పూజ, రవి, వీణ , రఘు, శ్రీకర్.. వీళ్లంతా మిత్రులు. కిరణ్, రమేష్ కూడా మిత్రులే; కానీ వాళ్ళకీ వీళ్ళకీ పడేది కాదు. దేనికైనా ఒక వర్గం వాళ్ళు ఔనంటే, మరో వర్గం వాళ్ళు కాదనకుండా ఉండేవాళ్ళు కాదు. చిన్న చిన్న విషయాలకు కూడా అంతా గొడవ పడుతుంటే ఉపాధ్యాయులు తలలు పట్టుకొని కూర్చుండిపోయేవాళ్లు.

ఒక రోజున పూజ మిత్రులు అందరూ కొండ ఎక్కేందుకు బయలుదేరి పోయారు. కొండ మీద పాడుబడ్డ కోట ఒకటి ఉండేది. దాని చుట్టూ చాలా గుహలు ఉండేవి. అక్కడికి చేరుకున్న మిత్రులంతా కోట బయట చింత చెట్టు క్రింద కూర్చొని ఏం చేయాలో ఆలోచించసాగారు.

అంతలో వాళ్లలో ఒకరికి అనుమానం‌వచ్చింది: "కోటలో దయ్యాలుంటే ఎలాగ?" అని. కొందరు "ఏమీ పరవాలేదు" అన్నారు. కొందరు భయపడ్డారు. కొందరు "దయ్యాలు అసలు లేవు" అన్నారు. ఇట్లా కొంతసేపు చర్చ జరిగేసరికి వాళ్లలో అంతవరకూ భయపడని వాళ్ళకు కూడా చాలా మందికి భయం వెయ్యటం మొదలయ్యింది.

అంతలో- కోటలోంచి పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి! భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపించసాగాయి!! పిల్లలంతా భయంతో వణికిపోయారు. పారిపోదామంటే ఎవ్వరికీ కాళ్ళు రాలేదు. అందరూ గుంపుగా ఒక చోటచేరి నిలబడ్డారు. అంతలో అరుపులు ఆగిపోయాయి- గరుకుగా, కరకుగా ఉన్న గొంతొకటి, కోటలోంచి వెలువడింది:

"అహ్హహ్హ! ఇన్నాళ్ళకు నాకు తగినంత ఆహారం లభించింది. తృప్తిగా కడుపునిండా తిని ఎన్ని సంవత్సరాలవుతోందో!! ఇక ఎవ్వరూ‌ చప్పుడు చేయకండి. ఒక్కరొక్కరుగా నాకు ఆహారం అవుదురుగాని!" అని.

మిత్రులంతా గందరగోళంగా వేడుకున్నారు- "మమ్మల్ని క్షమించండి భూతంగారూ, ఇంక ఎప్పుడూ ఇక్కడికి రామంటే రాము" అన్నారు గజిబిజిగా.

"ఆఁ..రామంటే ఎలాగ? నా ఆకలి తీరద్దూ?!" అరిచింది భూతం, కోటలోంచే. "అంతగా వేడుకుంటున్నారు గనక ఈ రోజుకి మిమ్మల్ని వదిలేస్తా- కానీ‌ ఇకనుండి రోజూ నాకు సరిపడేంత ఆహారం పంపాలి మీరు. మనుషుల్లో‌తిరిగేందుకు గాను నాకు ఏ పూటకాపూట డబ్బులు కూడా పంపాలి. చెప్పండి! మీ వల్ల అవుతుందా?" అంది. ఇక వేరే దారి లేక, "ఓఁ.. తప్పకుండా పంపిస్తాం. మాట తప్పం" అని పిల్లలంతా దానికి మాట ఇచ్చేసి, "బ్రతుకు జీవుడా" అనుకుంటూ కొండ క్రిందికి పరుగుతీశారు. ఏదో‌ మాట అయితే ఇచ్చారుగానీ, రోజూ దానికి భోజనం, డబ్బులు ఎక్కడినుండి తెస్తారు వాళ్ళు?! తెల్లవారు జామునే మిత్రులంతా తిరిగి సమావేశమయ్యారు.

"ఇవాళ్ళ ఎవరు ఏం తెస్తారో చెప్పండి" అడిగాడు రవి, అందరినీ. "ఇవాల్టికి ఏదో‌ఇస్తాం, మేం‌ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో అన్నమే ఇస్తాం. కానీ రోజూ ఇలా కుదరదు" గట్టిగా చెప్పాడు రఘు. అందరూ అవునన్నట్లు తల ఊపారు.

