మాట తీరును గురించి ఓ చక్కని కథ ఉంది-
సుబ్బారాయుడికి నాలుగెకరాల భూమి ఉంది. అతనికి ఇద్దరు కొడుకులు- రాము, సోము.
సుబ్బారాయుడు ముసలివాడయ్యాడు. కొడుకులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు గానీ, పట్నంలో పనిచేసుకుంటూఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు.
సుబ్బారాయుడికి ఉన్న బెంగల్లా ఆ భూమి గురించే. భూమిని తను కొడుకులకు ఇచ్చినా, వాళ్ళు దాన్ని సాకలేక ఏదో ఒక ధరకు తెగనమ్ముతారేమో, డబ్బుల్ని పంచుకొని తింటారేమో- అని అతని భయం.
కొడుకులిద్దరిలోనూ కనీసం ఒకరన్నా "నాన్నా, పొలం పని నేను చూస్తాను; మేం దాన్ని అమ్మం, నమ్ము" అనాలని అతని కోరిక.
అంతలోనే అనుకోకుండా పండక్కి ఇంటికొచ్చారు రాము-సోము. అదే రోజున పొలం దున్నేందుకు మనుషులూ వచ్చారు.
సుబ్బారాయుడు చిన్నకొడుకు సోముని పిలిచి చెప్పాడు- "ఎలాగూ వచ్చావు- కాస్త పొలం దున్నించు నాయనా, కూలోళ్ళు వచ్చారు" అని. చిన్నోడు సరేనని బయటికెళ్ళి, కూలోళ్ళతో "పొండి, పోయి త్వరత్వరగా పొలం దున్నేసి రండి" అన్నాడు. వెంటనే వెనక్కి తిరిగి వచ్చి "పంపించాను నాన్నగారూ" అని చెప్పి పోయాడు కూడాను.
కొంతసేపటికి పెద్దవాడు రాము కనబడ్డాడు సుబ్బారాయుడికి. "ఎలాగూ వచ్చారు- కొంచెం పొలం దున్నించి పొండి నాయనా. ఇందాక తమ్ముడికీ అదే చెప్పాను- కూలోళ్ళు ఇంకా పనికి ఒంగినట్లు లేరు" అన్నాడాయన రాముతో.
రాము బయటికి వెళ్ళి చూశాడు. కూలోళ్ళు ఇంకా అక్కడే తారట్లాడుతూ కనబడ్డారు. "ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నారా?! పదండి, పోయి త్వరగా పొలం దున్ని వచ్చేద్దాం" అన్నాడు రాము, తనూ చెప్పులు వేసుకుంటూ.
కూలోళ్ళు రామువెంట కదిలారు.
పెద్దకొడుకు చేతుల్లోతన భూమి భద్రంగా ఉంటుందని సుబ్బారాయుడికి నమ్మకం చిక్కింది. పొలాన్ని రాము నిర్వహించేటట్లూ, ఆదాయంలో రెండు వంతులు తను ఉంచుకొని, మూడో వంతును సోముకు ఇచ్చేటట్లూ ప్రత్రాలు రాయించాడు తృప్తిగా.
పనులు చక్కగా జరగాలంటే అందర్నీ కలుపుకుపోవటం అవసరం. అది జరగాలంటే మన మాట తీరు దానికి అనుగుణంగా ఉండాలి. "పో, పోయి పని చెయ్యి" అనటానికీ, "రా, కలిసి పనిచేద్దాం" అనటానికీ చాలా వ్యత్యాసం ఉంది. మరి, ఈ సంవత్సరం అంతా మన మాట తీరులో ఏం లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిచేసుకుందాం- సరేనా?
నూతన ఆంగ్ల సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం