ఒకసారి చిన్న పురుగు ఒకటి ఎక్కడికో పోతున్నది. దూరం నుండే దాన్ని చూసింది, ఒక కప్ప. మహా ఆనంద పడింది. "ఆహా! ఎంత చక్కటి భోజనం దొరికింది!" అని సంతోషంతో పొంగి పోయింది. పురుగును తినే ఉబలాటం కొద్దీ దాని వైపుకు పరుగెత్తింది.
సరిగ్గా అదే సమయానికి కప్పను చూసిందొక పాము. దానికి నోరూరింది. "ఎంత కాలానికి, ఇంత చక్కని కప్ప నాకు ఆహారం కాబోతున్నది!" అని మురిసి పోయింది. కప్పను మ్రింగాలనే కోరికతో దాని వెంట పడింది. అటూ ఇటూ చూడకుండా వేగంగా కప్ప వెనక బయలుదేరింది.
ఆ సమయంలో దాన్ని చూసింది, ఒక నెమలి. "ఓహో! కన్నూ మిన్నూ కానని పాము ఇప్పుడు నా కంట పడింది- ఇక కొద్ది సేపట్లో నాకు ఆహారం కానున్నది- తప్పదు" అని పాము వైపుకు దూకబోయింది.
అంతలోనే అది ఒక పులి కంట పడింది. "ఎంత ధైర్యం, ఈ నెమలి నన్ను గమనించనైనా గమనించలేదు. దీనికి కాలం చెల్లింది. నాకు ఆహారం అవ్వనున్నది" అని నెమలిమీదికి దూకేందుకు సిద్ధ పడింది.
అదే సమయానికి బోయవాడొకడు పులిని చూసి, దాన్ని వేటాడే ఉద్దేశంతో ధనుర్బాణాలు తీసుకొని పరుగున వచ్చాడక్కడికి.
అట్లా ప్రాణులన్నీ తమ ముందున్న ఆహారాన్ని చూస్తూ మురిసి పోతున్నాయి తప్పిస్తే, తమ వెనుక పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించటమే లేదు, దాన్ని గురించి ఏమాత్రం ఆలోచించటమే లేదు!