అన్ని బడులలో లాగే కల్లూరు పాఠశాలలో కూడా ప్రొద్దున మొదటి పీరియడ్‌లో తరగతి ఉఫాధ్యాయుడు వచ్చి పిల్లల హాజరు సంఖ్య చూసుకునేవారు. మళ్ళీ మధ్యాహ్న భోజనం తర్వాత ఒకసారి- ఇలా రోజూ రెండుసార్లు హాజరు సరి చూసుకొనేవాళ్ళు.


బడిలో 470 మంది పిల్లలుండేవారు. వాళ్లందరిలోనూ అల్లరి పిల్లలు ప్రత్యేకంగా ఓ ఐదుగురు ఉండేవాళ్ళు. ముచ్చటగా తమని తాము 'తొట్టి గ్యాంగ్' అని పిలుచుకునేవాళ్ళు వాళ్ళు. చక్కని ఎత్తు, శరీరాకృతి కలిగిన అనిల్ వాళ్ళ గ్యాంగు నాయకుడు. వేణు, రేవంత్, సిద్దార్థ, మణి గ్యాంగు సభ్యులు.


ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎవరు వాళ్లకు ఎ న్ని రకాలుగా చెప్పినా, లాలించినా, బుజ్జగించినా, తిట్టినా, కొట్టినా వాళ్ళు మటుకు వాళ్ళ పద్ధతులను మార్చుకోలేదు. 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?!'- అదీ, వాళ్ళ ధోరణి.

రకరకాలుగా అల్లరి చేసేసిన తర్వాత తొట్టి గ్యాంగుకు బడిలో ఉండటం కష్టంగా తోచింది. 'బడి జరుగుతుండగా మనం బయట తిరిగితే ఎంతగొప్ప?!' అనుకున్నారు. మొదటి రెండు పీరియడ్‌ల తర్వాత ఎవరికివాళ్ళుగా బడినుండి బయటపడటం మొదలుపెట్టారు. మొదటి పీరియడ్ తర్వాత ఇక హాజరు సమస్య ఉండదు కద!

స్కూల్‌కి దగ్గరలోనే ఓ చెరువు ఉండేది. వెళ్ళి చెరువులో ఈదులాడడం, ఎండ్రకాయలు, చేపలు పట్టి, ఉప్పు కారం వేసి, కాల్చుకుని తినటం మొదలు పెట్టారు వీళ్ళు. అట్లా రోజూ స్కూల్ కి డుంకా కొట్టేవారు. వాళ్లు అట్లా చేస్తున్న సంగతి బడిలో పిల్లలందరికీ చెప్పుకునేవాళ్ళు తొట్టిగ్యాంగు వాళ్ళు. అయితే ఆ సంగతి ఉపాధ్యాయులెవ్వరికీ తెలిసే అవకాశం లేకపోయింది.

అయితే, అట్లా ప్రతి రోజూ డుంకా కొట్టటం వల్ల వాళ్ళకు టీచర్లు చెప్పిన పాఠాలు అసలు అర్థమయ్యేవి కాదు. ఫలితంగా పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. టీచర్లు కూడా బాగా తిట్టి పెట్టేవారు. అయినప్పటికీ 'కుక్క తోక వంకర' అన్నట్టు వాళ్ళ బుద్ధి, ప్రవర్తన మాత్రం మారలేదు. తొట్టిగ్యాంగ్ చేసే ఈ చేష్ఠలు వాళ్ల తల్లిదండ్రులకు కూడా తెలిసేవి కావు. 'పిల్లలు పాఠశాలకు వెళ్ళి బాగా చదువుకుంటున్నారు' అనుకునేవాళ్ళు వాళ్ళు.

రానురాను తొట్టిగ్యాంగుకు ఎప్పుడూ చెరువు దగ్గరికే పోవటం విసుగ్గా అనిపించసాగింది. చెరువుకి 2 మైళ్ళ దూరంలో ఉన్న మామిడి-జామ తోటలు వాళ్ల దర్శనీయ స్థలాల పట్టీకి జమ అయినాయి. ఆ తోటల్లోకి పోయి ఎంచక్కా కడుపు నిండా కాయలు తింటే వాళ్ళు ఇక మధ్యాహ్నం భోజనానికి కూడా రానవసరం ఉండదు! స్కూల్ వదిలే సమయానికి నేరుగా పుస్తకాల కోసమే బడికి వెళ్లచ్చు!

