శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించు- కోవడానికి తమ వాహనాలలో ఎంతో మంది వెళుతుంటారు. ఘాటు రోడ్డు ఎక్కే ముందు పెద్ద వేప చెట్టు వస్తుంది. వేప చెట్టు పక్కనే కొండమీదినుంచి సన్నని నీళ్ళ పాయ ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే "కనుమ గంగమ్మ" పేరుతో కొండ చరియ దిగువన ఓ విగ్రహం వెలిసింది. గంగమ్మ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తుంటాడు ఓ సాధువు, తన సహచర బృందంతో. శ్రీశైలం వచ్చే పోయే వాహనాల వాళ్ళు ఇంజన్ వేడిని తగ్గించు కోవడానికి కొంత సేపు అక్కడ ఆపి విశ్రాంతి తీసుకుని వెళ్తుంటారు.
హారతి పళ్ళెంలో పసుపు-కుంకుమ తెచ్చి, వాహనాల స్టీరింగ్ మీద బొట్టు పెట్టి యాత్రికులతో మాటామంతి కలుపుతాడు సాధువు.
ఆ రోజున కొత్తగా తెచ్చిన "ఇన్నోవా" వాహనం ఒకటి వచ్చి ఆగింది అక్కడ. భారీకాయం గల స్త్రీలు, పురుషులు దిగారు కారులోంచి. వారి ఆభరణాలను, దుస్తులను చూస్తే తెలుస్తున్నది- వాళ్ళు మంచి ధనవంతులు అని. కారు దిగగానే వాళ్ళు వెళ్ళి వేపచెట్టు కింద ఉన్న రాతికట్ట మీద కూర్చున్నారు.
సాధువు మాటలు కలిపాడు వాళ్లతో- "ఏ ఊరు బాబూ, మనది?"
"హైద్రాబాద్!" జవాబిచ్చాడు పెద్దాయన.
"చాలా దూరం నుండి వస్తున్నారే?" మళ్ళీ పలుకరించాడు సాధువు.
"అవును!" బదులిచ్చాడు పెద్దాయన.
"ఇక్కడ ఆగారు మీరు- ఇక నుండి అంతా శుభమే జరుగుతుంది. ఈ గంగమ్మ తల్లి చల్లని చూపులు మీ మీద పడ్డాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది" అన్నాడు సాధువు. "అమ్మవారి హారతి తీసుకొని వెళుదురు గాని రండి!" అని వాళ్ళను పిలుస్తూ.
అందరూ సాధువు వెంట నాలుగడుగులు వేసి గంగమ్మ తల్లి ముందు నిలబడ్డారు. ఆ తల్లి ముందు మట్టితో చేసిన కొత్త ప్రమిద ఉంది. దానిలో "వత్తిని" వేసాడు సాధువు. ఆపైన చెలమలోంచి నీళ్ళు తెచ్చి ప్రమిదలో పోసాడు.
"ఏంది స్వామీ! ప్రమిదలో నీళ్ళు పోశారు? నూనెకాని, నెయ్యికాని పోయాలి కదా? నీళ్లతో ప్రమిదలెలా వెలుగుతాయి?" అడిగాడు ఖద్దరు చొక్కాలోని పెద్దాయన, నవ్వుతూ.
"గంగమ్మ తల్లి మహిమ కలది నాయనా. ఈలాంటి మహిమను అందరికీ చూపించదు గంగమ్మ!"
జవాబిచ్చాడు సాధువు- "గంగాధర్! నీ జేబులో ఉన్న అగ్గిపెట్టెతో ఈ ప్రమిదను వెలిగించు!" అని జోడిస్తూ.
కారు యజమాని గంగాధర్ నివ్వెరపోయాడు.
"స్వామీ! నా పేరు తమరికి ఎలా తెలిసింది? నా జేబులో ఎక్కడో ఉన్న అగ్గిపెట్టె గురించి ఎలా కనుక్కున్నారు తమరు?" నేరుగా ప్రశ్నించాడు ఆశ్చర్యాన్ని ఆపుకోకుండా.
"నాదంటూ ఏమీ లేదు- అమ్మ నా చేత పలికిస్తుంది నాయనా!" అన్నాడు సాధువు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూండిపోయారు. "వెలిగించు, దీపం!" అనగానే భక్తి భావంతో దీపం వెలిగించాడు గంగాధర్.
నూనె బదులు నీళ్ళు పోసిన ప్రమిద దివ్యకాంతిలా వెలుగుతోంది..
"ఇక గంగమ్మ తల్లి నీడ నీమీద పడింది! నీవు మాత్రం అమ్మకు నీడగా ఉండాలి!పోయిరా" అన్నాడు సాధువు.