అంతలో అక్కడికి వచ్చారు కిరణ్, రమేష్- "ఏమైంది, మేమేమైనా సాయం చెయ్యాలా?" అంటూ.

సమస్య వినిపించారు మిత్రులంతా.

"బలే ఇరుక్కున్నారే! భూతానికి మాట ఇవ్వకుండా ఉండాల్సింది అసలు, తీరా మాట ఇచ్చాక ఇప్పుడు చేసేదేమున్నది?! మీరు రోజూ డబ్బులు, ఆహారం పంపాల్సిందే. 'బెగ్-బారో-స్టీల్' అన్నాడు ఇంగ్లీషువాడు. "అడుక్కో-అప్పుతెచ్చుకో-దొంగిలించుకో" అని. ఇప్పుడిక మీరు దొంగిలించటమే మార్గం." అన్నారు కిరణ్, రమేష్.

పూజ వాళ్లకి వేరే మార్గం ఏదీ తోచలేదు. 'ఒకసారి ఒప్పుకున్నారు కాబట్టి ఏదో ఒకరకంగా భూతం ఆకలి తీర్చాల్సిందే' అనిపించింది వాళ్లకు. ఏ రోజుకారోజు చిన్నచిన్న మొత్తాలు దొంగిలించి కోటలో వదిలి రావటం మొదలుపెట్టారు.

అయితే ఇలా మూడు రోజులు గడిచేసరికి, పిల్లల మనసుకు కష్టం అనిపించింది. 'ఇది తప్పు పని కదా, ఇట్లా ఎన్నాళ్ళు?' అని ఆలోచించటం మొదలు పెట్టారు వాళ్ళు.

ఆ రోజున శ్రీకర్ అన్నాడు: "చూడండి! మనం ఇక ఊరుకోరాదు. భూతం పని పట్టాల్సిందే. లేకపోతే ఇట్లా తప్పు పనులు చేస్తూ చేస్తూ మెల్లగా మనందరం భూతాలం అయిపోతాం" అని.

"మరెలారా, ఏం చేద్దాం?" అంది వీణ.

"భూతాలకు నిప్పు అంటే భయంట. మనం ఇవాళ్ళ వెళ్ళి కోట కిటికీలోంచి గడ్డీ గాదం లోపలికి వేసి, నిప్పు పెడదాం. అది ఏం చేస్తుందో చూద్దాం" ఐడియా ఇచ్చాడు రఘు.

ఆ పథకం వినేసరికి అందరి ముఖాలూ విప్పారాయి. ఉత్సాహంగా అందరూ తలా ఒక మోపెడు ఎండు గడ్డి కోసుకెళ్ళారు. దాన్నంతా నిశ్శబ్దంగా కోటలోపలికి దూర్చి, నిప్పు అంటించారు.

ఎండు గడ్డి టపటపలాడుతూ అంటుకున్నది. కోటలోపలంతా పొగ క్రమ్ముకున్నది. మరుక్షణం కోటలోంచి దగ్గులూ, తుమ్ములూ, మనుషుల అరుపులూ వినబడ్డాయి.

మూడో నిముషంలో ప్రాణభయంతో అరుస్తూ, గడ్డిని నెట్టుకుంటూ, తోసుకుంటూ బయటపడ్డారు- కిరణ్, రమేష్!

"భూతాలు-భూతాలు" అని అరుస్తూ పారిపోబోయిన పిల్లలందరూ వాళ్ళని చూడగానే మ్రానుల్లాగా నిలబడిపోయారు.

"ఒరేయ్! మీరా?!" అని అరిచారంతా, మూకుమ్మడిగా. "భూతంమాదిరి మమ్మల్ని బెదిరించి, మా చేత తప్పుడు పనులు చేయిస్తారా? మర్యాదగా మేమిచ్చిన డబ్బులు వెనక్కి తెచ్చివ్వండి!" అని పోట్లాడి, వాళ్ళిచ్చిన డబ్బుల్ని ఎవరివి వాళ్లకు ఇచ్చేశారు.

సంగతి తెలుసుకున్న ఉపాధ్యాయులు నవ్వారు. "మీరు భయపడటం వల్లనేగా, ఇదంతా జరిగింది?! గుర్తుంచుకోండి- మూఢ నమ్మకాలు కూడదు. ఆపదలు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోరాదు. లేకపోతే బయటి వాళ్ళకు లోకువౌతారు; అంతేకాదు- మీ మంచితనాన్నే కోల్పోయాక, అసలు ఇక ఏం ఉండీ ఏం లాభం?" అన్నారు.