ఈమధ్యకాలంలో ఇంటర్నెట్ పుణ్యమా అని ఎందరో యువ రచయితల గురించి తెలుస్తోంది. వాళ్ళంతా ఒక పక్క తమ చదువులు కొనసాగిస్తూనే తీరికవేళల్లో గొప్ప గొప్ప రచనలు చేసేస్తున్నారు! మరి కొత్తపల్లి పత్రికలో రాసే బాల రచయితలకు, కొత్తపల్లి కథలు చదివే పాఠకులకూ కూడా వాళ్ళ గాథలు ప్రోత్సాహకరంగా అనిపిస్తాయని తోచింది. అలాంటి ఒక యువ రచయిత గురించే ఈవ్యాసం.
ఈ రచయిత పేరు 'గియోర్గియో గ్రూం'! పేరు చూస్తే ఎవరో విదేశీయుడిలా ఉంది కదా? కానీ కాదు. ఇరవై ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ అసలు పేరు జార్జి మనవళన్. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థి. స్వస్థలమేమో కేరళలోని కొచ్చి నగరం. ఇతనికి చిన్నప్పటి నుండి పాశ్చాత్య పురాణ గాథలపై ఆసక్తి ఉండేదట. 'పురాణ పాత్రలతో సాంకేతికతని జోడించి ఒక కథ అల్లితే ఎలా ఉంటుంది?' అనుకున్నాడట. తీరిక వేళల్లో సరదాగా ఒక నవల రాయడం మొదలుపెట్టాడట; చూడగా ఆ కథ బలే ఉందనిపించింది. వెంటనే దాన్ని ఒక వెబ్సైటు ద్వారా ప్రచురించాడు. అప్పుడే అంతర్జాతీయంగా దాన్ని మార్కెట్ చేయాలనుకుని, ఆ కలంపేరును వాడుకున్నాడు!
అతను రాసిన ఆ నవల పేరు 'Soldier of Ares'
"ట్రోజన్ వార్" అనేది పాతకాలపు ఓ గొప్ప ఆంగ్ల గ్రంథం. ఆ ట్రోజన్ వార్ కి కొనసాగింపుగా రాసిన కాల్పనిక నవలట ఇది! హోమర్ లాంటి ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాసిన గ్రంథానికి ఇరవై ఏళ్ళ అబ్బాయి కొనసాగింపు రాయడం అంటే అసలు సామాన్య విషయం కాదు. ఈ కథ రాయడానికి జార్జికి ఒక సంవత్సరం పట్టిందట. ఈ కథను అల్లడానికి తాను చాలా కష్టపడ్డాననీ, విపరీతంగా పుస్తకాలు చదివాననీ చెబుతాడు జార్జి.
అలాగే, ఒక పక్క క్లాసులకి వెళ్తూ, ఒక పక్క సాయంత్రాలు నవల రాయడం కూడా అంత సులభమైన పనేమీ కాదు. ఈ విషయంలో అతను పడ్డ శ్రమకి తగ్గ ఫలితమే దక్కింది. పుస్తకం అంతర్జాతీయంగా విడుదలైంది. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం - అందరూ జార్జిని గురించి సంతోషం వ్యక్తపరచారు. ఇటీవలే "ది హిందూ" పత్రికలో జార్జి గురించి ఒక వ్యాసం కూడా వచ్చింది.
మూడు నవలల సిరీస్ రాయాలనుకుంటున్నాడు జార్జి. వీలైతే తన చదువు పూర్తైన తరువాత 'రచనా వ్యాసంగం కొనసాగించాలి' అనికూడా అనుకుంటున్నాడట. మన చుట్టూ జరిగే విషయాల గురించి, భారతీయ పురాణాలలోని పాత్రల గురించి, రోజూ నేర్చుకుంటున్న కొత్త విషయాల గురించి - మీరూ కొత్త కొత్త కథలెన్నో రాయచ్చు. మీ సృజనాత్మకతకు పదును పెట్టండి, మరి !