"అలాగే స్వామీ! నా వంతుగా ఏం చేయాలో ఆజ్ఞాపించండి- చేస్తాను" బదులిచ్చాడు గంగాద్రి.
"అమ్మవారికి ఆభరణాలంటే ప్రీతి. అందుకు నీవద్ద వున్న బంగారం ఇచ్చావంటే అమ్మవారికి ముక్కు పుడక, మంగళ సూత్రాలు చేయిస్తాను" అన్నాడు సాధువు. "సంశయించకండి, అనుమానించకుండా ఏది ఇవ్వబుద్ధయితే అదే ఇవ్వండి. సంశయిస్తే అమ్మకు కోపం వస్తుంది" చెప్పాడు సాధువు.
సాధువు చెప్పిన మాటలకు భయమేసింది గంగాధర్ భార్యకు. "ఏమండీ! ఎలాగూ వచ్చి ఆగాం- మీ చేతిలో ఉన్న "బ్రేస్‌లెట్" ఇవ్వండి! అమ్మవారికి!" అంది గంగాధర్ భార్య అన్నపూర్ణ, భయంతోటీ, భక్తితోటీ.
"అవునవును-అది కరెక్ట్" అన్నారు అందరూ. అయిష్టంగానే పదితులాలున్న బంగారు బ్రేస్‌లెట్‌ని సాధువుకు ఇచ్చేసి అక్కడ నుండి కదిలారు గంగాధర్ అండ్ ఫ్యామిలి.
వాళ్ళు అటు వెళ్ళాక, ఆ బంగారంతో అడవిలోకెళ్ళి, పది నిముషాల తరువాత తిరిగి వచ్చాడు సాధువు. వస్తూ వస్తూ తనతో పాటు ఓ గుడ్డసంచి తీసుకు వచ్చాడు. అందులో ఏదో వస్తువు వుంది. సాధువు ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు. గంగమ్మ ముందు కూర్చుని 'ఎవరు వస్తారా!'అని ఎదురు చూడటం మొదలు పెట్టాడతను.
అంతలోనే సాధువు పంట పండిస్తూ వచ్చాయి- రెండు నల్లని బొలెరో వాహనాలు. రెండూ వేపచెట్టు కింద ఆగాయి. బిలబిలమంటూ వాటిలోంచి దిగారు పిల్లలూ-పెద్దలు. అందరూ చెట్టుకింద ఉన్న అరుగు మీద కూర్చుని తాము తెచ్చుకున్న ఫలహారాలు తిన్నారు. వాళ్లలో ఒకావిడ మటుకు ఏమీ తినకుండా పడుకుని ఉన్నది. ఆమెనే నిశితంగా గమనించాడు సాధువు.
అటుపైన ఆ బృందంలోని వారితో మాటలు కలిపాడు- "నాయనా! అమ్మాయికి ఏమైంది? ఫలహారం తినకుండా పడుకుంది!" అడిగాడు.
"ఆరోగ్యం సరిగాలేదు స్వామీ!" బదులిచ్చింది అమ్మాయి తల్లి లలితాబాయి.
"ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి! గంగమ్మతల్లి 'బండారు' ఇస్తాను!" అన్నాడు సాధువు.
ఎవరూ మాట్లాడలేదు.
"అమ్మాయికి ఎవరో చేతబడి చేసారు. అందుకే ఏనుగులా వున్న అమ్మాయి -పీనుగులా అయ్యింది!" చెప్పాడు సాధువు.
అంతే, జీపుల్లోవచ్చిన పెద్దవాళ్లందరూ ఒక్క ఉదుటున లేచారు- "నిజం స్వామీ! అమ్మాయి చాలా బొద్దుగా ఉండేది. ఇప్పుడు ఇలా అయ్యింది" అన్నాడు అమ్మాయి తండ్రి ఆనంద్‌బాబు. "ఇది మాత్రం కరెక్టుగా చెప్పావు స్వామీ!" వంతపలికాడు అమ్మాయి బాబాయి 'వినోద్‌బాబు'.
అందరూ ఆ అమ్మాయిని తీసుకువచ్చి గంగమ్మ ముందు కూర్చోబెట్టారు. ప్రమిదలో నీళ్ళు పోసాడు సాధువు. ఆనంద్‌బాబు, వినోద్‌బాబు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు అర్థంకాక.
అంతలో అగ్గిపెట్టె తీసి దీపాన్ని వెలిగించాడు సాధువు. నీళ్ళతో దీపం వెలుగుతోంది. దాంతో అన్నదమ్ములిద్దరికీ గురి కుదిరింది. "సాధువు చెప్పేదంతా నిజమే" అనిపించిందిప్పుడు వాళ్లకు. లలితాబాయి, ఆనంద్‌బాబులు సాధువు కాళ్ళకు మొక్కుకున్నారు. "స్వామీ! నీవే మాకు దిక్కు. ఈ అమ్మాయికి పట్టిన పీడ విరగడ చెయ్యి!" అర్థించారు భార్యభర్తలిద్దరు.
