'వెళ్ళేది తలారి ఇంటికే' అని తెలిసినవాడు నడిచినట్లు ప్రాణాలను అరచేత పట్టుకొని మెల్లగా నడుస్తూ ప్రొద్దుగుంకే వేళకు గుడ్లగూబలు నివాసం ఉండే కొండ గుహను చేరుకున్నది చిరంజీవి. ఆ గుహ ముందు నిలబడి, నీరసించిన స్వరంతో- "అయ్యో! రాజా!" అని గట్టిగా మూలిగింది.

అది విని ఓ గుడ్లగూబ అదిరిపడి, లేచి బయటికి వచ్చి చూసింది. సొమ్మసిల్లి పడి ఉన్న కాకి ఒకటి కనిపించింది దానికి. దాన్ని తమ రాజు ఉపమర్దనుడి ముందుకు తీసుకుపోయి నిలబెట్టిందది. రక్తంతో తడిసి ముద్దయి ఉన్న ఆ ముసలి కాకిని చూసేసరికి గుడ్లగూబలన్నిటికీ జాలి వేసింది-"ఎవరి కాకివి, నువ్వు? నీ గతి ఇట్లా ఎందుకైంది?" అని అడిగింది ఉపమర్దనం.

అప్పుడు చిరంజీవి బాధను, ఏడుపునూ అభినయిస్తూ, బొంగురుపోయిన గొంతు పెట్టుకొని "నా నోట మాట పెగలటంలేదు. ఏమని చెప్పాలి, నా గురించి?! నేను మేఘవర్ణుడి ప్రధానమంత్రిని- నా పేరు చిరంజీవి. ఇవాళ్ళ ఉదయం మేఘవర్ణుడు తన మంత్రులందరినీ పిలిచి "ఏం చేద్దాం?" అని అడిగాడు. నాకు అతని దురుద్దేశం తెలుసు- అయినా 'తోచిన మంచి చెప్పి చూద్దాంలే' అని "అయ్యా! ఉపమర్దనుడు బలవంతుడు. అందుచేత అతన్ని వేరే మార్గాలతో గెలవలేము- కేవలం భక్తి చేతనే అతన్ని అందుకొనగలం. అతని పాదాలు పట్టుకొని బ్రతకటం మంచిది. 'నేను రాజును' అనే దురభిమానం ఒకింత ప్రక్కన పెట్టి, వెంటనే ఆయనను దర్శించుకోండి. నా మాట విని ఆ కరుణాకరుడిని శరణువేడండి" అనగానే, ఏం చెప్పను?- ఆ తిక్కవాడి కోపానికి నెయ్యిని జోడించినట్లయింది నా మాటలతో.

వాడు భగ్గున మండిపడి, కంటి కదలికలతోటే నాపట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన విధేయులైన మంత్రులను చూసి 'వీడు శతృవుల పక్షం వహించి, ఒళ్ళు తెలీక పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నాడు. దయ చూపకండి- వీడిని మీ వాడి ముక్కులతో‌పొడిచి ఇప్పుడే చంపేయండి' అని అరిచాడు. వాళ్ళు కూడా‌వెంటనే కుక్కల మాదిరి నా మీదికి దూకి, నెత్తురు కారి కారి సొమ్మసిల్లిన నన్ను ముక్కులతో పొడిచారు; కాళ్లతో‌కుమ్మారు. చివరికి 'చచ్చిపోయాడులే' అనుకొన్నారు. నన్ను అక్కడే వదిలేసి, వాళ్ల దారిన వాళ్ళు పోయారు. లోకంలో అట్లాంటి రాజులు ఉండబట్టే కదా, 'రాజ్యం తర్వాత నరకం తప్పదు' అన్న సామెత తయారైంది?!

