అనగనగా ఒక ఊళ్ళో రంగయ్య, పుల్లయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజున ఆడుకోటానికి వెళ్తూ ఉంటే దారిలో వాళ్లకొక వింత గుమ్మడి కాయ కనిపించింది: దానికి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉన్నాయి! వాళ్లలో రంగయ్యకు భయం ఎక్కువ. పుల్లయ్య మటుకు ధైర్యవంతుడు. పుల్లయ్య గబుక్కున ముందుకు వంగి ఆ గుమ్మడికాయను ముట్టుకోబోయాడు.

వెంటనే రంగయ్య వాడిని ఆపి- "ఒరే, ఇదేదో‌మాయ గుమ్మడి. లేకపోతే గుమ్మడికి నోరు, కళ్ళు, ముక్కు ఉండటం నువ్వు ఎక్కడైనా చూశావా? బహుశ: ఇందులో ఏదో దయ్యం నివసిస్తూ ఉంటుంది. దాన్ని ముట్టుకోవద్దు- మనం‌పోదాం, పద" అని పుల్లయ్యను లాక్కొని పోబోయాడు.

అయితే ఆ గుమ్మడికాయ వాళ్లని వదల్లేదు! ఇద్దరూ ఎటు వెళ్తుంటే అది కూడా అట్లాగే దొర్లుకుంటూ వాళ్ల వెంటే పోయింది!!

"రేయ్, పుల్లయ్యా! నువ్వు దాన్ని ముట్టుకున్నట్లున్నావు కదరా, ఇప్పుడు చూడు, ఆ దయ్యం మన వెంటే వస్తున్నది! ముట్టద్దంటే విన్నావా, ఇప్పుడు నాకు చాలా భయంగా ఉందిరా, వేగంగా పరుగు పెట్టరా" అని పుల్లయ్య చేతిని పట్టుకొని లాక్కెళ్ళసాగాడు రంగయ్య. అయితే గుమ్మడి కాయ కూడా అంతే వేగంగా వాళ్ల వెంట పడింది.

పరుగెత్తీ, పరుగెత్తీ అలిసిపోయి ఆగారిద్దరూ. అంతే- దొర్లుకుంటూ వస్తున్న గుమ్మడి కాయ కూడా ఎవరో ఆపేసినట్లు ఆగింది! అది చూసే సరికి ఇప్పుడు ఇద్దరికీ వణుకు పుట్టుకొచ్చింది. "ఇది నిజంగా దయ్యమేరోయ్" అని అరుస్తూ ఇద్దరూ మట్టి రోడ్డు వెంబడి పరుగు లంకించుకున్నారు. గుమ్మడికాయ కూడా వాళ్ల వెనకనే దొర్లుతూ పోయింది.

చివరికి ఇక చేసేది లేక పుల్లయ్య, రంగయ్య ఇద్దరూ తటాలున చెరొక చెట్టునూ ఎక్కి కూర్చున్నారు. గుమ్మడి కాయ కూడా అంతే వేగంతో ఎగిరి వచ్చి రంగయ్య ఒళ్ళో వాలింది!

రంగయ్య నిలువెల్లా వణికిపోయాడు. "ఓయమ్మో!" అని అరుస్తూ పట్టు వదిలి గబుక్కున చెట్టుమీదినుండి క్రింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఆ చెట్టు క్రింద ఓ గడ్డివాము ఉండటంతో అతనికి పెద్దగా దెబ్బలు తగల్లేదు. అంతలోనే గుమ్మడికాయకూడా‌ చెట్టు మీదినుండి అతని మీదికి దూకింది! రంగయ్య కంగారుగా విదిలించుకునేసరికి అది దొర్లి, దగ్గరలో ఉన్న ఓ బండ రాయి మీద పడి పగిలిపోయింది- దానిలోంచి బ్యాటరీతో నడిచే బొమ్మ ఒకటి బయట పడింది.

పుల్లయ్య చెట్టు దిగి వచ్చి దాన్ని నిశితంగా గమనించి చూసాడు- "ఒరే, ఇది దయ్యం కాదురా! ఒట్టి బొమ్మ! మనల్ని భయపెట్టాలని ఎవరో దీన్ని మనమీదికి వదిలారు. శబ్దాన్ని అనుసరించి వెళ్ళేట్లు తయారు చేశారు, దీన్ని ఎవరో- ఎవరో ఏమున్నది, అదిగో- మన 'శాస్త్రవేత్త'- సుధీర్‌గాడు చేసిన పనే ఇది" అన్నాడు, అక్కడికి చేరుకున్న సుధీర్‌ని చూపిస్తూ.

సుధీర్ ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని ఇకిలించాడు- "మా చిన్నాన్న విదేశం నుండి చప్పట్లు కొడితే ఎగిరే చిలక బొమ్మని తెచ్చాడురా, దానిలోంచి యంత్రాన్ని తీసి గుమ్మడి కాయలో పెట్టి, ఏమవుతుందో చూద్దామనుకున్నాను; అంతలోనే మీరు కలిసారు- .." అన్నాడు సుధీర్ మరింతగా పళ్ళు ఇకిలిస్తూ. మిత్రులిద్దరూ ముఖాలు ముఖాలు చూసుకొని- "అంటే నిజం దయ్యం నువ్వేనన్నమాట!" అంటూ వాడి మీదికి దూకారు నవ్వుతూ.