లోలా వాల్టర్స్ అనే పధ్నాలుగేళ్ళ అమ్మాయి అమెరికాకు చెందిన ఒక జిమ్నాస్ట్- అంటే తెలుసుగా, సర్కస్ ఫీట్లు చేసి-శరీరాన్ని ఎటుపడితే అటు వంచి, తీగల మీద నడిచేసే పాప అన్నమాట.

చూసేందుకు మనకి మామూలుగా అందరి లాగానే అనిపిస్తుంది తను. కానీ, అసలు విషయం ఏమిటంటే, తనకి 'నిస్తాగ్మస్' అనే కంటి జబ్బు ఉంది. దీని వల్ల, ఐదు అడుగుల దూరం లోపు ఉండే వస్తువులు మాత్రమే కనబడతాయి. పైగా, కంటి చూపు కుదురుగా నిలవకుండా, కళ్ళు అటూ ఇటూ కదులుతూ ఉంటాయి! దీని వల్ల ఎదురుగ్గా ఉన్న వస్తువు ఎత్తు-లోతు గురించి కూడా సరయిన అవగాహన ఉండదు! మామూలు పనులు చేసుకునే మనలాంటి వాళ్లకే అదెంత కష్టమో కదా, మరి రోజూ బయట ప్రదర్శనలు ఇచ్చే ఒక జిమ్నాస్ట్ కి ఇలాంటి సమస్యలు ఉంటే ఎంత కష్టమో ఊహించుకోండి! మరి అయినా కూడా లోలా జిమ్నాస్టిక్స్ లో తన ప్రతిభతో అమెరికాలో ఎంతో పేరు తెచ్చుకుంటోంది ఇప్పుడు.

"నాతో పోటీ పడే వాళ్ళలో చాలా మంది నాకు ఈ సమస్య ఉన్నట్లు గుర్తించలేరు" అంటుంది లోలా. సాధారణంగా, పోటీలకి వచ్చే న్యాయనిర్ణేతలకి కూడా ఈ విషయం ముందుగా చెప్పరు లోలా వాళ్ళు. పోయిన సంవత్సరం జరిగిన ఒక అమెరికన్ ఛాంపియన్ షిప్ లో న్యాయనిర్ణేతలు లోలా ప్రదర్శనను ఎంతో మెచ్చుకున్నాక తెలిసిందట, ఆ న్యాయనిర్ణేతలకి కూడా - వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోయారట.

కంటిచూపు సమస్య ఉంది కదా, అందుకని మిగతా వాళ్లతో పోలిస్తే ఎక్కువసార్లు కింద పడిపోతూ ఉంటుందట లోలా. తనకి తగిలే దెబ్బలు కూడా మిగితా వాళ్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే నట. కానీ, పడిన ప్రతిసారీ పైకి లేచి మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంటుందట. పోటీ జరుగుతున్న సమయంలో దృష్టి మందగించినప్పుడు, చేతుల్తో, కాళ్ళతో నేలని ముట్టుకొని చూస్తుందట. అలా ఎదురుగా ఉన్న వస్తువుల ఎత్తు, లోతుల అవగాహన కలిగించుకుంటుందట. అలాగే, వాటిమీది నుంచి దూకాలన్నప్పుడు ఒక్కోసారి తనకి అవతలి ప్రక్కన ఏముందో కనబడదట. అయినా సరే, ఎంత వరకూ దూకాలో ఒక ఆంచనా వేసుకొని దూకేస్తుందట తను!

కంటి చూపు లోపం వల్ల తనకి లెక్కలేనన్ని సమస్యలు వస్తుంటాయి. అయితేనేమి, లోలా ఆ సమస్యలకు చిన్నబుచ్చుకోదు; కోపగించుకొని ఏడవదు. ఆ సమస్యలనన్నిటినీ తను అధిగమిస్తుంది. ఏదో సాదా సీదా పని చేసుకొని బ్రతుకును ఈడ్వటం కాదు- చక్కని జిమ్నాస్ట్ గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. 'ఎన్ని కష్టాలొచ్చినా దాటటం' అంటే ఏంటో మనం లోలా వాల్టర్స్ నుండి నేర్చుకోవచ్చు.

పట్టుదల, కృషి ఉంటే చాలు- మనం అనుకున్నది ఏదైనా సాధించచ్చు. లోలా లాంటి పిల్లలు మనకి నేర్పేది అదే కదూ?