ఇక నేను కొంతసేపటికి తేరుకొని, అన్నివైపులా చూసాను- ఎక్కడా ఎవ్వరూ లేరు- దాంతో నాకు ఎంత భయం వేసిందో చెప్పలేను. 'నావాళ్ళు' అనుకున్న బంధువులు, మిత్రులు అందరూ నన్ను దిక్కులేనివాడిగా వదిలేసి పోయారు. నా మనసు విరిగిపోయింది. చివరికి ఈ సంగతి మొత్తాన్నీ తమరికి విన్నవించుకోవాలనీ, ఆ పైన ప్రాణాలు విడిచినా పరవాలేదనీ నిశ్చయించుకున్నాను. శక్తి లేకున్నా. శరీరాంగాలు సహకరించకున్నా, ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ‌ తమరి సన్నిధికి చేరుకున్నాను. ఇక నాకు తమరే దిక్కు. శ్రద్ధ కలవాడికి విద్యాదానం, ఆకలిగొన్నవాడికి అన్నదానం, రోగికి ఔషధ దానం, భయ భీతులకు అభయదానం- ఇవి దానాల్లోకెల్లా ఉత్తమమైనవి' అని పెద్దలు చెబుతారు. దీనులను కాపాడటాన్ని మించిన రాజ ధర్మం మరొకటి లేదు. 'దుర్బలులకు బలం రాజు' అని వినిఉన్నాం కదా?

ఇదిగో, ఈ దేహం శాశ్వతం కాదు. అశాశ్వతమైన ఈ శరీరం కోసం శతృవు చేసిన అవమామాన్ని మరచిపోయి సిగ్గులేకుండా ఎట్లా తిరిగేది? ఎవరికోసం బ్రతకాలి, ఇక నేను? అన్ని బంధాలనుండీ విముక్తుడినైనాను నేను. ఇక నాకు ఈ శరీరంతో మాత్రం‌ పొత్తు ఎందుకు? అవసరం లేదు. ఇంతవరకూ ఆ పనికిరాని రాజు మేఘవర్ణుడికి సేవ చేసేందుకే ఈ ప్రాణాలు బిగబట్టుకున్నట్లున్నది. నాకు ఎదురైనా ఈ దురవస్థనంతా తమరికి చెప్పుకోగలిగాను- కాదది చాలు. ధన్యుడినైనాను. ఇప్పుడిక ఏం జరిగినా మంచిదే. ప్రస్తుతం నేను బ్రతికి ఉండీ ఎందుకూ పనికిరాని శవం లాగా నిస్సారమైపోయి ఉన్నానంటే ఉన్నాను.

పగ తీర్చుకునే శక్తిలేక, కాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ దుర్మార్గులు నా ప్రాణాలను పూర్తిగా తీసినా పోయేది. ఎందుకో కొంచెం తక్కువ చేశారు. మీరైనా ఆ కొరత తొలగించి పుణ్యం కట్టుకోండి- మీ చేతుల్లో చచ్చి కనీసం‌ కొంచెం పుణ్యం సంపాదించుకుంటాను.

ఇదివరలో నేను చాలా సార్లు తమరిని దర్శించుకోవాలనే అనుకున్నాను- కానీ ఏదైనా జరగాలంటే దైవం అనుకూలించాలి కదా! ఇప్పుడు, కనీసం‌ ఈ విధంగానే అయితేనేమి, ఆ కోరిక నెరవేరింది. మీలాంటివారికి సేవ చేసుకునే భాగ్యం కేవలం మహా భాగ్యవంతులకు తప్ప, అందరికీ లభిస్తుందా?!

అదీగాక నేను అతని సభలో ఎల్లప్పుడూ తమరి చరిత్రాన్నే వేయినోళ్ళ కీర్తిస్తూ ఉండేవాడిని. దానికి అతను బాధపడి, అన్నింటా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉండేవాడు. ఆ కథలు త్రవ్వినకొద్దీ ఇంకా ఊరతాయిలెండి- వాటిని అటు ఉంచుదాం. నేను ఇన్ని సంవత్సరాలుగా చేసిన మేలంతా ఒక్కపూట వచ్చిన వరదలో కొట్టుకుపోయినట్లయింది. అందులో ఒక్క కోటవ వంతు మేలు తమరికి చేసి ఉన్నా, నా మనసు నిండిపోయేది కదా,అ నే నా చింత" అని ఆ దొంగ కాకి పలు విధాలుగా వాపోయింది.

ఆ నంగనాచి మాటలకు ఉపమర్దనుడి మనసు మెత్తబడటాన్ని గమనిచిన మంత్రులు ముందుకు వచ్చి- "ప్రభూ! ఈ కాకికి వ్యతిరేకంగా చెబుతున్నామని మా మాటలను త్రోసిపుచ్చక, కొంచెం శ్రద్ధగా మా మనవిని ఆలకించండి.

