హంసరాజుతో చక్రవాక మంత్రి "ప్రభూ! సమయం అయింది- చక్కని ఈ చిలుక తమరి జవాబుకోసం వేచి ఉన్నది. ఇక దానిని ఇక్కడ నిలువనీయరాదు. తమరి మనసులోని నిశ్చయాన్ని తెలియబరచి, దాన్ని సత్వరం సాగనంపేది" అన్నది.

అప్పుడు హంసరాజు చిలుకవైపుకు తిరిగి- "ఓరీ! అరుణముఖా!నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా విను.

నువ్వు వెళ్ళి నీ రాజు ఎదుట నిలబడగానే నోరు దాచుకొనక, నేను పలికిన పలుకులను నావిగా వినిపించు- "నీకు రాజ్య మదం బాగా తలకెక్కి కాబోలు, మా దేశపునీటిపైన మనసు పడ్డావు. హిరణ్య గర్భుడి ప్రాణాలు నిలచి ఉండగా ఈ రాజ్యాన్ని ఏలటం అనేది, నీకే ఏల- మూడు కన్నులున్న దొర- ఆ శివుడికి కూడా వీలుకాదు.

మిణుగురు పురుగు సూర్యకాంతిపటలాన్ని దాటుకొని పోనెంచినట్లు, నువ్వు నా బలశౌర్యాలకు ఎదురు నిలచి పోరాడ-నెంచుతున్నట్లున్నది. ఒక్క చిత్ర వర్ణుడేం ఖర్మ, అట్లాంటి వాళ్ళు కోటిమంది ఒక్కసారిగా దండెత్తి వచ్చినప్పటికీ ప్రళయ కాలపు సూర్యుడి మాదిరి శత్రుపక్షపు బలాన్నీ శౌర్యాన్నీ హరిస్తూ వెలుగొందే హిరణ్య గర్భుడిని యుద్ధంలో తేరిపారనైనా చూడలేరు. నువ్వు నిజంగా పౌరుషశాలివే అయితే యుద్ధం చేసి మానుండి మా నేలను లాక్కొనటమే నీ పౌరుషానికి గుర్తింపు. అప్పుడు గదా, నీ మగటిమిని మేం మెచ్చుకునేది! ఎప్పుడైనా నీలాంటివాళ్ళ మాటలు కోటలు దాటుతుంటై గానీ కాళ్ళు గడప దాటవు.

పనికిరాని బీరపు మాటలు కట్టిపెట్టు. శూరుడివై యుద్ధానికి రా. నీకోసం మృత్యువు ఇక్కడ ఎదురు-చూస్తున్నది.

లేకపోతే నువ్వు మరొక పని చెయ్యచ్చు- నీ పిల్లతనపు మాటలను ప్రక్కనపెట్టి, 'తప్పయిపోయింది-క్షమించండి' అను. నేను నిన్ను వదిలి పెడతాను" అని గట్టిగా చెప్పింది.

చెప్పి, "మేం నీతో అన్న ఈ మాటలన్నిటినీ మీ దొరకు చెప్పినవి చెప్పినట్లు చెప్పాలి సుమా!" అని ఆ చిలుకకు కానుకలు ఇచ్చి, మంచి పళ్ళతో‌భోజనం పెట్టించి పంపింది.

ఆ చిలుక కూడా హంసరాజు వద్ద సెలవు తీసుకొని, "మా రాజు చెప్పమన్న మాటలు చెప్పాను తప్ప, మీవద్ద నేను ఏమీ ఎక్కువగా మాట్లాడలేదు. అయినా నేను ఎక్కడైనా మాటలు జారి ఉంటే క్షమించండి. నా వల్ల మీకు చాలా శ్రమ కలిగింది. పోయి వస్తాను. నాకు ఇంకా ఏమైనా చెప్పేది ఉంటే తప్పక చెప్పగలరు" అని మర్యాదగా మాట్లాడి వెనక్కి తిరిగి పోయింది.

