పట్టణం లోని విద్యానికేతన్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు రాజేష్. వాడికి జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. ముఖ్యంగా చిన్ని చిన్ని జీవులంటే మరీ మరీ ఇష్టం.
రాజేష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అడవికి దగ్గరగా ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. సెలవులు వచ్చాయంటే చాలు- రాజేష్ వాళ్ళంతా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ అడవిలో జంతువులను పక్షులను దగ్గరిగా చూస్తూ ఆనదించేవాళ్ళు.
ఈ సారి సెలవుల్లో కూడా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళాడు రాజేష్. అడవిలో అంతా కులాసాగా తిరుగుతూ రేగు పండ్లు కోసుకుంటూ ఉండగా రాజేష్ కు ఒక బుజ్జి కుందేలు కనిపించింది. అది చాలా నెమ్మదిగా, బాధగా నడుస్తూ ఉంది. రాజేష్ ఆ కుందేలు దగ్గరికి వెళ్ళి "బుజ్జి కుందేలా... ఎందుకు, అట్లా బాధగా నెమ్మదిగా నడుస్తున్నావ్?" అని అడిగాడు.
"ఏం చెప్పను? మా అమ్మ, నాన్న, ఇద్దరు అన్నయ్యలు , నేనూ- అందరం ఈ అడవిలో హాయిగా కలిసి జీవించేవాళ్ళం. అయితే ఒక రోజున నేను జామ కాయలు తిందామని వాళ్లకు కాస్త దూరంగా అడవిలోకి వెళ్ళాను. మళ్ళీ తిరిగి వచ్చాక ఎంత వెతికినా ఇంక మా వాళ్ళెవరూ కనిపించనేలేదు!
అమ్మ వాళ్ళను ఎవరో పట్టణపు మనుషులు పట్టుకుని వెళ్తుండగా చూశానని కాకి మామయ్య చెప్పాడు! " అని బుజ్జి కుందేలు ఏడవటం మొదలు పెట్టింది.
రాజేష్ చాలా బాధ పడ్డాడు. "మీ అమ్మ వాళ్ళను ఎవరో ఎత్తుకెళ్ళి ఎన్నిరోజులైంది?" అడిగాడు.
"రెండు రోజులైంది.. వాళ్ళను చూడకుండా ఉండలేనన్నా" ఏడుస్తూ చెప్పింది బుజ్జి కుందేలు.
"బుజ్జీ.. నువ్వు ఏడ్వొద్దు.. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. మాదికూడా పట్టణమే.. అక్కడ ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల ఉంది. అక్కడ కొత్తగా కుందేళ్ళ ప్రదర్శనను కూడా ఒకదాన్ని ఇటీవలే ప్రారంభించారని పేపరులో చదివాను. మీ అమ్మ వాళ్ళను పట్టణపు వాళ్ళు అక్కడికే తీసుకు వెళ్ళి ఉంటారు.. నువ్వు నాతో రాగలవా, మీ అమ్మ వాళ్ళు అక్కడ ఏమైనా ఉన్నారేమో చూద్దాం? " చెప్పాడు రాజేష్.
అ మాటలను బుజ్జి కుందేలు ఎగిరి గంతేసింది. మళ్ళీ బాధగా ముఖం పెట్టింది.
"ఎందుకలా మళ్ళీ బాధపడుతున్నావ్?" బుజ్జి కుందేలును అడిగాడు రాజేష్.
"నువ్వు కూడా పట్టణపు అబ్బాయివే కదా? 'అసలు మనుషులనే నమ్మొద్దు' అని చెప్పేది మా అమ్మ. మరి నిన్ను నమ్మొచ్చా? నువ్వు నన్ను ఏం చెయ్యవుగా?!" అనుమానాన్ని బయట పెట్టింది బుజ్జి కుందేలు.
"నీకేం కాదు- నన్ను నమ్ము. నిజానికి పిల్లలెవ్వరూ నీలాంటి చిట్టి కుందేళ్లను ఏమీ చెయ్యరు అసలు. అమ్మ తోడు.." అని రకరకాలుగా చెప్పాడు రాజేష్.
బుజ్జి కుందేలుకు నమ్మకం కుదిరింది. రాజేష్‌తోపాటు అది కూడా పట్టణానికి బయలుదేరింది. బుజ్జికుందేలును ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు పరిచయం చేశాడు రాజేష్. రాజేష్, వాళ్ళ నాన్న ఇద్దరూ బుజ్జి కుందేలును జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళారు.
ఆక్కడ ప్రదర్శనలో చాలా కుందేళ్ళు కనబడ్డాయి. వాటిలో బుజ్జి కుందేలు అమ్మానాన్నలేవో అర్థం కాలేదు రాజేష్‌కు. అయితే బుజ్జి కుందేలు అరుపులు విని అవే వీళ్ళ దగ్గరికి పరుగున వచ్చాయి. బుజ్జి కుందేలు సంతోషానికి మేరలేదు.
కుందేళ్ళు కొన్ని వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాయన్న వార్త విన్న జంతు ప్రదర్శనశాల అధికారులు తమంతట తామే వచ్చారు అక్కడికి. రాజేష్ వాళ్ళ నాన్న ఆ అధికారులతో మాట్లాడారు. ప్రదర్శన కోసం అడవిలోంచి తెచ్చిన కుందేళ్ళను ఆ ప్రదర్శన అవ్వగానే తిరిగి అడవిలోనే వదిలేస్తామని చెప్పారు వాళ్ళు. 'మీరు వాటిని ఇంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి, మీకోసం వాటిని ఇప్పుడే వదిలెయ్యమంటే వదిలేస్తాం' అని కూడా అన్నారు వా ళ్ళు.
'ఇప్పుడే వదిలెయ్యండి. ఈ చిట్టి కుందేలు వాటికోసం ఎంతగా తపించిపోతున్నదో చూశారుగా?' అన్నారు రాజేష్ వాళ్ళ నాన్న.
రాజేష్‌ను, వాళ్ల నాన్నను తన వాళ్లకు పరిచయం చేస్తూ జరిగిన కథంతా చెప్పింది బుజ్జి కుందేలు. కుందేలు అమ్మ నాన్నలు రాజేష్‌కు, వాళ్ళ నాన్నకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పాయి.
బుజ్జికుందేలును, వాళ్ళ బంధువులను అందరినీ అడవికి తీసుకెళ్ళి వదిలారు. ఇప్పుడు రాజేష్‌కు అడవిలో నిండా స్నేహితులే! సెలవులు వచ్చినప్పుడు ఇక వాడు ఊరికి వెళ్ళేది అమ్మమ్మని చూసేందుకు కాదు- అడవిలో దండిగా ఉన్న తన మిత్రుల్ని కలిసేందుకే!