అది ఒక అందమైన పల్లెటూరు. కలతలు, కల్మషాలు లేని ఊరది. అందమైన పచ్చటి పొలాలతో, ఎత్తైన వృక్షసంపదతో, పక్షుల కిలకిలారావాలతో అది భూమి మీదికి దిగిన స్వర్గంలా ఉండేది.
ఆ ఊరిలో ఒక చింపిరి జుట్టు అమ్మాయి- రోజంతా ఎప్పుడూ ఊరి చివరన ఉన్న మర్రి చెట్టు క్రిందే గడుపుతుండేది- మర్రి ఊడలు పట్టుకొని ఊగుతుండేది; అక్కడి ఉడత పిల్లలతో స్నేహం చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి కళ్ళలో ఏదో తెలీని సంతోషం ఒకటి చిందులాడుతుండేది. ఆ పాప అక్కడికి వచ్చీ రాగానే ఏవో పాటలు పాడేది. ఆ పాటలు వినగానే చెట్టు మీద ఉన్న పక్షులు, ఉడతలు అన్నీ గబగబా వచ్చి ఆ పాప చుట్టూ చేరేవి. ఏ నాడైనా ఆ పాప అక్కడికి రావటం ఆలస్యం అయిందంటే అవన్నీ గందరగోళ పడిపోయి, కంగారు కంగారుగా అరిచేవి. మళ్ళీ ఆ పాప వచ్చి వాటిని సముదాయించేంత వరకూ ఊళ్ళో వాళ్లకి ఆ రొదను భరించక తప్పేది కాదు.
ఆ మర్రి చెట్టును ఆనుకొనే ఒక వాగు ఉండేది. ఒకసారి వానాకాలంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. వాగు పొంగింది. వరద నీళ్ళు ఊళ్ళోకి కూడా ప్రవేశించాయి. మెల్లగా ఊరు మొత్తం మునిగిపోయింది. ప్రజలు ఇళ్ళెక్కి రోజుల తరబడి గడిపారు.
అంత వరదలోనూ ఆ అమ్మాయి మర్రిచెట్టు దగ్గరికి బయలుదేరేది. పొంగి ప్రవహిస్తున్న వాగు అవతలి గట్టున నిర్భయంగా కూర్చొని ప్రవాహవేగం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసేది. వాగుకవతల మర్రిచెట్టు కొమ్మలు వాలిపోయి, ఒక్కటొక్కటిగా సోలిపోతుంటే ఇటు ప్రక్కన కూర్చొని కలవరపడేది.
కొన్ని రోజులకు వర్షాలు తగ్గాయి. వాగు ఉధృతి తగ్గింది. ఆకాశంలో మబ్బుల మాటునుండి సూర్యుడు బయట పడ్డాడు. దాగిన స్వర్గాన్ని నిద్రలేపుతున్నట్లు, సూర్యకిరణాలు మడుగుల్లో నీళ్లను తళతళలాడించాయి.
ఆ పాప గబగబా వాగును దాటుకొని మర్రి చెట్టు దగ్గరికి పరుగెత్తింది- తన నేస్తాలెలా ఉన్నారోనని, కంగారుగా. మర్రి చెట్టు కొమ్మలు వాల్చేసి ఉంది.మునుపటి కిలకిలారావాలు, అద్భుతమైన ఆకు తోరణాలు ఇప్పుడు లేవు. అంతకు మునుపు పచ్చటి ఆకులతో కళకళలాడిన కొమ్మలు ఇప్పుడు విరిగిపోయి మొండిగా, బోసి పోయి ఉన్నై. ఆనందం, ఆప్యాయతలు నిండిన స్వరం ఒక్కటీ వినిపించలేదు పాపకు అక్కడ. అల్లరిచేసే పక్షి ఒక్కటీ లేదక్కడ. ఆటలాడే ఉడత ఒక్కటీ కనబడలేదక్కడ. వరద ఉధృతికి అన్నీ ఎక్కడికి కొట్టుకు పోయాయో పోయాయి.
పాప చిన్నబోయింది. రోజంతా అక్కడే కూర్చున్నది విచారంగా. పాప కళ్లలోంచి కారిన కన్నీళ్ళకు ప్రకృతి స్తంభించి పోయింది. మెల్లగా చీకటి పడింది. పాప అక్కడినుండి కదల్లేదు. మెరిసే నక్షత్రాలు, ప్రకాశించే చంద్రుడు 'పాప దు:ఖాన్ని చూడలేం' అన్నట్లు మబ్బుల వెనక దాక్కున్నాయి.
రాత్రంతా నిశ్శబ్దంగా కూర్చున్న ఆ పాప, తెల్లవారు జామున గొంతు విప్పింది. మామూలుగా సంతోషపు జల్లులు చిందించే పాప గొంతునుండి గుండెల్ని కదిలించే విషాద గీతం ఒకటి వెలువడిందిప్పుడు. నిశ్శబ్దపు ఆ జామున పాప పాడిన పాట ఎంత దూరం చేరుకున్నదో, మరి?! వాగుపైనున్న మబ్బుల గుంపులు మళ్ళీ ఓసారి కరిగి సన్నగా వాన కురిపించాయి.
అంతలో ఆశ్చర్యం! ఎక్కడినుండో ఎగురుకుంటూ వచ్చిందో పిట్ట. దాని వెనకనే మరిన్ని పిట్టలు! చెంగు చెంగున ఎగురుతూ వచ్చిన చిన్న ఉడత. దాని వెనకనే మరిన్ని ఉడతలు! అన్నీ పాప చుట్టూ చేరి పాప గొంతుతో గొంతు కలిపాయి.
వాళ్లంతా కలిసి వెలువరించిన ఆ సంగీతంలో ఇప్పుడు విషాదం లేదు- నిండా క్రొత్త ప్రపంచపు సంతోషం ఉంది! ఆ సంతోష తరంగాలు అన్ని దిశలకూ విస్తరిస్తూ పోయాయి; క్రొత్త ఆశల సందేశాన్ని అందరికీ అందిస్తూ పోయాయి! నలుమూలలనుండీ మరిన్ని పక్షులు, మరిన్ని ఉడతలు ఉత్సాహంగా ఆ పాటకు గొంతులు కలిపాయి.