అట్లా బయలుదేరిన చిలుక ఆగకుండా ఎగిరి తమ దేశానికి పోయి, అలసట తీరేటట్లు కొంత విశ్రాంతి తీసుకొని, వెంటనే తమ రాజుగారి ఆస్థానానికి వెళ్ళింది. అది వెళ్ళే సరికి నెమలి రాజు చిత్రవర్ణుడు కొలువు దీరి ఉన్నాడు. చిలుక వెళ్ళి ప్రణామం చెయ్యగానే నెమలి విప్పారిన ముఖంతో దాన్ని ఆహ్వానిస్తూ "ఓ అరుణముఖా! కర్పూర ద్వీపానికి పోయి ఏ ఆపదల పాలయ్యావో అని కంగారు పడుతున్నాము. క్షేమంగా తిరిగి వచ్చావు. 'కదలని స్తంభం మాదిరి, నువ్వు ఏమైనా అక్కడే బందీవి అయ్యావేమో!'అని తామరాకు నీటికోసం తల్లడిల్లినట్లు ప్రతిక్షణం నీ రాకకోసమే ఎదురుచూస్తూ, నిముషం ఒక యుగంగా గడుపుతున్నాం.

ఈ రోజున నిన్ను నిన్నుగా చూశాకగానీ‌ మా మనసు శాంతించలేదు. మా కళ్ళు చల్లబడ్డాయి. చెప్పు. అక్కడి వార్తా విశేషాలు ఏమిటి? ఏదీ‌ విడవకుండా అన్నిటినీ వివరంగా చెప్పు" అన్నది.

అప్పుడు చిలుక "ఆ రోజున తమరి ఆజ్ఞను అనుసరించి హిరణ్యగర్భుని వద్దకు వెళ్ళి, మాట్లాడి, అతను వెనక్కి పంపగా ఇప్పుడే వచ్చాను. వాళ్ళుండే ఆ దీవి చాలా అందంగా ఉంది. దాని అందాన్ని ఏమని వర్ణించను? మాటలకందని అందం ఆ దీవి సొంతం. ఎక్కడ చూసినా అప్సరసలతో కూడుకొని మనసును చల్లబరచే భూలోక స్వర్గం ఏదైనా ఉందంటే అది ఆ కర్పూర ద్వీపమే. హిరణ్యగర్భుడు కూడా ఆత్మ రక్షణలో ఏలాంటి లోపమూ రానివ్వడు- తన శత్రువులందరినీ వేయి కళ్లతో పరిశీ-లిస్తుంటాడు. ఆ ద్వీపంలో ఉన్న పక్షులన్నిటికీ అసామాన్యమైన స్వదేశాభిమానం ఉన్నది. అవన్నీ తమ రాజును ఎక్కడలేని అనురాగంతో కొలుస్తున్నాయి.

నాలాంటివాళ్ళు ఆ ద్వీపపు గొప్పతనంలో వందోవంతును కూడా వివరించలేరు- 'తెలిసినంత వరకు చెబుతాను' అన్నప్పటికీ, అట్లా చెప్పేందుకు కూడా చాలా రోజులు పడుతుంది.

అదంతా అటు ఉండనివ్వండి. నేను వెళ్ళేసరికి హిరణ్యగర్భుడు తమ మంత్రితో సమావేశంలో‌ఉన్నాడట. ద్వారపాలకులకు నా పేరు చెప్పి, 'వచ్చానని విన్నవించండి' అని ఎన్ని విధాలుగా చెప్పినా 'మంచిది- చెబుతాం ఉండు' అంటూ ఉన్నారు తప్పిస్తే, ఎవ్వరూ కాలు కదల్పలేదు. తరువాత కొంత సేపటికి వాళ్లలో కొందరు ఒక రెండు సార్లు లోనికి వెళ్ళి వచ్చి, 'ఇంకా అవ్వలేదు- ఇది సరైన సమయం కాదు- కొంచెం ఆగు' అంటూ ఆలస్యం చేశారు. ఆ తర్వాత మరికొంత సేపటికి వాళ్లలో ఒకడు లోపలినుండి వచ్చి 'ప్రభువులవారి సెలవైంది-రండి' అని నన్ను పిలుచుకొని పోయాడు.

ఆ సమయానికి ఆ పక్షిరాజు కొలువుతీరి ఉన్నాడు. తనను నిరంతరం సేవించే పక్షి సముదాయాలమధ్య పరివేష్టుడై, వారి సేవలను అందుకుంటూ, మరొక ప్రక్కన అంతరంగికులు చేసే మనవులను వింటూ ఉన్నాడు.

