సాలమన్ చక్రవర్తి చాలా గొప్పవాడు. ఆయనకు అనేక అద్భుత శక్తులు ఉండేవి. ఆయన దేవతలతో రోజూ మాట్లాడుతుంటాడనీ, ఎక్కడికంటే అక్కడిగి ఎగిరి పోగలడనీ, ప్రజలు చెప్పుకునేవాళ్ళు.
ఒకసారి ఒక నడివయసు వ్యక్తి సాలమన్‌గారి దర్బారులోకి వచ్చి తటాలున ఆయన పాదాలమీద పడి, 'కాపాడండి! కాపాడండి!' అని ఏడవటం మొదలు పెట్టాడు.
'ఏమైంది, నీకు? ఎవరినుండి భయం?' అడిగాడు సాలమన్, అతన్ని లేవనెత్తుతూ.
'మహాప్రభూ! ఇవాళ్ళ నాకు మృత్యుదేవుడు దర్శనమిచ్చాడు. అతన్ని చూడగానే నాకు అర్థమైపోయింది- అతను నా ప్రాణాలు హరించేందుకే వచ్చాడని. అతను నన్ను చూసి- నా కళ్ళలోకే చూస్తూ- ఒకలాగా నవ్వాడు. ఆ నవ్వులోని క్రూరత్వం నన్ను ఎంతగా భయపెట్టిందోచెప్పలేను. నా మరణ ఘడియలు దగ్గర పడ్డాయని నాకు అర్థం అయ్యింది. ప్రభూ! నన్ను కాపాడండి!' అని చెబుతూ బిగ్గరగా ఏడ్చాడతను.
'ఊరుకో, నేను ఏం చెయ్యాలో చెప్పు. నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను' అన్నాడు సాలమన్ చక్రవర్తి, దయతో కరిగిపోయి.
'ప్రభూ, తమరికున్న అద్భుత శక్తితో తక్షణం నన్ను ఇక్కడినుండి దూరంగా పంపించేయండి. పురుగు కూడా చొరలేని ఏవైనా సుదూర తీరాలకు- ఏ భారతదేశపు దట్టమైన అడవుల్లో మారుమూలకో పంపించేయండి. ఇట్లా ఇంతమంది మధ్య కాక, ఎవరూ లేని మూలన తలదాచుకుంటాను. ఈ మృత్యు ఘడియలు ఐపోయేంతవరకూ దైవ ప్రార్థన చేసుకుంటాను. ఆపై తమరి దయ!' అన్నాడా వ్యక్తి, వణికే గొంతుతో.
'సరేలే, దానిదేముంది, అలాగే చేద్దాం' అన్నాడు సాలమన్ చక్రవర్తి. ఎగిరే తివాచీని రప్పించాడు. 'ఈ మనిషిని సత్వరం భారతదేశం చేర్చు. అక్కడ అతను ఏ మూలన కోరుకుంటే ఆ మూలన వదిలిపెట్టి రా' అని ఆజ్ఞాపించాడు దాన్ని.
నడివయసాయన ప్రభువుకు నమస్కరించి ఎక్కి కూర్చోగానే, తివాచీ వేగంగా ఆకాశంలోకి ఎగిరి భారతదేశం వైపు ప్రయాణించింది. దాని వేగానికి గాలి కూడా తల వంచింది. దిక్కులు అన్నీ ఏకమై ఆశ్చర్యంగా చూశాయి.
కొద్ది సేపట్లోనే తివాచీ భారతదేశం చేరుకున్నది. అది ఓ దట్టమైన అడవిలో వాలదామనుకునే సరికి, దాని ముందు ప్రత్యక్షమయ్యాడు మృత్యువు: 'వచ్చావా, రాలేవేమో అనుకున్నాను- రా, రా!' అంటూ.
మృత్యువుని చూసేసరికే నడివయసు మనిషి ఒళ్ళు చల్లబడ్డది. భయంతో అతని గుండె ఆగిపోయింది. అతని శరీరం తివాచీ మీదినుండి ఆ అడవిలోకి దబ్బున జారి పడిపోయింది.
తివాచీ ద్వారా విషయం తెలుసుకున్న సాలమన్ చక్రవర్తి మృత్యుదేవుడితోమాట్లాడాడు- 'ఎందుకయ్యా, నిన్న ఆ మనిషిని అంతగా భయపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని అడిగాడు.
'అయ్యో, నేను కావాలని ఏమీ చెయ్యలేదు' అన్నాడు మృత్యుదేవుడు.
'అదేమి మాట! నిన్న నువ్వు అతన్ని చూసి వికటంగానవ్వావట!' అడిగాడు సాలమన్.
'ప్రభూ! తమరు అడిగాడు కాబట్టి చెబుతున్నాను. 'ఆ మనిషి ప్రాణాలను ఇవాల్టి ఉదయం పదిగంటలకల్లా, భారతదేశం పడమటి కనుమల్లో హరించు' అని నాకు విధి ఆదేశం. అయితే, నిన్న సాయంత్రం చూస్తే అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు- 'ఎక్కడి భారత దేశం, ఎక్కడి కాబూల్?! ఇతను అక్కడికి ఎలా చేరుకుంటాడు, అదీ రేపట్లోగా? అసంభవం! ఎందుచేతనో విధి తప్పింది, ఇన్నాళ్లకు!
మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇతన్ని వదిలేయాలి..' అనిపించి, నా అసమర్థతకు నేనే నవ్వుకున్నాను'-
'అయితే తమరి చలవ వల్ల అతను నిర్దేశించిన సమయానికి సరిగ్గా భారతదేశపు పడమటి కనుమలు చేరుకునేశాడు! దాంతో నేను నా విధిని నిర్వర్తించాను- ఏం చేసేది, విధి బలీయం!" అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్లు.
'విధి రాతను తప్పించటం తన వల్ల కూడాకాలేదు' అని గ్రహించి మళ్ళీ ఓమాటు ఆశ్చర్యపోయాడు సాలమన్ చక్రవర్తి.