సిక్సర్!
చిన్న (ఏడుస్తూ) : నాన్నా! అన్నయ్య సిక్స్ కొట్టాడు!
నాన్న: సిక్స్ కొడితే సంతోషంగా చప్పట్లు కొట్టాలిరా, ఏడుస్తున్నావెందుకు?
చిన్న: వాడు కొట్టింది ఆరు మొట్టికాయలు!
నా తెలివే!
నాన్న: చరణ్! భూమి గుండ్రంగా ఉందని ఎవ రు చెప్పారు?
చరణ్: మా సోషల్ అయ్యవార్ చెప్పారు నాన్నా!
తమాషా రోడ్డు!
రాజు: ఏంట్రా, ఉదయం నుండీ ఇక్కడే కూర్చున్నావు?
వెంగళప్ప: ఉదయం ఒకతను ఈ రోడ్డు విజయవాడ వెళ్తుందని చెప్పాడు. ఆ తమాషా చూడ్డానికి..!
సర్దుబాటు!
జ్యోతిష్యుడు: మీరు నిండా డెభ్భై ఏళ్ళు నిశ్చింతగా బ్రతుకుతారు.
సుబ్బారావు: అయ్యో రామ! నాకిప్పుడు ఎనభై ఏళ్ళొచ్చాయి!
జ్యోతిష్యుడు: అదే, నేను చెప్పేది- డెభ్భై ఏళ్ళు నిశ్చింతగా బ్రతికాక, మరి కొన్నేళ్ళు కష్టపడుతూ బ్రతుకుతారు.
ఎండ-నీడ
భార్య: జీవితాంతం మీ నీడలో బ్రతకాలని ఉంది.
ఫిజిక్సు అయ్యవారు: అంటే జీవితాంతం నేను ఎండలో నిలబడాలనా, నీ ఉద్దేశం?!
తీపి ఎక్కువయింది!
రాము: మొన్నటివరకూ అందరితోటీ తీయగా మాట్లాడేవాడివి, ఇప్పుడు అంత కటువుగా మాట్లాడుతున్నావెందుకు?
వెంగళప్ప: నాకు షుగర్ ఉందని తెల్సిందిరా, డాక్టరు గారు తీపికి దూరంగా ఉండామన్నారు; అందుకని!
ఎవరు కుక్క?!
అప్పారావు: మీ హోటల్లో కుక్కలకి భోజనం పెడతారా?
సర్వర్: మాకు అట్లాంటి పట్టింపులేమీ లేవు- రండి కూర్చోండి. భోజనం తయారుగా ఉంది!
నాటకం!
స్వామి: ఈ ప్రపంచం అంతా రంగస్థలం నాయనా!
శిష్యుడు: మరి నాటకానికి టిక్కెట్లు ఎక్కడ దొరుకుతాయి స్వామీ?!
ప్లీజ్!కాదనకు!
అమ్మ: చలిగా ఉంది కదా, ఐస్‌క్రీం తినకు!
రవి: స్వెటర్ వేసుకొని తింటానులేమ్మా!
నిద్ర మత్తు!
డాక్టరు: రోజూ నిద్ర లేచిన తర్వాత ఒక మాత్ర వేసుకోండి.
పేషంటు: నిద్రలేచాక ప్రతిసారీ వేసుకోవాల్సిందేనా, సార్?
డాక్టరు: అదేం ప్రశ్న?!
పేషంటు: మీరిచ్చిన మాత్రలు తింటే ఎప్పుడూ మత్తుగానే ఉంటోంది మరి- రోజూ పదిసార్లు నిద్రపోతున్నాను, పదిసార్లు లేస్తున్నాను!
టింగ్లీష్!
టీచర్: రామూ! మీ నాన్నగారి పేరును రాయమంటే 'Temple steps water king' అని రాశావేమిటి, తిక్కనా?!
రాము: మరి మా నాన్నగారి పేరు 'గుడి మెట్ల గంగ రాజు' టీచర్!
గోడ కుర్చీ!
టీచర్: సోమూ, నా కుర్చీ పట్టుకెళ్తున్నావెందుకు?
సోము: మీరేకద టీచర్, గోడకి కుర్చీ వేయమన్నారు?!
స్పెషల్!
వెంగళప్ప: నేను హైదరాబాదులో స్పెషల్ దోసె తిన్నాను తెలుసా?!
సురేష్: అవునా?! ఎలా ఉంది అది?
వెంగళప్ప: గుండ్రగా!
సకారణమే!
టీచర్: నిన్న బడికి ఎందుకు రాలేదు?
రాజు: మా అమ్మ కొట్టింది టీచర్!
టీచర్: అవునా?! ఎందుకు కొట్టింది?
రాజు: మరి నేను బడికి వెళ్ళనన్నానుగా, అందుకని.
సీత కష్టాలు సీతవి!
నాన్న: మా చిన్నప్పుడు ఇళ్ళలో కరెంటు లేక వీధి దీపాల క్రింద చదువుకున్నాం తెలుసా?
చిన్న: అప్పుడు కనీసం వీధి దీపాలకన్నా కరెంటు అందేది కద నాన్నా, ఇప్పుడు అదీ ఉండట్లేదు, మేమేం చెయ్యాలి?!