జ్ఞానం!
రాము: ఒరే, మనం ఇవాళ్ళ ఉపవాసం చేస్తోంది ఏ దేవుడికోసం రా?
సోము: ఇవాళ్ల మనం చేస్తున్నదాన్ని ఉపవాసం అనరురా, నిరాహార దీక్ష అంటారు!

తెలివి ఎక్కువైంది!
టీచరు: రామూ! స్పెల్లింగులు సరి చూసుకోమంటే వినవేమిరా?
నిన్ను గ్లోబల్ వార్మింగ్ అని రాయమంటే గ్లోబల్ వార్నింగ్ అని రాశావు!
అతితెలివి రాము: రెండూ ఒకటేలెండి సార్! గ్లోబల్ వార్మింగు మనందరికీ వార్నింగేగా?

వాస్తు పక్షులు!
వాస్తు సిద్ధాంతి: ఏమేవ్! మనం ఈ క్రొత్త ఇంటికి మారినప్పటినుండీ నీ వంట ఇట్లా ఉంటోందేంటే, మరీ ఇంత చప్పగానా?
వాస్తుగారి భార్య: మరి వంటింటి వాస్తు సరిగాలేదంటే వినిపించుకోనే లేదు గదండీ!

అచ్చు తప్పు!
రెడ్డి: ఒరేయ్! మా హోటలుకు ఎందుకనో, ఎవరూ రావట్లేదురా!
స్నేహితుడు: కూల్‌డ్రింక్ దుకాణాల బ్యానర్లు రాసే ఆర్టిస్టుతో హోటలు బ్యానర్ రాయించద్దంటే విన్నావా?
రెడ్డి: ఇప్పుడేమైందిరా?
స్నేహితుడు: బోర్డు మీద ఏం రాశాడో చూడు "ఇచ్చట చల్లటి కాఫీ, చల్లటి టీ లభించును!"- ఇంకెవరు వస్తారు మీ హోటలుకు?!

ఎవరు కదులుతారు?
టీచరు: రామూ నువ్వు పుస్తకాలు చదువుతావు, టీవీ చూస్తావు. మరి పుస్తకానికి, టీవీకీ తేడా ఏంటో చెప్పు, చూద్దాం?!
రాము (కొంచెం‌ ఆలోచించి): పుస్తకం మన దగ్గరికి వస్తుంది టీచర్, మరైతే మనం టివి దగ్గరికి వెళ్తాం!

అత్యాశ!
సుబ్బారావు: ఒరే అప్పారావూ! నీది మరీ అత్యాశరా!
అప్పారావు: ఇప్పుడేమైందిరా?!
సుబ్బారావు: టికెట్లు కొనకుండానే లాటరీ రావాలని ఆశపడుతున్నావు కదరా!!

బెదిరింపు!
కూల్‌డ్రింక్ దుకాణం ఓనర్: రంగా! నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. రేపటినుండి పనిలోకి రాకు!
రంగ: ఆలోచించుకోండి సార్! తర్వాత 'ముందు చెప్పలేదు' అనకూడదు. రేపు పొద్దుటికల్లా మన దుకాణం ఎదురుగా చలివేంద్రం పెడతాను మరి!

దోమ తెలివి!
సోము: ఎవరి చెంపమీద వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు టీచర్?
టీచరు: తెలీదురా, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ ఉండరనుకుంటాను ఈ ప్రపంచంలో.
సోము: మరి నిన్న మీ చెంపను దోమ కుడుతున్నప్పుడు- మీ చెంపను మీరే కొట్టుకున్నారు కద టీచర్?

అధిభౌతికం!
మిత్రుడు: మీ పిల్లవాడికి అక్షరాభ్యాసం రోజున ఏదో కొత్తగా రాయించావటనే? ఏమని?
భౌతికరావు: కోటి విద్యలు కూటి కొరకే అని రాయించా.

ఎవరితప్పు?! తండ్రి: ఒరేయ్ చిన్నా, ఎప్పుడూ సెల్ ఫోన్ తోటే ఆడుతుంటావెందుకురా?
చిన్నా: మరి నేను పుట్టినప్పుడు నాకోసం నువ్వు సెల్ ఫోనే కద నాన్నా, తెచ్చింది?!

చిన్న మార్పు!
జర్నలిస్టు: టెన్నిస్ ప్లేయర్ గారూ, మీరు ఎక్కడికి వెళ్దామనుకొని ఎక్కడికి చేరుకున్నారు?
టెన్నిస్ ప్లేయర్: నేను రాకెట్టు మీద అంగారకుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కానీ ఇప్పుడు రాకెట్టుతో టెన్నిస్ ఆడుతున్నా!

శుభ్రత!
టీచర్: రామూ! పరీక్ష పేపర్లో జవాబులు రాయకుండా తెల్ల కాగితం ఇచ్చావెందుకు?
రాము: శుభ్రతకు పది మార్కులు వేస్తానని మీరే కద టీచర్, అన్నారు?