రాము, సోము ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. రామేమో చదువులో చురుకైనవాడు; సోముకు అన్ని తెలివితేటలు లేవు. ఉపాధ్యాయులు, ఇంకా చూసినవాళ్ళుకూడా చాలామంది రామును మెచ్చుకునేవాళ్ళు. దాంతో రాము అంటే ఒక రకమైన ఈర్ష్య పెరగసాగింది సోములో. రామును ఎలాగైనా అభాసుపాలు చేయాలని అనిపించసాగింది వాడికి!
చివరికి ఒక రోజున వాడు ధైర్యం చేశాడు- తమ తరగతిలోనే ఉన్న వనజ పుస్తకాన్ని ఒకదాన్ని దొంగిలించాడు; ఎవరూ చూడకుండా దాన్ని రాము సంచిలోకి జారవిడిచాడు.
"నా పుస్తకంకనబడటం లేదు. ఎవరో దొంగిలించినట్లున్నారు" వనజ ఫిర్యాదు చేసింది ఉపాధ్యాయుడికి.
"అందరి సంచులూవెతకండి, దొరుకుతుంది" సూచించాడు సోము, అమాయకంగా.
ఆ ప్రకారంగా అందరి సంచులూ వెతికారు.. వనజ పుస్తకం రాము దగ్గర బయట పడింది !
"ఛీ! నువ్వు బాగా చదువుకొని పైకి వస్తావనుకున్నాం- కానీఇట్లా దొంగతనాలు మొదలెట్టావా?" అంటూ ఉపాధ్యాయులవారు రాముకు బడిత పూజ చేశారు.
"అయ్యో, నాకేం తెలీదు-నన్ను కొట్టకండి!" అని రాము ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది.
సోముకు చాలా సంతోషం అనిపించింది. అయితే వాడి సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. 'రాముకి ఇంకా ఏదైనా నష్టం కలిగిస్తే బాగుండు'అని ఆ క్షణం నుండే వాడి మనసు ఉవ్విళ్ళూరటం మొదలెట్టింది.
అంతలోనే రాము పుట్టిన రోజు వచ్చింది. ఆరోజున వాడు మంచి కొత్త బట్టలు ధరించి బడికి వచ్చాడు. అందరూ అతన్ని- అతని దుస్తులను మెచ్చుకునేసరికి, సోము గుండె మండినట్లయింది. ఎవరూ చూడకుండా బురద తెచ్చాడు; వెనుకనుండి రాము దుస్తులపైన చల్లాడు.
తన దుస్తులు పాడైన సంగతి తోటి పిల్లలు చెబితే తెలిసింది, రాముకి. చూసుకుంటే తెల్లటి బట్టలమీద వికారంగా ఎర్రటి బురద!వాడికి చాలా ఏడుపొచ్చింది.
"ఎవర్రా ఈపని చేసింది?" అడిగారు ఉపాధ్యాయులవారు,
అందరూ మేము చేయలేదంటే మేము చెయ్యలేదన్నారు.
ఉపాధ్యాయులవారు అందర్నీ గమనిస్తూ ఉన్నారు. ఇంతలో వనజ అయన చెవిలో ఏదో చెప్పింది. ఉపాధ్యాయులవారు సోమును దగ్గరికి పిలిచి " సోమూ! బురదచల్లింది నువ్వే కదూ?" అని అడిగారు.
"లేదండి - నేనెందుకు జల్లుతాను? రామూ నాకు మంచి మిత్రుడు" సోము బొంకాడు.
"మరి నీ చేతులు చూపించు!" అడిగారు అయ్యవారు, సోము దుస్తుల మీద ఉన్న మట్టి మరకలను గమనిస్తూ.
సోమూ చేతులు చాచాడు- చెయ్యి కొంచెం ఎర్రగా ఉంది. గోర్లలో బురద అక్కడక్కడా ఇరుక్కొని ఉంది.
"సోమూ, నిజం చెప్పు! ఈ పని చేసింది నువ్వే! నీ బట్టలమీద ఉన్న మరకలు -నీ చేతిలోని ఎర్రదనమే అందుకు సాక్ష్యం " గద్దించారు అయ్యవారు.
సోమూ ఏడుస్తూ నిజం ఒప్పుకున్నాడు .
"ఎం దుకు చేశావురా, ఈ పని?"
"అందరూ నాకంటే ఎక్కువగా రాముగాడినే మెచ్చుకుంటుంటారు- అందుకని.." నిజాన్ని అంగీకరించాడు సోము.
"నా పుస్తకం దొంగిలించింది కూడా సోమే అయి ఉంటాడు" వనజ చెప్పింది .
అది కూడా ఒప్పుకున్నాడు సోము.
"చూడండి పిల్లలూ- ఒకరికి చెడు చేద్దామని ఎన్నడూ ఆలోచించకండి. 'చెడపకురా, చెడేవు' అని సామెత. ఎదుటి వ్యక్తిని ఒక చూపుడు వేలుతో నిందిస్తున్నప్పుడు, మూడు వేళ్ళు మనవైపుకు తిరిగి ఉంటై, చూశారా? ఇతరులను చెడపాలనుకున్న క్షణంలోనే మనం చెడిపోతాం, నిజానికి' అన్నారు ఉపాధ్యాయులవారు.
"అదెలాగండి?!" అడిగింది వనజ ఆశ్చర్యంగా.
"రాము మీద దొంగతనం నేరం మోపుదామనుకున్నాడు సోము. కానీ అతనికంటే ముందే ఇతను దొంగగా మారి నీ పుస్తకాన్ని దొంగిలించాడు. ఆ తర్వాతనే గద, దాన్ని రాము సంచిలో వేసింది? రాము దొంగ అవునో కాదో గాని, ముందస్తుగా వీడే దొంగ అయిపోయాడు" చెప్పారు అయ్యవారు. "అలాగే రాము మీద బురద చల్లుదామనుకున్నాడు. వాడి మీద బురద చల్లేలోగా తన చేతులకు బురద అంటింది. అంతకంటే ముందు తన మనసుకు బురద అంటింది".
"రాము దుస్తులకు అంటిన బురద ఉతికితే పోతుంది- కానీ సోము మనసుకు అంటిన బురద ఉతికినా పోదు. అందుకనే చెప్తారు- 'చెడు వినవద్దు; చెడు కనవద్దు; చెడు అనవద్దు' అని."
సోముకు కళ్లలో నీళ్ళు తిరిగాయి. రాము చేతులు పట్టుకొని క్షమించమని కోరాడు. అతనిలో నిజంగానే పరివర్తన వచ్చింది. అటుపైన అతను అందరికీ మంచి మిత్రుడైనాడు. కొంత కాలానికి 'మంచి మిత్రులు ఎవరు?' అంటే 'రాము-సోము' అని అందరూ చెప్పుకునేట్లయింది!