ఒక సారి టక్కరి నక్క ఒకటి అడవి దారిన పోతూ ఉంటే, ఓ చెట్టు కొమ్మ మీద కూర్చొని కనిపించిందొక చిలుక.

"దాన్ని గుటుక్కుమనిపిస్తే బాగుంటుంది కదా!" అనిపించింది నక్కకి.






అది చిన్నగా ఆ చిలుక ఉన్న చెట్టు కిందకు చేరి- "చిలుకా! చిలుకా! నీ రెక్కలు భలే ఉన్నాయి చూపించవా!" అన్నది.

చిలుక మురిసి పోయింది. రెక్కలు టప టపా ఆడించి అరిచింది.





ఈసారి "చిలుకా! చిలుకా! నీ కాళ్ళు- అబ్బ, నీ కాళ్ళు భలే ఉన్నాయి చూపించవా!" అన్నది నక్క.

చిలుక మురిసి పోయింది. రెండు కాళ్ళనీ అటూ ఇటూ కదిలిస్తూ నాట్యం చేసింది.





ఈసారి - "చిలుకా! చిలుకా! నీ కంటి రెప్పలు ఎంత బాగున్నాయో! చూపించవా?!" ముద్దుగా అన్నది నక్క.

చిలుకకు మునగ చెట్టు ఎక్కినట్లయింది. మురిసిపోయి, ఒక్క క్షణం పాటు తన కంటి రెప్పలు మూసింది- అంతే- నక్క ఒక్క ఉదుటన ఎగిరింది. చటుక్కున చిలుకను నోట కరుచుకుంది.




జరిగింది అర్థమయ్యే సరికి చిలుక గుండెలు గబగబలాడాయి. ప్రాణాలు కడబట్టాయి.

అయినా ఒక ప్రయత్నం చేద్దామనుకుంది:

"నక్క బావా! నక్క బావా! నీ చేతికి ఎట్టాగూ చిక్కాను. ఇక ఎలాగూ చస్తాను. చనిపోయే ముందు ఒక్క సారి నీ గొంతు వినాలని ఉంది: నోరు తెరిచి 'చిలుకా' అని పిలువు ముందు" అంది.


నక్కకు చిలుక తెలివి అర్థమయింది. "నేను నోరు తెరిస్తే తప్పించుకుందామనుకుంటోంది, ఈ దొంగ చిలుక!" అనుకున్నది. కోపం వచ్చింది: "ఒసే చిలుకా! నీ తెలివి నా దగ్గర సాగదు. నేను నోరు తెరిస్తే పారి పోదామనేగా, నీ ప్రయత్నం?!" అంది. అయితే పాపం ఆ మాట అనడానికైనా అది నోరు తెరవాల్సిందే కదా?

నక్క నోరు తెరిచింది; చిలుక తుర్రున ఎగిరి పోయింది! "ఇంకెప్పుడూ పొగడ్తలకు లొంగను" అనుకున్నది మరోసారి.