చింతలగుంట బడిలో చదివే విజయ్, ఆదినారాయణ ఇద్దరూ మంచి స్నేహితులు. ఆది నారాయణది ధనిక వ్యాపార కుటుంబం. విజయ్‌ది పేద రైతు కుటుంబం. విజయ్ శ్రద్ధగా మనసు పెట్టి చదివేవాడు; ఆది నారాయణేమో పైపైన చదివి, అరకొర మార్కులతో పాసయ్యేవాడు.
పదవ తరగతి పరీక్షల సమయం: మిత్రులిద్దరూ కలిసి చదువుతున్నారు. అకస్మాత్తుగా ఆదికి భయం మొదలయింది. “ఒరే, విజయ్! నాకు సైన్సు రాదురా! అన్నీ మర్చిపోయాను. రేపు పరీక్షలో తప్పుతానురా!” అని ఏడవటం మొదలు పెట్టాడు వాడు.
విజయ్ తన సాధనను ప్రక్కన పెట్టి, ఆదికి ధైర్యం చెప్పాడు. “చూడు, నీకు అన్నీ వచ్చు. ఊరికే 'రావు' అనుకోకు. కావాలంటే ఇదిగో ఈ ఐదారు ప్రశ్నలు చూడు- ఇవి పరీక్షలో తప్పక వస్తాయి. ఇవి సాధన చేసి పెట్టుకో" అని రకరకాలుగా చెప్పి, బుజ్జగించి, వాడి చేత సాధన చేయించాడు.
ఆశ్చర్యం! మరునాటి రోజు పరీక్షలో విజయ్ చెప్పిన ఐదారు ప్రశ్నలూ వచ్చాయి! ఆది వాటిని చక్కగా చేశాడు. పరీక్షల్లో ఎప్పటి మాదిరే అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. * పదో తరగతి తర్వాత మిత్రులిద్దరూ విడిపోయారు. ఆది వాళ్ల నాన్న వ్యాపార రీత్యా పట్టణం వైపుకు వెళ్ళిపోయాడు. విజయ్ పల్లెలోనే ఉండిపోయాడు. తండ్రి వ్యవసాయం బరువు ఇప్పుడు విజయ్ భుజాలమీద పడింది. స్వతహాగా తెలివైన వాడు కావటంతో విజయ్ వ్యవసాయాన్ని చక్కగా చేశాడు. అతనికి పెళ్లయింది; ఒక కొడుకు పుట్టాడు.
అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో అకస్మాత్తుగా విజయ్ కొడుకు రవికి నడుము నొప్పి మొదలయింది. పల్లె వైద్యం పని చెయ్యలేదు. భార్య సరితను వెంటబెట్టుకొని విజయ్ పట్టణం చేరుకున్నాడు. అక్కడో పెద్ద ఆస్పత్రిలో రవిని చేర్పించాడు. డాక్టర్లు రకరకాల పరీక్షలు నిర్వహించారు. రవికి మూత్రపిండాల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఏర్పడి ఉన్నాయి. ఆపరేషన్ మినహా వేరే మార్గం లేదు. పది లక్షల రూపాయలు అవుతుంది. ఈ రంగంలో ప్రపంచఖ్యాతి గాంచిన డా.రావు గారు తప్ప ఇతరులెవ్వరూ నయం చెయ్యలేని అరుదైన సమస్య ఇది..
విజయ్ పల్లెకు తిరిగి వచ్చి తన పరిస్థితిని అంచనా వేసుకున్నాడు. తన ఇల్లు, పొలం, చేను అన్నీ అమ్మితే పన్నెండు-పదిహేను లక్షల వరకూ రావచ్చు.. కానీ తర్వాత బ్రతికేదెలాగ?!
ఏదయితే అది అవుతుందిలెమ్మని, తన ఆస్తులన్నిటినీ కుదువపెట్టి, పది లక్షల డబ్బుతో పట్నం చేరాడు విజయ్. అనుకున్నట్లుగానే రవి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. మూడవ రోజున ఆస్పత్రివాళ్ళు రవిని ఇంటికి వెళ్ళిపోవచ్చునన్నారు. మందులు రాసి ఇచ్చారు. విజయ్ డబ్బు చేతబట్టుకొని బిల్లు చెల్లించేందుకు వెళ్ళాడు.
ఆశ్చర్యం! ఆ సరికే బిల్లు చెల్లించి ఉన్నది! డా.రావు గారు స్వయంగా ఆస్పత్రి ఖర్చులన్నిటినీ చెల్లించేశారు!
విజయ్ నిర్ఘాంతపోయాడు. డాక్టరుగారిని కలిసి అడిగాడు- “మీరు మావాడి బిల్లును మాఫీ చేసినందుకు ధన్యవాదాలు..కానీ.. తమరు ఇలా ఎందుకు చేశారో తెలుసుకోవచ్చునా.. ఎందుకింత దయ..?”
“ఇందులో దయ ఏమీ లేదు విజయ్, నీ దయవల్ల నేను డాక్టరును అయ్యాను; ఇప్పుడు ఈ మాత్రం చెయ్యక పోతే ఎలాగ..?” “నాకు అర్థంకాలేదు రావు గారూ..?”
“ఇంకా అర్థం కాలేదా, ఒరే, నన్ను సరిగ్గా చూడరా, నేనురా, ఆదిని!” డాక్టరు రావుగారు కళ్లజోడు తీసి నిండుగా నవ్వారు. విజయ్ మరోసారి నిర్ఘాంతపోయాడు.
“నీ చేత సైన్సు చెప్పించుకొని పదో తరగతి పాసయ్యాను కదా, ఆ తర్వాత పట్టుదలకొద్దీ సైన్సే చదివానురా. డాక్టరునయ్యాను; విదేశాలకెళ్ళాను; డబ్బు, పేరు సంపాదించుకున్నాను.
నీకోసం చాలా వెతికాను. ఇన్నాళ్లకు దొరికావు!" అని విజయ్‌ని కౌగిలించుకున్నారు, డా.ఆది నారాయణ రావు గారు! విజయ్, ఆదిల స్నేహం అటుపైన కలకాలం వర్థిల్లింది.