'కం' వచ్చే కొన్ని పదాలు రాసి పంపింది లక్ష్మి....

పాకం పైకం తిలకం బింకం టంకం వంటకం కుంకం సుంకం జాతకం
తూకం అమ్మకం పంపకం కలంకం భూటకం లోకం మీరు మరిన్ని రాసి పంపండి చూద్దాం!

దోమ పగ!

పెద్దదోమ: అదిగో ఆ ఎర్రచొక్కా వాడున్నాడే, వాడ్ని బాగా కుట్టిరా!
చిన్నదోమ: మనుషులందరి రక్తం ఒకటేగా, వాడినే ఎందుకు కుట్టాలి?
పెద్దదోమ: వాడు మన ప్రధాన శత్రువు. దోమతెరల్ని అమ్ముతున్నాడు మరి!

ప్రశ్న: వెంగళప్ప కండక్టరుకు నోటును చింపి ఇచ్చాడు. ఎందుకు?
జవాబు: కండక్టరు వెంగళప్పకు టికెట్టును చించి ఇచ్చాడు మరి...!

కంటి బాధ!

రవి: శీనూ నీ ఒక చెవికోస్తే ?
శీను: సరిగ్గా వినపడదు.
రవి: మరి రెండు చెవులూ కోస్తే?
శీను: సరిగ్గా కనపడదు.
రవి: ఎందుకలా?
శీను: కళ్లజోడు పెట్టుకోలేనుగా...!

ఫీజు బాధ!

డాక్టర్: మీ గుండె చాలా నీరసంగా ఉంది. కాబట్టి మీకు బాధ కలిగించే పనులేవీ చేయకండి.
రోగి: అలాగే డాక్టర్! ముందుగా మీ ఫీజ్ కట్టటం మానేస్తాను!

ఏదో ఓ నొప్పి!

టీచర్: రవీ, 2364ను 9తో భాగించి 5476ను కలిపితే ఏమొస్తుంది?
రవి: తలనొప్పి...!

వాచి!?

వేణు: ప్రమాదపు దెబ్బకి నా చేయి వాచిపోయింది.
వెంగళప్ప: ఆ వాచీ ఏ కంపెనీది?

సుశీల: వదినగారూ! ఒక చెంచా కాఫీపొడి, ఒక గ్లాసు పాలు, రెండు చెంచాలు చక్కెర అరువిస్తారా?
లక్ష్మీ: మీకు ఆ కొంచెం శ్రమా ఎందుకులెండి. కాఫీ నేనే చేసిస్తాను- తాగి వెళ్దురుగాని...!

తల్లి (కొడుకుతో): ఒరేయ్ ఈ గాజుగ్లాసును విరక్కొట్టింది నువ్వేనా?
కొడుకు: "లేదే అమ్మా! నా చేతిలోంచి జారి క్రిందపడి దానంతట అదే విరిగిపోయింది...!

తెలుగుబాల

సాధు సంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రహియించుచుండు
పుష్ప సౌరభంబు పొందదా దారంబు?
లలిత సుగుణజాల! తెలుగుబాల!

విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చందమామతోడ సరసమాడె
ఉత్తమాశ్రయమున ఉన్నత స్థితి గల్గు
లలిత సుగుణజాల! తెలుగుబాల!

భాస్కరుని మాట

ఊరక సజ్జనుండొ దిగియుండిన నైన దురాత్మకుండు ని-
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా
చీరెలు నూరు టంకములు చేసెడి వైనను బెట్టె నుండగా
జేరి చినింగి పోగొరుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా?

ముఖ్యమైన పదాలు

ఊరక=ఊరికే, సజ్జనుండు=మంచివాడు, ఒదిగి యుండుట=అణకువతో ఉండటం, రాత్మకుండు=చెడ్డవాడు, నిష్కారణం=అకారణంగా, టంకం=రూపాయి, చిమ్మట=కీచురాయి, పెట్టెలో వస్తువుల్ని కొరికి తినేసే కీటకం.

పెట్టెలోకి చేరి, కొరికి చిల్లులు పెట్టేసే చిమ్మట, 'ఆ చీర ఖరీదెంత' అని చూడదు. అట్లాగే, ఓర్వలేక అపకారం చేసే దుర్మార్గుడు 'మనం మంచివాళ్లమా, ఊరికే అణకువతో ఉన్నామా' అని చూడడు. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే!