అనగనగా ఒక యువరాజు. ఆ రాజు ఎంతసేపూ తన అందాన్ని చూచుకొని మురిసి మైమరచి పోతుండేవాడు.
ఎవరైనా బాటసారులు రాజభవనానికి వస్తే "మీరెప్పుడైనా నా అంత సౌందర్య వంతుణ్ణి చూశారా?" అని వాళ్ళ నడిగేవాడు.
'లేదు'అనే చెప్పేవాళ్ళు అందరూ . ఒక రోజు దర్శనాని కొచ్చిన ఓ నీచ బాటసారైతే "దేవుడు కూడా మీ అంత అందంగా వుంటాడని నేననుకోను..!" అంటూ అతిగా పొగిడాడు. దాంతో పొంగిపోయిన యువరాజు "దేవతలకంటే కూడా నేనే సౌందర్యవంతుడ్ని.." అంటూ మరింత గొప్పగా చెప్పుకునేవాడు.
అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇద్దరు దర్శకులు తాముదైవస్వరూపులమని చెప్పుకుని యువరాజు దర్శనానికి వచ్చారు.
"మీరు చెప్పుకుంటున్నంత సౌందర్య వంతులో-కాదో..!? చూద్దామని వచ్చాం.." వివరించారు.
"నేను కాదా!?" ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
"మిమ్మల్ని ఈ రోజు ఉదయం నిద్రిస్తుండగా చూశాం. అప్పుడు ఇంకా అందంగా వున్నారు " ఒక దేవదూత చెప్పాడు.
"నా సౌందర్యం అప్పుడే- కొన్ని గంటల్లోనే ఎలా తగ్గిపోయింది?" అంటూ సేవకుల్ని పిలిచి "నేను ఉదయం ఇప్పటికంటే ఎక్కువ అందంగా వున్నానా?" ఆరా తీసాడు యువరాజు.
"మీరు అప్పుడూ-ఇప్పుడూ ఒకేలా వున్నారు" అని జవాబిచ్చారు సేవకులు.
"మేము దైవ స్వరూపులం. మీ సేవకులు చూడలేని వాటిని కూడా మేము చూడగలం. వాళ్ళ దృష్టి అసంపూర్ణం, కనుక వాళ్ళు చెప్పింది నిజం కాదు. ఆ విషయం మీకు రుజువు చేస్తాం..." అంటూ ఒక దేవదూత ఒక పాత్రలో నీళ్ళు తెప్పించమని అడిగాడు యువరాజును.
యువరాజు వెంటనే సేవకుల చేత ఒక పాత్రలో నీళ్ళు తెప్పించాడు.
దేవదూత సేవకుల్ని పిలిచి "పాత్రలోని నీటిని మీరు దగ్గరగా పరిశీలించండి. ఆ తరువాత గది బయటకి వెళ్ళండి" అని చెప్పాడు. అలాగే సేవకులు పాత్రలోని నీటిని పరిశీలించి, బయటికి వెళ్ళారు.
అప్పుడు ఆ దేవదూత పాత్రలోంచి ఒక అరచెంచా నీటిని తీసివేశాడు. మళ్ళీ సేవకుల్ని లోపలికి పిలిచి "పాత్రలోని నీటి మొత్తంలో ఏమైనా తేడా ఉందా?" అడిగాడు.
"ఏమీ లేదు" జవాబిచ్చారు సేవకులు.
"చూశారా?! పాత్రలో నీళ్ళు తగ్గిన సంగతిని మీ సేవకులు గమనించనే లేకపోయారు?! మీ అందం తగ్గిన సంగతి ఎలా గమనించలేదో ఇదీ అంతే..." దేవదూత అన్నాడు యువరాజుతో.
యువరాజు కంపించిపోయాడు. 'నా అందం రోజురోజుకి తరిగిపోతోందన్న మాట! అయినా వీళ్ళెవ్వరూ దాన్ని గుర్తించటం లేదన్నమాట! అయ్యో!' అని బాధ పడ్డాడు.
'ఎప్పుడూ తరిగిపోయే దాని పట్ల అంత వ్యామోహం ఎందుకు?' అడిగి మాయమైపోయారు దేవదూతలు.
'అవును, ఎప్పుడూ తరిగిపోయే అందం గురించి నేనెందుకు అంతగా వ్యామోహపడాలి? ఆశాశ్వతమైన ఈ దేహ సౌందర్యాన్ని గురించి అంత చింత ఎందుకు?' ఆలోచనలో పడ్డాడు యువరాజు.
అటు తర్వాత ఆయనకు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు మరీ ఇష్టంగా ఏమీ అనిపించలేదు. 'మారిపోయే శరీరం కదా,ఇది!?' అనిపించసాగింది.
కాలక్రమేణా తను పూర్తిగా మార్పుచెందాడట- బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతనివ్వటం మానేసి, తన మనసును శుభ్రం చేసుకునే పనిలో పడ్డాడట.