కల్మషం లేని పసిపాపలాంటి నవ్వుతో, వీపు మీద కానుకలనే ప్రేమని పిల్లలందరికీ పంచడానికి వచ్చిన శాంతాక్లాజ్ దర్శనం హాయిగా వుంది. కొత్తపల్లి కూడా నెలనెలా పిల్లలకోసం వచ్చే శాంతా క్లాజ్.
ఈ సందర్భంగా ఓ సంగతి. చాలా ఏళ్ళుగా ఎంతోమంది పిల్లలతో గమనించాను- వాళ్ళకు 'దేవుడున్నాడా, దెయ్యాలుంటాయా' కంటే 'శాంతాక్లాజ్ వుంటాడా' అనే సందేహమే ఎక్కువగా వస్తుంది. నిజంగా శాంతాక్లాజ్ వుంటాడు కదూ? అనడంలో 'ఉంటే బాగుండు - ఉండాలి - లేదంటే నాకిష్టం వుండదు' అనే అర్థం స్ఫురిస్తుంది. ఎప్పుడైనా అది కల్పన అని గనక అంటే - చెప్పనంత బాధ, ఆ చిన్ని కళ్ళల్లో! అలాంటి అందమైన ఊహలని, ఆశలని ప్రేమతో నిజం పేరిట చెడగొట్ట కూడదనిపిస్తుంది.
ఈ సారి కథల విషయానికొస్తే-
'పిడుదు రంగయ్య' క్రొత్తగా వుంది. జ్యోతి మంచి కథని సేకరించింది. కాకపోతే 'పిడుదు' ఎవరో అస్సలర్థంకాలేదు*. నవీన్ కుమార్ సేకరణ 'త్యాగశీలి' ఎక్కడిదో గానీ మంచి విషయాన్ని క్లుప్తంగా, సూటిగా చెప్పింది. అయితే 'త్యాగశీలి' అనే టైటిల్ రాజసేఖరుడితో పాటు, అతనికి మంత్రం బోధించిన మనిషికి కూడా వర్తిస్తుందనిపించింది. డి.జ్యోతి వ్రాసిన 'సీసాభూతం' భూతాలు, దెయ్యాలు ఒట్టి మొద్దుబుర్రని తేల్చింది.
భూతాలకి పొడుపు కథలు కలపడం సరదాగావుంది.
హరికిషన్ గారి 'పిరికిదయ్యం' నిజంగా అంత తెలివి తక్కువది కాదు పాపం, అన్న ఒట్టి దద్దమ్మన్న సంగతిని బాగానే కనిపెట్టిందిగా! కథ నిజంగానే తమాషాగా వుంది. శంకరరావుగారి మ్యాజిక్ కథలు ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా వున్నాయి. తీసుకున్న అంశాలను కథలుగా అల్లడంలో ఆయన కృషిని అభినందించాలి.
లలితగారు ఈసారి ఇచ్చిన బొమ్మకు కథ అల్లడం సవాలే అనిపించింది. పిల్లల సృజనాత్మకత దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.
'విజ్ఞానం' శీర్షికని సమతగారు రెగ్యులర్‌గా అందించబోతున్నారా? మంచి ప్రయత్నమే గానీ, మన సైన్సుపాఠాల మాదిరి మారకుండా వుండేలా చూసుకోవడం అవసరం. ఏ విషయాన్నయినా ఆసక్తికరంగా అతి సులువుగా పిల్లలకందించడంలో అమెరికన్, చైనీస్ పుస్తకాలు మంచి నమానాలు కాగలవు.
కొన్ని కథలు 'ఇదేమిటి? - ఇలా వ్రాశారు? కొంచెం ప్రయత్నించి ఆసక్తికరంగా వ్రాస్తే బాగుండేదే' అనిపించాయి.
ఇక కొత్తపల్లి వారి 'ఉన్ని' కీ , కామా(,)లకీ అలవాటు పడిపోయాం. వాటి గురించి చెప్పడం కంటే - 'కొత్తపల్లి బృందం వాటిని అలానే కొనసాగించాలనుకుంటోంది' - అనుకోవడంలో సుఖముందనిపించింది!
క్రొత్త సంవత్సరంలో మరెంతో మంది పిల్లలు మరిన్ని క్రొత్త క్రొత్త కథలని వ్రాసేసి కొత్తపల్లి వేదికని పూర్తిగా వినియోగించుకోవాలని, మరెంతో మంది పిల్లలకి స్ఫూర్తికావాలనీ ఆశిస్తూ-
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. *పిడుదు అనేది పశువులను పట్టుకొని రక్తం తాగే పేను లాంటి ఒక జీవి! -సం.