ముందు కీడు ఎంచి, ఆ పైన మేలు ఎంచాలి. శతృత్వాలు ఆమరణాంతం‌ ఉండేవి తప్ప, ఇప్పట్లో అయితే తేలేవి కావు. ఇతని చరిత్ర చూద్దామా, అది ఏమంత పాతది కాదు. నిజానికి అదంతా మనకు తెలిసినదే. 'రాజన్నవాడు తనవారినే నమ్మీ-నమ్మనట్లు ఉండాలి' అని చెబుతారు. ఇక పరాయివాడి పట్ల ఎలా ఉండాలో ఏం చెప్పాలి? ఆకు అలముల వెనక దాగి ఉన్న నుయ్యి లాంటిది, ఈ కాకి. దీన్ని నమ్మరాదు. మనం మతిమాలి 'నమ్మాము' అంటే ఇక దాని ఫలితం మన మెడకే చుట్టుకుంటుంది- వెదురు పండు మాదిరి, ఈ కాకి మొదలునే సమూలంగా నాశనం చేసే అవకాశం కనిపిస్తున్నది.

సందేహం లేదు. వీడు మనల్ని నాశనం చేయటం కోసం శతృవుల గూఢచారిగా వచ్చాడు, ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడాలేని మాయమాటలు చెబుతున్నాడు. వీడిని మన దగ్గర ఉంచుకోవటం దూదిలో నిప్పు కణికను దాచటమే అవుతుంది. కొండంత దూదికి కొండంత నిప్పు అవసరం లేదు కదా? మనల్ని అందరినీ నాశనం చేసేందుకు వీడొక్కడూ చాలు. శత్రువు ఎంత బలహీనుడయినా వాడికి మన రహస్యాలను తెలియనివ్వకూడదు. చెట్టులో చేరిన చెదల పుట్ట చెట్టునే చెరచదా? " అన్నాయి.

అట్లా తన మంత్రులందరూ ఆ కాకిని దరి చేరనివ్వద్దని ఎంత నొక్కి చెప్పినా, విధి మూడిన ఉపమర్దనుడు మటుకు వాళ్ళ మాట వినలేదు. తను పట్టిన పట్టును విడువలేదు. 'శరణు కోరిన వాళ్లను కాపాడటం కంటే మించిన ధర్మంలేదు- ఊరుకోండి' అని వాళ్ళు ఇక మాట్లాడకుండా చేసింది. ఏ విధంగా అయినా సరే, కాకిని కాపాడాల్సిందే అని ఒక సారి నిశ్చయించుకున్నాక, అది తన మంత్రులతో 'పుట్టుక వల్ల కాకి అయినంత మాత్రాన ఇతన్ని శత్రువుగా చూడకండి. సాధు జనుల్లోకెల్లా ముందు ఎంచదగిన గొప్పవాడు ఇత ను. కలలో కూడా ఇతరులకు కీడు తలపెట్టే రకం కాదు. సత్యం తప్ప అబద్ధం అన్నదేదీ ఇతని నాలుక మీదికి రాదు. ఈ ప్రపంచంలోనే ఇతనికి సమానం అయిన అభిమానస్తుడు వేరొకడు లేడు. ఇతని మాటల తీరు ఇతని స్వభావాన్ని పూర్తిగా వెలువరిస్తున్నది. కేవలం మన పూర్వ పుణ్యం కారణంగానే మనకు ఈ చిరంజీవితో స్నేహం చేసే భాగ్యం కలుగుతున్నది. మనకు ఇతను పూర్తిగా నమ్మదగినవాడు. అక్కడా ఇక్కడా అనక మన మందిరంలో అంతటా ఇష్టం వచ్చినట్లు తిరగ గలిగిన వాడు. ఇవాల్టినుండి మీరు మీ పాత భావాలను విడనాడాలి- ఇతనిని అత్యంత ఆదరాభిమానాలతో గౌరవంగా చూసుకోవాలి' అని చెప్పేసింది.

అది మొదలు ఆ కాకి ఉపమన్యుడికి ఇష్ట సఖుడయి, గుడ్లగూబల మందిరంలో యధేచ్ఛగా తిరగటం మొదలు పెట్టింది.

(ఆ తర్వాత ఏమయిందో మళ్ళీ చూద్దాం...)