్రతి పాటలోనూ తను చూసిన ప్రజల జీవితాలను ప్రతిబింబింపజేసిందది. ఆ సంగీతం వల్ల రాజుగారి పాలన నిజంగానే మానవీయం అయ్యింది!