అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద పంతులు ఉండేవాడు. గుళ్ళో పూజలు చేస్తూ బాగానే బ్రతికేవాడు ఆయన. ఆ పంతులికి ఒక్కడే కొడుకు. వాడు చాలా తెలివితక్కువవాడు. 'వాడిని ఏం చేద్దాం' అని ఆలోచించీ ఆలోచించీ ముసలివాడైపోయాడు పంతులు. చివరికి, 'పెళ్ళిచేసేస్తే సరి- వాడి భార్య వాడిని ఎలాగో ఒకలాగా మార్చుకొంటుందిలే'అనుకొని, పేదింటి అమ్మాయిని ఒకామెను తెచ్చి వెంగళప్పకిచ్చి పెళ్ళి చేశాడు.
కొన్నిరోజులతరువాత ఆయన చనిపోయాడు కూడా.
కొన్నిరోజులుగడిచే సరికి భార్యకు అర్థమైంది- తన భర్త మంచివాడే, కానీ అమాయకుడు, బొత్తిగా చదువురాని వాడు. నమ్మి ఎవరైనా ఉద్యోగం ఇస్తే తప్ప, తనంతట తాను బ్రతకలేడతను. కానీ ఏమంత్రమూ రాని వాడికి గుడినెవరు అప్పచెబుతారు? అందుకని ఆమె భర్తతో "ఏమండీ, మామయ్య ఇక లేరు. ఆయనకు ఉన్నంత పాండిత్యం మీరూ సంపాదించుకోవాలి. కాబట్టి మీరు ప్రయత్నించి కొన్ని మంత్రాలు నేర్చుకోండి ముందు" అన్నది.
చిన్నపంతులికి అట్లు అంటే చాలా ఇష్టం. 'సరే నేను చదువుకుంటాను-కానీ నాకు అట్లుపోసి ఇవ్వాలి ముందు' అన్నాడు అతను. భార్య వెంటనే అట్లుపోసి ఇచ్చింది. ఆ అట్లను తీసుకొని వెంగళప్ప మంత్రాలు నేర్చుకొనేందుకు బయలుదేరాడు.
ఆ ఊరిలోనే ఉన్న దొంగలు కొందరు అతను అలా వెళ్తుండటం చూశారు. "ఒరే, చిన్న పంతులు ఇవాళ్ళ ఎక్కడికో వెళ్తున్నాడు. పెద్ద పంతులు బాగా డబ్బు, బంగారం సంపాదించి పెట్టాడుగదా, వాటిని దొంగిలించాలంటే ఇవాళ్ల రాత్రే సరైన సమయం" అనుకున్నారు వాళ్ళు.
అయితే ఆ సంగతి తెలీదుకదా, చిన్న పంతులు అలా వెళ్తున్నాడు. అంతలో కొన్ని తాటిచెట్లుకనబడ్డాయతనికి. అవి అతన్ని ఆపి 'పంతులూ పంతులూ ఎక్కడికి వెళ్తున్నావ్?' అని అడిగాయి.
'నేను చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అందుకు మా ఆవిడ అట్లు పోసి ఇచ్చింది' అన్నాడు పంతులు.
తాటిచెట్లు చాలా సంతోషపడ్డాయి. 'అవునా, నువ్వు చదువు నేర్చుకునేందుకు వెళ్తున్నావా? అయితే మేమొక మంత్రం చెబుతాము. మాకొక అట్టు ఇస్తావా?' అన్నాయి. పంతులు అమాయకుడు కదా, 'సరే' అన్నాడు.
అప్పుడు తాటిచెట్లు "తాటి చెట్లవలె నిలుచున్నావహే "అని ఒక మంత్రం చెప్పి పంపాయి. పంతులు తను అన్న మాట ప్రకారం వాటికి ఒక అట్టు ఇచ్చి 'తాటి చెట్ల వలె నిలుచున్నావహే'అనుకుంటూ బయలుదేరతాడు.
మళ్ళీ కొంత దూరం వెళ్ళే సరికి కొన్ని గువ్వలు కనిపించాయి అతనికి. 'పంతులూ పంతులూ ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగాయి గువ్వలు. 'నేను చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అందుకు నా భార్య అట్లు పోసి ఇచ్చింది. తాటి చెట్లు ఒకమంత్రం చెబితే వాటికొక అట్టు ఇచ్చాను' అన్నాడు పంతులు. 'అయితే మేమూ ఒక మంత్రం చెబుతాము. మాకు ఒక అట్టు ఇస్తావా?' అడిగాయి గువ్వలు. 'సరే, చెప్పండి. ఎవరేది చెప్పినా నేర్చుకుంటాను' అన్నాడు పంతులు. 'గువ్వల వోలె కూర్చునున్నారహే' అని ఓ మంత్రం చెప్పాయి గువ్వలు. పంతులు సంతోషపడి వాటికొక అట్టు ఇచ్చి,'గువ్వల వోలె ఒదిగి కూర్చునున్నారహే' అనుకుంటూ బయలుదేరాడు.
మళ్ళీ కొంతదూరం వెళ్ళే సరికి కొన్ని ఎలుకలు ఎదురయ్యాయి అతనికి. ఆ ఎలుకలు 'పంతులూ పంతులూ ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగాయి. అప్పుడు పంతులు 'చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అందుకు నాభార్య అట్లుపోసి ఇచ్చింది. తాటిచెట్లుకనబడి ఒక మంత్రం చెబితే వాటికొక అట్టు ఇచ్చాను.