లోనికి వెళ్ళిన నన్ను చూసి తగిన ఆసనంలో కూర్చోబెట్టి, నా రాకకు కారణం అడిగాడు.."అంటూ తను వెళ్ళినది మొదలు హిరణ్యగర్భుడు చెప్పమన్న మాటలన్నిటినీ చెప్పింది. అక్కడ జరిగిన సంగతులన్నిటినీ ఒక క్రమంలో వివరంగా చెప్పి, ఇంకా ఇట్లా అన్నది- "అతను నన్ను ఇక్కడికి పంపేటప్పుడు చాలా పెద్దరికంతో వ్యవహరించాడు. నన్ను ఒక వంకన మర్యాదగా చూస్తూనే మరొక వంకన 'మీ రాజును యుద్ధానికి తీసుకురా' అని తొందరపెట్టాడు. అతను నిజంగానే శత్రువులకు అసాధ్యుడు.

అతని కొలువులో‌ఉన్న సైనికులు కూడా‌యుద్ధ కౌశలం ఉన్నవారే. అయినా మన లోటును తీర్చి గెలుపు ఇచ్చేందుకు మన మేఘవర్ణుడు అక్కడే ఉన్నాడు. సందర్భానికి తగినట్లు, రాజుగారి మనసుకు సంతోషం కలిగించేది ఎలాగో అలా ప్రవర్తిస్తూ అతని ఆదరణకు పాత్రుడై ఉన్నాడు మన మేఘ వర్ణుడు. అక్కడ అతని పేరు నీలవర్ణుడు. నీలవర్ణుడు హంసరాజు నమ్మినబంట్లలో ఒకడుగా ఉన్నాడు. ఇక భయపడేందుకేమున్నది? దేవునిమీద భారంవేసి, 'ధర్మమే గెలుస్తుంది' అని యుద్ధానికి సన్నద్ధం అవ్వండి" అన్నది.

దాని మాటలు విని, చిత్రవర్ణుడు కొలువునంతటినీ కలయ చూస్తూ "విన్నారా, మీ చెవులారా? హిరణ్యగర్భుడి పొగరు మాటల చందం గమనించారా, మీరంతా? తానట, 'తప్పయిపోయింది-క్షమించండి' అంటే నన్ను వదిలేస్తాడట! అతనన్న ఆ మాట ఒక్కటే ములుకులా నా‌ హృదయానికి గుచ్చుకొని సలుపుతున్నది.

మదించిన ఏనుగుల కుంభస్థలాలను బ్రద్దలు కొట్టటంవల్ల గట్టిపడిన గోళ్లతో అలరారే కొదమ సింహం ఏనాడైనా పచ్చగడ్డిని మేస్తుందా? ఈ చిత్రవర్ణుడు వేరొకరికి తలఒగ్గి, 'తమరి చిత్తం' అని కైమోడ్చటం కలలోనైనా సాధ్యమా? ఇక యుద్ధంకంటే ఉత్తమమైన పని వేరేదేదీ నా మనసుకు తట్టటం లేదు. ఇతరుల రాజ్యాలను జయించాలన్న కోరికకంటే, అతను నన్ను అన్న మాటల కరకుదనమే నన్ను ఎక్కువగా యుద్ధానికి రెచ్చగొడుతున్నది. నా పేరు వినబడితే పారిపోతున్న పాము కూడా‌ కదిలేందుకు భయపడుతుందే, అట్లాంటి నాతో జగడం తలకెత్తుకుంటాడా, ఆ తెల్ల పిట్టల నాయకుడు ? ఎవరో వాడు-వీడు అనుకున్నట్లున్నాడు.

చివరి రోజులు సమీపించి, పనికిరాని, వ్యర్థపు ప్రేలాపనలు పలుకుతున్నాడు.

శత్రుత్వాన్ని తుదముట్టించని వాళ్ల జన్మ దేనికి, వృధాగా? తనంతటి శత్రువు ఒక ప్రక్కన జీవించి ఉన్నాడంటే, పౌరుషం ఉన్నవాడికి ఆ పగ తెగేవరకూ కంటికి నిద్రరాదు, నోటికి ఏదీ రుచించదు, ఇతర సుఖాలేవీ మనసుకు పట్టవు. ఇక చెప్పపనిలేదు. మనం ఇప్పుడే జైత్ర యాత్రకు (గెలిచేందుకు చేసే యాత్ర)బయలు దేరి, శత్రువును హరించటమే పని. మీవంటి శూరుల సహాయ సంపత్తులు నావెంట ఉండగా , ఈ హిరణ్యగర్భుడు ఒక్కడు నాకెంతటివాడు? మూడు లోకాలూ ఒక్కటై నామీదికి దండెత్తి వచ్చినా భయపడేది లేదు... (...అని ఇంకా ఏమన్నదో తర్వాత చూద్దాం..)