మహతీపురంలో హేమంతుడనే పేదవాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి తులశమ్మే అతడ్ని అల్లారు ముద్దుగా పెంచింది. తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కూరగాయలు పండించి, వాటిని పొరుగు గ్రామంలోని సంతలో అమ్మేది ఆమె. అలా కూరగాయలు అమ్మగా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కొడుకుకి ఏ లోటూ రానీయకుండా ప్రేమగా చూసుకునేది తులశమ్మ. తనకోసం తల్లి పడుతున్న కష్టం చూసి హేమంతుడు కూడా ఆమెకు అన్ని పనుల్లోనూ సాయపడుతుండేవాడు.
హేమంతుణ్ణి గురుకులానికి పంపి విద్యావంతుడ్ని చెయ్యాలనుకున్నా, తనదగ్గరున్న డబ్బు అందుకు సరిపోదని తెలిసి లోలోపలే బాధ పడిపోయేది తులశమ్మ. అయితే తనకు తెలిసిన చాలా విషయాల్నే కొడుకుకి నేర్పేది. తల్లి చెప్పిన ప్రతి విషయాన్నీ శ్రద్ధగా నేర్చుకునేవాడు హేమంతుడు.
ఒకనాడు తులశమ్మకు జ్వరం వచ్చింది. అంచేత ఇల్లు కదలలేకపోయింది. తల్లికి బదులు తాను సంతకు వెళ్ళాలని నిర్ణయించుకున్న హేమంతుడు, తల్లికి జాగ్రత్తలు చెప్పి, కూరగాయల తట్ట నెత్తికెత్తుకొని పొరుగుగ్రామంలో సంతకు పోయాడు. అక్కడ కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుతో తిరుగు ప్రయాణం అయ్యాడు.
దారిలో ఒక పెద్దాయన ఎదురయ్యాడతనికి. వంగిపోయిన నడుము; చేతిలో ఒక కర్రతో ఉన్న ఆ పెద్దాయన హేమంతుడిని ఆపాడు: "నాయనా! నాది ఆ పక్క ఊరు. పని మీద ఈ పక్కకి వచ్చాను. మా ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న ఈ అడవిని దాటాలి.
నేనెప్పుడూ ఒంటరిగా అడవిని దాటింది లేదు. ఒక్కడినే వెళ్ళాలంటే భయంగా ఉంది" అన్నాడాయన నీరసంగా.
హేమంతుడికి అతడిపట్ల జాలి కలిగింది. "దానిదేముందిలే తాతా, నేను నిన్ను అడవి దాటిస్తానులే" అన్నాడు, తాత చెయ్యి పట్టుకుంటూ.
ఇద్దరూ నడవటం మొదలుపెట్టారు. అడవిమధ్యలోకి చేరుకోగానే ఉన్నట్లుండి ఆగాడు తాత - "ఏమైంది తాతా? ఎందుకు ఆగిపోయావు?" అని అడిగాడు హేమంతుడు.
"ఎవర్రా తాత? నీవనుకుంటునట్టు నేను ఒట్టి ముసలాడ్ని కాను! గజదొంగ రంగడిని! మర్యాదగా నీదగ్గరున్న డబ్బంతా నాచేతిలో పెట్టు. లేకపోతే ఈ కత్తితో నీ పీక కోస్తా!" అంటూ వికృతంగా నవ్వుతూ తన దగ్గరున్న కత్తిని తీశాడు రంగడు.
హేమంతుడు తన దగ్గరున్న డబ్బును అతని చేతికి అందిస్తూ "నా దగ్గర ప్రస్తుతం ఉన్నది ఇంత మాత్రమే తాతా, బహుశ: ఇది నీ అవసరాలకి ఏమాత్రం చాలక పోవచ్చు. అయినా ఉన్నది ఈ కాసిన్ని డబ్బులే కనక- ఇంద, తీసుకో!" అన్నాడు మామూలుగా. అప్పటి వరకూ తన బెదిరింపుకులోనైన ప్రతివాడూ ప్రాణభయంతో గిజగిజలాడుతూ తన కాళ్లమీద పడి బ్రతిమలాడటమే తెలుసు
రంగడికి. అయితే హేమంతుడు తనను చూసి భయపడకపోవడం, పైగా అడిగిన వెంటనే తన దగ్గర ఉన్న డబ్బునంతా ఇవ్వబూనటం, అంతాచేసి పరమ స్నేహంగా మాట్లాడటం, రంగడిలో ఏదో తప్పు చేస్తున్నానన్న భావనను కలిగించాయి.