తరువాతగువ్వలుకనిపించి ఒక మంత్రం చెబితే వాటికొక అట్టు ఇచ్చాను' అన్నాడు చిన్న పంతులు. 'అయితే మేమూ ఒక మంత్రం చెబుతాము. మాకు కూడా ఒక అట్టు ఇస్తావా?' అడిగాయి ఎలుకలు. పంతులు 'సరే, ఎవరు చెబితే ఏముంది చెప్పండి' అన్నాడు పంతులు. అప్పుడవి "ఎలుకల వోలె పాకుచున్నారహే " అని ఓ మంత్రం చెప్పాయి. పంతులు దాన్నీ నేర్చుకొని వాటికి ఒక అట్టు ఇచ్చి బయలుదేరాడు.
అట్లా వెళ్తుంటే కొన్ని జింకలు కనిపించాయతనికి. ఆ లేళ్ళు 'పంతులూ పంతులూ ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగాయి అతన్ని. 'నేనుచదువు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అందుకు నాభార్య అట్లు పోసి ఇచ్చింది.
దారిలో తాటి చెట్లు, ఎలుకలూ, గువ్వలు ఒక్కొక్క మంత్రం చెబితే వాటికి ఒక్కొక్క అట్టు ఇచ్చాను' అన్నాడు చిన్న పంతులు. అప్పుడు ఆ జింకలు 'మేమూ ఒక మంత్రం చెబుతాము. మాకొక అట్టు ఇవ్వు' అన్నాయి. 'సరే చెప్పండి'అన్నాడు చిన్న పంతులు. "లేళ్ళ వలె గెంతుచున్నారహే " అని ఓ మంత్రం చెప్పాయి జింకలు.
పంతులు వాటికీ ఒక అట్టు ఇచ్చేసాడు. మిగిలిన ఒక అట్టునూ తను తినేసాడు.
ఆ సరికి సాయంత్రం అయిపోయింది. ఇక 'చీకటిపడిపోతుందేమో' అని వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరాడు పంతులు. అతను ఇల్లు చేరుకునే సరికి నిజంగానే చీకటి పడిపోయింది. పంతులు భార్య వాకిట్లోనే ఎదురైంది- 'ఏమండీ, కొంచెం చదువు ఏమైనా నేర్చుకున్నారా? అట్లు తిన్నారా?' అని అడిగింది.
పంతులు చాలా సంతోషంగా నవ్వుతూ, 'ఓ, నేను మంచి మంచి మంత్రాలు నేర్చుకున్నాను. నువ్వు మంచం మీద కూర్చో, నీకు వినిపిస్తాను' అన్నాడు.
భార్య కొంచెం మొహమాటంగా మంచం మీద కూర్చునే సమయానికి, ఇంటి వెనక నీడల్లో చేరి నిలబడ్డారు దొంగలు.
"తాటిచెట్లు వలె నిలుచున్నారహే " అని మొదటి మంత్రాన్నే పదిసార్లు గట్టిగా వల్లించటం మొదలెట్టాడు పంతులు.
పంతులు ఊరికెళ్ళాడు అనుకున్న దొంగలు బిత్తర పోయారు. 'ఇదేంటీ, పంతులుకి ఎలా తెలిసింది, మనం నిలబడి ఉన్నామని?' అని ఆ దొంగలు గబుక్కున గుబురులో కూర్చున్నారు.
అంతలో పంతులు రెండో మంత్రం మొదలు పెట్టాడు-"గువ్వల వోలె ఒదిగి కూర్చునున్నారహే " అని.
అక్కడ దొంగలు మళ్లీ వణికి పోయారు- 'ఇదేంటి, ఇలా చెప్పేస్తున్నాడు? మనం కనిపిస్తున్నామేమో. పదండి వేరే వైపుకు పోదాం' అని దొంగలు దూరంగా పాకటం మొదలు పెట్టారు. అంతలో పంతులు మూడో మంత్రం మొదలు పెట్టాడు- "ఎలుకల వోలె పాకుతున్నారహే" అని.
అది విన్న దొంగలు గబుక్కున లేచి నిలబడి, వెనక్కి తిరిగి పరుగెత్తటం మొదలు పెట్టారు- అంతలో పంతులు నాలుగో మంత్రం వల్లించసాగాడు- "లేళ్ల వలె గెంతుచున్నారహే" అని.
పంతులుఇంట్లోంచి పారిపోయిన దొంగలకి తమ సంగతి పంతులికి ఎలా తెలిసిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. 'పంతులు ఏవో మంత్రాలు నేర్చుకున్నాడు' అని గురి కుదిరిపోయింది వాళ్లకు. వాళ్ళూ ఊళ్ళో వాళ్ళేగా? వాళ్ల ద్వారా ఊరి జనానికి పంతులు గొప్పదనం ఒక్కసారిగా తెలిసిపోయింది; గురి కుదిరిపోయింది. ఉదయం అయ్యేసరికి ఊరి జనాలంతా పంతులు గారి ఇంటికి వచ్చేశారు 'పంతులుగారూ! మీరే గుడికి పూజారిగా ఉండాలి' అంటూ. 'బెట్టు చేయకండి, ఒప్పుకోండి' అని భార్య సౌంజ్ఞ చేసే సరికి, పంతులు 'సరే' అని ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆలస్యం చేయకుండా మంచి మంచి మంత్రాలన్నీ త్వరత్వరగా నేర్చేసుకొని, ఆ గుడికి పంతులుగా కుదురుకున్నాడు హాయిగా!