కోసల దేశంలో ఓ గురుకులాన్ని నడిపిస్తారు జయనాధుల వారు. ఆయన దగ్గర చాలా మంది రాజ కుమారులు శిక్షణ పొందేవాళ్ళు. శాస్త్రాలతోపాటు ఆయన వారికి చాలా యుద్ధ విద్యలు నేర్పేవారు. అట్లా శిక్షణ పొందిన వాళ్లలో ఒకడు, అజేయుడు అనేవాడు.
చిన్న వయసు నుంచే విల్లు విద్య, మల్ల యుద్ధం, గుర్రపు స్వారి- ఇట్లా రకరకాల విద్యల్లో ప్రావీణ్యత పొందాడు అజేయుడు.
పోటీలన్నింటిలోనూ తోటి విద్యార్థుల కంటే ఒక అడుగు ముందు ఉండేవాడు. కొన్ని కొన్ని విద్యల్లోనైతే అతడి నైపుణ్యం గురువును మించి ఉంటుందని అనుకునేవాళ్ళు అతని మిత్రులు. అట్లాంటి మాటలు విన్నకొద్దీ అజేయుడికి తన శక్తి మీద విపరీతమైన నమ్మకం వచ్చేసేది. గురువుగారు తనను అనవసరంగా గురుకులంలో ఇరికించి పెట్టుకుంటున్నారనీ, తను అన్ని విద్యల్లోనూ ప్రవీణుడైనా కూడా తనను ఇంటికి పంపటంలేదనీ అనిపించేది అతనికి.
కొన్ని రోజుల తర్వాత అజేయుడు ఇక ఆగలేకపోయాడు- జయనాధులవారి దగ్గరికి వెళ్ళి "స్వామీ! నేను అన్ని విద్యల్లోనూ ప్రవీణుడినయ్యాను కదా, ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్ళి రాజ్య సంరక్షణలో పాల్గొంటాను" అన్నాడు.
గురువుగారు అతని మాటలు విని, చిరునవ్వు నవ్వారు. అతని చేతికొక విల్లునిచ్చి "దీన్ని పట్టుకో! నాతో రా! అన్నారు. దగ్గరలోనే ఉన్న ఒక సెలయేటి దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ.
సెలయేరు ఉధృతంగా పారుతున్నది . దాని మీద అడ్డంగా తాటిమాను ఒకటి వేసి ఉన్నది. "ఇదిగో! ఈ తాటిమాను మీదుగా నడుద్దాం, రా! అవతలివైపుకు వెళ్దాం!" అన్నారు జయనాధులవారు. వీళ్ళు నడుస్తుంటే తాటిమాను అటూ ఇటూ ఊగుతున్నది.
నది మధ్యలోకి చేరుతామనగా అజేయుడిని ఆగమన్నారు జయనాధులవారు. "అజేయా! అదిగో అటు చూడు; నదికి ఆవలి ఒడ్డున లక్ష్యం ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాను. ఇక్కడినుండి బాణాలు సంధించు. లక్ష్యాన్ని ఛేదించటం ఎంత సులువో చూపించు!" అన్నారు.
"దానిదేముంది గురువర్యా! ఒక్క బాణమూ తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తాను చూడండి" అని అజేయుడు ధనుస్సునెత్తి లక్ష్యానికి గురి పెట్టాడు. అంతలో అతను నిలబడిన తాటి మాను గజ గజా వణికింది- బాణం లక్ష్యాన్ని తప్పి వేరే ఎటోవెళ్ళి పడింది! ఇట్లా అజేయుడు వరసగా చాలా బాణాలు వేశాడు. కానీ అన్నీ ఎటెటో వెళ్ళి పడ్డాయి.
కంగారు కొద్దీ తబ్బిబ్బయిన అజేయుడు ఒక్కపెట్టున నీళ్ళలో పడబోతూ కేకలు వేసాడు- జయనాధులవారు అతన్ని కాపాడి సరిగా నిలబెట్టారు. అటుపైన అంతటి ప్రవాహంలోనూ తాటిమాను మీద ఒంటికాలిపై నిలబడి ఒకే బాణంతో లక్ష్యాన్ని ఛేదించి చూపారాయన! జయనాధుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.
"విలుకాడంటే విల్లు సంధించటంలోనే కాదు; శరీరాన్న నిశ్చలంగా ఉంచటం లోను, మనసును నిగ్రహించి నిలపటంలోనూ కూడా ప్రావీణ్యత సాధించాలి- అప్పుడే విద్య పూర్తయినట్లు. విలువిద్యకే కాదు, నిజానికి ఏ విద్యకైనా ఇది అవసరం. నువ్వు ఆ దశకు ఇంకా చేరుకోలేదు. ఆ రోజు వచ్చినపుడు నేనే నిన్ను రాజ్య సంరక్షణకు పంపిస్తాను. తొందరపడకు" అని జయనాధుల వారు చెబితే, ఇప్పుడు అవుననిపించింది అజేయుడికి!