ఇటీవలి కాలంలో మంచి పేరు తెచ్చుకున్న ఒక ఫోటోగ్రాఫర్, సెట్ డిజైనర్ ఎలినోర్ హార్ద్విక్. ఎన్నో ప్రముఖ పత్రికల్లో ఆ అమ్మాయి తీసిన ఫోటోలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఎందరో ప్రముఖ మోడళ్ళకు ఫోటో షూట్లు నిర్వహించింది ఆమె. బీబీసీ రేడియో వంటి అంతర్జాతీయంగా పేరు ఉన్న సంస్థలు, ప్రముఖ పత్రికల్లో ఆమె ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. ఇంతా చేసి ఆ అమ్మాయి వయసు ఇరవై ఏళ్లే! ఆ అమ్మాయి గురించే ఈసారి ఒక చిన్న పరిచయం.

1993లో ఇంగ్లండులో పుట్టిన ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండి మనుషుల బొమ్మలు గీయడం అంటే ఇష్టమట. పన్నెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఫోటోలు తీయడం మీద ఆసక్తి కొద్దీ, కెమెరా తీసుకుని తనకి తెలిసిన అందరి ఫోటోలు తీస్తూ, వాటిని ఫ్లికర్.కాం వెబ్సైటులో అప్లోడ్ చేస్తూ ఉండేది. మొదట్లో మామూలు గా ఉన్నా కూడా క్రమంగా ఆ ఆసక్తి కాస్తా కొంచెం సీరియస్ గా మారి, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ వైపు మళ్ళింది. కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త ఫోటోలతో ప్రయోగాలు చేస్తూ అంతర్జాలంలో అప్లోడ్ చేస్తూ ఉండగా, ఒక రెండు మూడేళ్ళ తరువాత ఒకసారి ఇవి గమనించిన కొందరు పత్రికల వాళ్ళు ఆవిడని ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలు ప్రచురితం అయ్యాక హార్డ్విక్ ఫోటోల గురించి అందరికీ తెలిసి, కొందరికి నచ్చి - వాళ్ళు తమ ప్రకటనల కోసం ఫోటోలు తీయమని అడగడం మొదలుపెట్టారట. అప్పటికే ఆ రంగం మీద విపరీతమైన ఇష్టాన్ని ఏర్పరుచుకున్న ఆమె కష్టపడి పనిచేస్తూ, ఆవిధంగా, పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చేసరికే ఫోటోగ్రాఫర్ గా నిలదొక్కుకుంది. ఎంతో పేరు సంపాదించింది.

ఇప్పుడు హార్ద్విక్ ఒక బిజీ ఫోటోగ్రాఫర్. ఆర్ట్ ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రకటనలకి ఫోటో షూట్లు, ప్రముఖ మాడల్స్ తో కలిసి పనిచేయడం, ఇలాంటివి అనేకం చేస్తూ నిత్యం తీరిక లేని జీవితం గడుపుతోంది. అలాగని తన ఈడు వాళ్లకి సంబంధం ఉండే పనులేవీ చేయదని కాదు. రూకీ అని అమెరికాలోని టీనేజ్ అమ్మాయిల కోసం ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో ప్రముఖ రచయితలే కాక అనేక టీనేజ్ పిల్లలు కూడా రచనలు చేస్తూ ఉంటారు. హార్డ్విక్ కూడా ఈ పత్రికలో తరుచుగా ఫోటోలు ప్రచురిస్తూ ఉంటుంది. తన ఈడులో పిల్లలు ఎలా ఉంటారో, ఇలాంటివి ఇష్టపడతారో, ఎలా ఆలోచిస్తారో - అవే తన ఫోటోలలో ప్రతిబింబించాలని ఆమె అభిప్రాయం. తన చుట్టూ పక్కల ఉండే పల్లె ప్రాంతం, తను చదివే పుస్తకాలు వంటి వాటి నుండి స్పూర్తి పొందుతానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. తనకి ఫోటోగ్రఫీ అంటే ప్రాణమనీ, తను ఇదే రంగంలో కొనసాగి ఇంకా ఎన్నో సాధించాలి అనుకుంటున్నా అని కూడా చెప్పింది. అన్నట్లు ఈ అమ్మాయికి మన భారతదేశం చాలా నచ్చిందట.

ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి ఫ్యాషన్ షూట్ చేయాలని కోరికట. ఒక ఇంటర్వ్యూ లో - "నీకు స్ఫూర్తి నిచ్చే స్టయిలు ఎవరిది?" అని అడిగితే "భారత దేశంలోని బంజారాలది" అని కూడా చెప్పింది!

ఇంత చిన్న వయసులో ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం గొప్పే అయినా - తనకి నచ్చిన అంశం గురించి ఆ అమ్మాయి బాగా కష్టపడి పనిచేసింది, చేస్తోంది అన్నది కూడా నిజమే! మనం అందరం కూడా మనకు నచ్చిన అంశాల మీద కష్టపడి పని చేద్దాం, సరేనా?