అది వెలుగంటే పరిచయం లేని రాత్రి. ఆ అమావాస్య ఉండేది ప్రతీరోజూ...! అంత దట్టమైన అడవి అన్నమాట అది.
ఆ అడవిలో నివసిస్తున్నారు ఒక అడవి జాతి జంట. వాళ్ళ పేర్లు - దేవుల రత్తమ్మ, సీతయ్య. వాళ్ళిద్దరికీ ఒక అందమైన బాబు. వాళ్ళ కలల పంట ఆ బాబు. వాడిని అల్లారుముద్దుగా పెంచుతున్నారు వాళ్లు.
రాత్రనక, పగలనక బాబు అలవకుండా సేవలు, ముద్దుముచ్చట్లు, ఆటలు, పాటలు. ఎన్నెన్ని ఆటలు, పాటలు నేర్పారో ఆ బాబుకు. అడవిలో బాబుకు తెలియని చోటంటూ లేదు, బాబు చూడని జంతువంటూ లేదు. అమ్మా నాన్నలే అతని గురువులైనారు. అడవిలో చుట్టూ ఉన్న చెట్లు, పుట్టలు- ఏవి దేనికి ఉపయోగపడతాయో ఆ బాబుకు నేర్పించారు. ఆనందం, ఏడుపు, జాలి- అన్నీ (దేనికి, ఎందుకు, ఎలా, ఏమిటి) నేర్పించేసరికి ఆ బాబు పెరిగి పెద్దవాడయ్యాడు.
అబ్బాయి తెలివైనవాడు. మరి వాడు పల్లెకే పరిమితమై ఎందుకు ఉండాలి? దూరంగా ఉన్న పట్టణంలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు అతను. రత్తమ్మ, సీతయ్యల సంతోషానికి మేర లేదు.
అటుపైన అబ్బాయికి పెళ్ళి కళ వచ్చిందని మరో పట్టణం పాపను చూసి పెళ్ళి చేశారు గూడెం దొరలంతా.
కాలం గడిచింది. మెల్లగా రత్తమ్మా, సీతయ్య ముసలివాళ్ళయ్యారు.
కొడుకు, కోడలు పట్నంలో కుదురుకున్నారు. సంపాదనలో పడ్డారు. తమదంటూ ఓ కుటుంబం ఏర్పరచుకున్నారు. ముసలివాళ్లను పట్టించుకోవటం మానేశారు.
అలా పల్లెటూరినుండి పట్నానికి వలస పోయిన ఉద్యోగికి చాలాసార్లు తన తల్లితండ్రుల బాధ గుర్తుకొచ్చింది. కానీ అతని ఆలోచనల్లోని డబ్బు అతన్ని తన వైపుకు మళ్ళించుకున్నది.
ఆ తరువాత ఆ తల్లితండ్రులు ఆ అబ్బాయి చిన్నప్పుడు ఊగిన ఉయ్యాల, తిన్న బుల్లి కంచం, అతను పడుకున్న మంచాలను చూసుకుంటూ తుదిశ్వాస విడిచారు.
ఇదీ ఈనాటి సమాజం...