"సరే, నేను చెప్పినట్లు చెయ్యండి" పలికాడు సాధువు. సరే అంటు తలూపారు అందరూ.
గంగమ్మ ముందు ముగ్గుపోశారు. మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టారు. మంత్రాలు చదవడం ప్రారంభించాడు సాధువు. సంచిలో నుండి పీచు వలచని టెంకాయ తీసాడు. "ఓం క్రీం భీం ఫట్" అని మంత్రాలు వల్లిస్తూ టెంకాయ మీద నీళ్ళు చల్లాడు సాధువు.
అంతే- "ఫట్" మని శబ్ధం చేస్తూ బాంబులా పేలిపోయింది టెంకాయ.
"చూశారా! పిశాచి వదిలి పోయింది. వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళండి" అన్నాడు సాధువు.
"మీ రుణం ఎలా తీర్చుకోము స్వామీ!" అడిగారు లలితబాయి ఆనంద్‌బాబు.
"అమ్మాయి పెట్టుకున్న నగలతో అమ్మవారిని అలంకరించి వెళ్ళండి. మీకు ఇక ఏ ఎదురూ ఉండదు" అన్నాడు సాధువు.
భక్తిభావంతో పరవశించిపోయారు వాళ్ళు. అమ్మాయి నగలను ఒలిచి గంగమ్మతల్లిని అలంకరించబోయారు- అంతలోనే ఘాట్ రోడ్డులో గస్తీ తురుగుతున్న S.I ఉత్తం రాథోడ్ జీపు అక్కడ ఆగింది. జీపులోంచి దిగిన S.I. ఆ బొలెరో వాహనాల గుంపును, సాధువును చూసి "ఏం జరుగుతోంది ఇక్కడ?" అని గద్దించి అడిగాడు.
నీళ్ళు నమిలాడు సాధువు. S.I పరిసరాలను గమనించి "క్షుద్రపూజ చేయించారా?" అని అడిగాడు ఆనంద్‌బాబును.
"అబ్బే! అలాంటిదేమీ లేదు సార్!" అంటూ కథ మొత్తం చెప్పాడు వినోద్‌బాబు.
"ముందు మీ నగలన్నీ వెనక్కి తీసుకోండి!తీసుకోండమ్మా!!" అంటూ చెప్పకొచ్చాడు S.I- "మీలాంటి వాళ్లను ఎందరినో మోసం చేసి వుంటాడు వీడు. వీడు చేసే మ్యాజిక్కులను నిజమని నమ్మారు మీరు. వీడు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసాడు. మీ నగల్ని మీరు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి-పోండి!"
అన్నారు S.Iగారు- "జీపు ఎక్కరా! స్టేషన్‌కి తీసుకెళ్ళి కుమ్మేస్తే నిజం కక్కుతావు!" అని సాధువునెక్కించి తన జీపును దౌడు తీయిస్తూ.
ఘాట్‌రోడ్డు దాటిన తరువాత 'ధాబా హోటల్' దగ్గర టీ త్రాగడానికి జీపు ఆపారు S.I రాధోడ్ గారు.
అక్కడే టీ తాగుతున్న గంగాథర్ అండ్ ఫ్యామిలీ S.I గారి వెనక నక్కి కూర్చొని ఉన్న సాధువును చూసి గుసగుసలు పోయారు. గంగాధర్ S.Iని సమీపించి "నమస్తే సార్! నాపేరు గంగాధర్. మాది హైదరాబాదు, శ్రీశైలం వెళుతున్నాము.." అని పరిచయం చేసుకున్నాడు.
"ఏమిటి విషయం?" అడిగారు S.I గారు.
"ఈ సాధువు.." అంటూ మధ్యలోనే ఆపేశాడు గంగాధర్.
"ఓహో! వీడా?! వీడు దారిన పోయే వాళ్ళను మాయలు, మంత్రాలు అంటూ మ్యాజిక్‌లు చేసి మోసం చేస్తుంటేనూ, నాలుగు తగిలిద్దామని తీసుకెళుతున్నాను. ఏమి? మిమ్మల్నీ వీడు బురిడీ కొట్టించారా? ఏమైనా బంగారం సమర్పించుకున్నారా వీడికి?" అడిగాడు ఉత్తం రాథోడ్, కరకుగా.
