రంగారావుగారు చాలా పెద్ద మనిషి.

ప్రతి సంవత్సరం మే మాసంలో ఆయన ఓ గొప్ప విందునిచ్చేవారు- ఊళ్ళో పిల్లలందరికీ ఆ రోజు నిజంగా పండగలాగానే ఉండేది: ఒకవైపున వంటల హడావిడి; మరోవైపున మామిడి పళ్ళ హడావిడి! రంగారావుగారి విందులో గారెలు, బూరెలు, పులిహోర, పెరుగన్నాల భోజనంతో పాటు అందరికీ తిన్నన్ని మామిడిపండ్లు కూడా అందేవి మరి!

అందుకని ఏప్రియల్ మాసం వస్తోందంటే చాలు మేమాసపు విందుకోసం ఎదురు చూడటం మొదలు పెట్టేవాళ్ళు అందరూ.
రంగారావుగారి మామిడి తోటనంతా చూసుకునేవాడు రంగయ్యతాత. తోటలో ఎండిపోయినచెట్ల కొమ్మల్ని నరికేసి శుభ్రం చేయటం, నీరు కట్టటం నుండి పండ్లు కోసేంతవరకూ అంతా అతనే సొంతగా గమనించుకొని చేసేవాడు. విందునాడు అందరూ "అబ్బ! మామిడి పళ్ళు ఎంత తియ్యగా ఉన్నాయో!" అని మెచ్చుకుంటుంటే రంగయ్య మనసు సంతృప్తితో‌నిండిపోయేది.

అయితే ఓ సంవత్సరం మామూలుగానే వచ్చేసింది- ఉగాది.

పిల్లలందరూ వేపపూత కోసం, మామిడి పిందెలకోసం, చింతపళ్ళకోసం తోటల్లో వెతుక్కోవటం మొదలు పెట్టారు. రవి, సౌమ్య, కవిత, శాంతి, సుధాకర, పవన్.. వీళ్ళ బృందం ఒకటి రంగారావుగారి తోటవైపుకు వెళ్ళింది-

తోటంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ చూసినా ఎండిపోయిన కొమ్మలు, కలుపు మొక్కలు కనిపించాయి. రంగయ్య తాత ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. ఆ సంవత్సరం కూలివాళ్ళ సమస్య కూడా తోడైంది. బావిలో నీళ్ళున్నాయి; కానీ‌ మోటారు నడిచేందుకు కరెంటు లేదు.

"ఏమైంది తాతా?! ఎందుకిట్లాగ, ఈ సారి?" అడిగారు పిల్లలు.

"యవత్స ఒక్కల్ల సేతి మీదిగా నడత్తంటే ఒక్కోతూరి ఇట్టాగే అవుతుంది పిల్లలూ! ఇన్నాల్లూ బాగున్న తోట కాస్తా, నా ఆరోగ్గెం పాడయ్యే మేలికి యలాగైందో సూడండి! ఈ సమ్మచ్చరం పూత బాగా వచ్చింది; పిందెలు బాగా పడ్డాయి; జాగర్తగా కాపాడితే కాతా బాగానే వత్తుంది- కానీ నాకు సెక్తి సాలటం లేదు. ఈసారి మే మాసపు విందుకి కాయలు తక్కువ పడతాయేమో!" అన్నాడు రంగయ్య తాత, నీరసంగా.

"అట్లా ఏం కాదులే తాతా, మేమందరం లేమూ?!" అన్నాడు రవి అనాలోచితంగా, తాత ప్రక్కన కూర్చొని.

"అవును తాతా! నువ్వు ఊరికే చెబుతూండు, ఏం చేయాలో; మాకు చేతనైనంత మేం చేసేస్తాం" అన్నది సుగుణ.

తాత నవ్వాడు- "బాగుంది-పసి పిల్లలు మీరేం సేత్తారులే. పెద్ద పెద్దోల్లకే పని కస్టం అనిపిత్తుంటేను" అన్నాడు.

"ఈ తోటలో మామిడి పళ్ళన్నీ తినేది మేమేగా?! అందుకని పనిలో మేం సాయం చెయ్యాల్సిందే " అన్నాడు సోము, అకస్మాత్తుగా పెద్దవాడైపోయి.

"అవునవును" అన్నారందరూ.

"పదండిరా, ముందు ఈ చెట్లన్నిటికీ పాదులు చేయాలి. కలుపు తీసేయాలి" చెప్పాడు రాఘవ.

పిల్లలందరూ పనిలోకి దిగారు; రంగయ్య వారిస్తున్నా వినకుండా.

క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం‌ రెండు రెండు గంటల పని మొదలెట్టారు.

వారం రోజుల్లో తోట మళ్ళీ దారికొచ్చింది.

మరో వారం తిరిగే సరికి తోటలో కోయిలలు కూశాయి.

పిల్లల నవ్వులతో, కేరింతలతో, శ్రమ శక్తితో పూతంతా కాతైంది.

వాళ్ళ జీవశక్తితో నిండి ప్రతికాయా ఉత్సాహంగా నవ్వింది.

రంగయ్య తాత ఆరోగ్యం బాగైంది.

"ప్రతిసారికంటే ఈసారి పళ్ళు ఇంకా చాలా మధురంగా ఉన్నాయి" అన్నారందరూ.

"పసి పిల్లలు- వాళ్లకెంత పట్టుదలో సూడండి. నేను ఒద్దన్నా వినకండా పని సేసారు. ఇదంతా వాల్ల కుసిపలితమే" అన్నాడు రంగయ్య తాత.

"మా పళ్ళు మేం పండించుకుంటాం, ఇకనుండీ!" అన్నాడు రాఘవ.

అది చాలు- ఇంక మే మాసపు విందు ఎన్నేళ్లయినా నిరాటంకంగా సాగుతుంది.

కొత్తపల్లికి ఈ మాసంతో ఐదేళ్ళు నిండుతున్నాయి. 2008 ఉగాదితో మొదలై ఇప్పటికి నిండుగా అరవై పుస్తకాలైన కొత్తపల్లిని అభిమానించి, ఆదరిస్తున్న మీకందరికీ నూతన సంవత్సర, మే మాసపు శుభాకాంక్షలు!

కొత్తపల్లి బృందం.