అయినా అదేమీ పైకి కనబడనీయకుండా "ఒరే, చిన్నోడా! ఎవరి పేరు వింటే ఈ రాజ్యంలో ప్రజలందరూ భయపడతారో ఆ రంగడిని నేనే! నన్ను చూస్తే నీకు భయం వెయ్యడం లేదా?!"అని అడిగాడు , కరకు గొంతుతో.
"నువ్వు ఎవరైతేనేమి తాతా, నువ్వూ నాలాంటి మనిషివేగా? 'సాటిమనిషిని చూసి భయపడటమంటే వారిలో మానవతకు బదులు కౄరత్వాన్ని చూసినట్లే' అని మా అమ్మ చెప్తూంటుంది. కౄరత్వం మృగాల నైజం; మనుషుల తత్వం అది కాదు కదా?
మరి అలాంటప్పుడు, సాటి మనిషివి- నీలో కౄరత్వాన్ని చూశానంటే నిన్ను అవమానించినట్లే కదా?!" అన్నాడు హేమంతుడు. "కానీ నేను దొంగను- గజదొంగను! నువ్వు నన్ను చూసి భయపడలేదు సరే- నీకు కనీసం నామీద కోపం కూడా రావట్లేదా?!" అడిగాడు రంగన్న- కొంచెం తగ్గుతూ.
"పుట్టుకతోనే ఎవ్వరూ దొంగలుగా పుట్టరు కద, తాతా?! నువ్వు దొంగగా మారావంటే, మరి నీ తెలివికి, సామర్థ్యానికి తగిన పని వేరే ఏదీ నీకు దొరికిఉండక పోవచ్చు; లేదా నీ సామర్థ్యం ఏమిటో, నీ ప్రతిభ ఏమిటో ఇతరులకు అర్థమయ్యేలా తెలియజెప్పటం నీకు రాలేదేమో.
సాధారణంగా మనం ఎప్పుడైనా ఒక మంచి పనిని చేసుకుంటూ పోయామనుకో; ఆ పనే మనకు ఇంకా చాలా మంచి పనులు నేర్పుతుంది. అటుపైన మనం చేయాల్సిందల్లా మన ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించటమే.
అంత కాకపోయినా, నీ ప్రయత్నాలు నిన్నెంతగా చీకటిలోనూ, నిరాశలోనూ మిగిల్చినా, సన్మార్గాన్ని నువ్వు వదలనంతవరకూ సంతోషం నీతోనే ఉంటుంది.
ఇకనైనా నువ్వు సన్మార్గంలో నడవగల్గితే బాగుండును- కానీ నీ ప్రగతికి మేలు చెయ్యగలిగే సహాయం ఏదీ నేను చెయ్యలేకపోతున్నానే అని బాధగా ఉంది.
కనీసం ఈ కాసిన్ని డబ్బుల్నీ తీసుకుంటే నేను సంతోషపడతాను" అన్నాడు హేమంతుడు, ప్రశాంతంగా. రంగడి మనసు లోపలినుండి పశ్చాత్తాపం పెల్లుబికి వచ్చింది. ఇన్నాళ్లూ తను చేస్తున్న పనిలో మంచి చెడ్డలను గుర్తించక క్రూరంగా ప్రవర్తించినందుకూ, అందరినీ బెదిరిస్తూ గడిపినందుకు ఎంతో బాధపడ్డాడు రంగడు.
తన ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చినందుకు, హేమంతుడికి కృతజ్ఞతలు చెప్పి, అతడి డబ్బును అతనికి ఇచ్చేశాడు. ఇకపై తాను మంచిమార్గంలో నడుస్తానని హేమంతునికి మాట ఇచ్చిన గజదొంగ రంగన్న, అటుపైన మనిషిగా మారాడు. ఆనందంగా జీవించాడు.