ఒకరోజు రాత్రి బాగా వర్షం పడింది. గుంతల్లో అంతటా నీరు నిండింది. మరునాడు ఉదయం ఆకాశం మబ్బులతో నిండి ఉంది. అడవి జంతువుల సంచారం మొదలయింది. అయినా అలవాటైన ప్రాణాలు కద, తొట్టిగ్యాంగు ఊరికే ఉండలేకపోయింది. ప్రొద్దున రెండవ పీరియడ్ అవ్వగానే ఐదుగురూ గోడ దూకి బయట పడ్డారు.

చెరువు దారి పట్టారు. దారి అంతా బురద బురదగా ఉంది. మధ్యలో అందరూ ఆగారు. "ఒద్దురా! ఇప్పుడు చెరువుకి వెళ్ళడం కష్టం. తోటలకు వెళ్దాం. తారు రోడ్డు మీదుగా వెళ్లచ్చు" అని నిర్ణయించుకున్నారు. రోడ్డు బాట పట్టారు. ఆనందంగా గంతులేస్తూ రోడ్డు మీద ఆడుతూ పాడుతూ చాలా దూరం పోయారు. తోట దగ్గరికి చేరుకున్నారు.

అంతలో అకస్మాత్తుగా వాళ్లకొక అడవిపందుల గుంపు ఎదురు పడింది. సాహస వీరులు కదా, తొట్టిగ్యాంగువాళ్ల చేతుల్లో రాళ్ళు ప్రత్యక్షం అయ్యాయి. వాళ్లు వాటి మీద రాళ్ళు వెయ్యటం- అవి వాళ్ల మీదికి దూకటం- ఏది ముందు జరిగిందో చెప్పటం కష్టమే. మరుక్షణంలో అవి వాళ్లని అందిన చోటునల్లా పొడిచి, చీరి కొస ప్రాణాలతో వదిలి ముందుకు సాగిపోయాయి.

సరిగ్గా అదే సమయానికి ద్విచక్ర వాహనంపై బడికి వస్తున్న ఉపాధ్యాయుడు ఒకాయన జరుగుతున్న భీభత్సాన్ని చూసి ఆగిపోయి, అందరికీ సమాచా రం అందిం చాడు.”ఎవరో పిల్లలుపాపం, అడవి పందుల బారినపడ్డారు" అని తెలియగానే బడి పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ బయలుదేరి వచ్చారు సంఘటనా స్థలానికి. చూస్తే అక్కడున్నది తొట్టిగ్యాంగ్! అందరూ కలిసి వాళ్లని ఆసుపత్రిలో చేర్పించారు.

"వీళ్ళు ఈ సమయానికి బడిలో ఉండాలి కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు?" అని అడిగారు ప్రధానోపాధ్యాయులవారు. ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోయారు. చూడగా వాళ్ళందరికీ హాజరు పడి ఉన్నది మరి! ప్రధానోపాధ్యాయులవారు ఈ విషయాన్ని ఊరికే పోనివ్వలేదు- బడి సమయంలో ఎవ్వరూ బయటికి పోకుండా ప్రహరీ గోడ, దానికొక గేటు, తాళం, ద్వార రక్షకుడు- ఇవన్నీ వచ్చాయి.

తల్లిదండ్రులకు కబురు అందింది. ఇంత పెద్ద సంఘటన జరిగితే పేపర్లు మాత్రం ఎందుకు ఊరుకుంటాయి? తొట్టిగ్యాంగు గురించి పేపర్లలో అంతటా రాశారు. అందరూ వాళ్లని మెత్తగా చీవాట్లు పెట్టారు.

ఒక సారి ఆసుపత్రిలోంచి బయట పడ్డాక అసలు ఇక తొట్టిగ్యాంగ్ పూర్తిగా రద్దే అయిపోయింది. కుంటుకుంటూ, ముక్కుతూ, మూల్గుతూ ఉన్న వాళ్లకు ఇక బడి నుండి తప్పించుకొని బయటికి వెళ్ళాలనే అనిపించలేదు. ఆ రోజు నుండి హాయిగా చదువుకుంటూ మంచి బుద్ధిమంతుల్లా మెలిగారు.