"క్షమించండి సార్! ఇతని చేతిలో పదితులాల బ్రేస్‌లెట్ పెట్టాను" అంటూ వినయంగా నిలబడ్డాడు గంగాధర్. "అదీ సంగతి! ఎలా బోల్తాపడ్డావో చెప్పు!" అడిగాడు S.I.
"నాపేరు పెట్టి పిలిచాడు సార్!"
"అదేం పెద్ద పజిల్ కాదే!? నీ కారు వెనుక అద్దంపైన 'గంగాధర్&సన్స్' అని రాసివుందిగా? చదివాడు కాబోలు!" అన్నాడు S.I.
"మరి నా జేబులో ఉన్న అగ్గిపెట్టెను ఎలా కనిపెట్ట గలిగాడు సార్?!"
"నీ నోట్లోంచి సిగరెట్లు తాగిన కంపు ఇప్పటికీ వస్తోంది. అది చాలు, నీ దగ్గర అగ్గిపెట్టె ఉన్నదని గ్రహించడానికి!" బదులిచ్చాడు S.I.
"నీళ్ళతో దీపం వెలిగించాడే, అది మహాత్యం కాదంటారా?" ఎదురు ప్రశ్నించాడు గంగాధర్.
"అదేనోయ్, మీ అజ్ఞానం- వీళ్ళ పెట్టుబడీనీ! ముందుగా కాటన్ వత్తులు కొన్నింటిని పాలలో మళ్ళీ మళ్ళీ నాన బెట్టి ఆరబెట్టాలి. అలాగ ఐదుమార్లు చేసి భద్రపరచుకోవాలి. అలా చేసి పెట్టుకున్న వత్తిని అవసరం అయినప్పుడు వెలిగిస్తే , నీళ్ళలో వేసినా సరే- కొంతసేపు వెలుగుతుంది. పాలలో వున్న కొవ్వు పదార్థాన్ని వత్తి పీల్చుకుంటుందిగదా, అందువల్ల అది వెలగగలదన్నమాట! అది సైన్సే! మహత్యం కాదు!" వివరించాడు S.I ఉత్తం రాథోడ్.
"సార్! పీచు వలవని టెంకాయ బాంబులా పగిలి పోతుందంట కదా? హోటల్‌కు వచ్చిన యాత్రికులు మాట్లాడుకుంటుంటే విన్నాను- అది మహత్యం కాదా?" అడిగాడు టీ కొట్టు నడిపే నాణుసింగ్.
"చూడు, సింగ్‌భాయ్! పీచు వలవని టెంకాయను తీసుకోవాలి. సున్నపు బట్టీ నుండి తెచ్చిన ఊరబొయ్యని కొత్త సున్నం ఉంటుందే, దానిలో ఈ కొబ్బరికాయని వారం రోజులు నానబెట్టి, ఆ తరువాత ఆరబెట్టి, భద్రంగా దాచుకోవాలి. అవసరమయినప్పుడు మామూలు నీళ్ళు తీసుకుని, మంత్రించినట్లు నటించి నీళ్ళు చల్లాలి.
అప్పుడు అది బాంబులా శబ్ధం చేస్తూ పగిలిపోతుంది. టెంకాయను సున్నంలో ఊరబెట్టడం వలన అది పొడి సున్నాన్ని గ్రహించి ఉంటుంది. ఆ పొడి సున్నం మీద చల్లని నీళ్ళు పడగానే రసాయనిక చర్య జరిగి, టెంకాయ పగిలిపోతుంది. -ఇది కూడా సైన్సే" చెప్పాడు ఉత్తం రాథోడ్.
"సార్! ఇంకొక అనుమానం-" అడిగాడు టీకొట్టు నాణుసింగ్, S.Iతో వినయంగా- "ఇవన్నీ మీకెలా తెలుసు, సార్?" అడిగాడు.
"జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాలను కాలేజీలలో ప్రదర్శిస్తున్నప్పుడు అతిథిగా నన్ను ఆహ్వానిస్తారు. అప్పుడు చూశాను ఇవన్నీను" అన్నాడు S.I టీ గ్లాస్ ఖాళీ చేస్తూ. "రేయ్! ఆ "బ్రేస్‌లెట్" ఎక్కడ దాచావురా?" అనగానే బొడ్డులో నుండి బ్రేస్‌లెట్ తీసి ఇచ్చాడు దొంగ సాధువు.
"మూఢనమ్మకాలు మానుకుని, మీ దానగుణాన్ని పేదల మీద, అనాధల మీద చూపండి -కాస్త పుణ్యం దక్కుతుంది" అంటూ రయ్యిన జీపును దౌడు తీయించాడు ఉత్తం రాథోడ్, దొంగ సాధువుని వెంట బెట్టుకొని.