చీమెందుకు గొప్పదో-
ఏనుగెప్పుడు తీసికట్టో-
విడమరచే చిట్టి కథ
వింటారా, పిల్లలూ!
చిట్టడవికి ఇటుప్రక్క
కొండవాగు కటుపక్క
ఉందండోయ్ చీమలపుట్ట
ఆ దరినే ఏనుగయ్య కుటుంబం!
ఏనుగయ్య అడుగులకు
నుజ్జునుజ్జు కాకుండా
తమ పుట్టను-తమ పుంతను
కాచుకొనెడి చీమలు
ఏనుగుల బారినుండి
చెట్లనూ కాపాడుతాయి!
వేరునుండి కాండానికి
కాండం నుంచి కొమ్మలకు
కొమ్మలకు, రెమ్మలకు
చీమలు బారులు తీరాయి
ఏనుగుల దారిని మళ్లించాయి!

ఏనుగయ్యకు ఎప్పటినుండో
చీమలంటె చీదర
పాకితే గగుర్పాటు
తొండానికి చీమలను
చేరనీక జాగ్రత్తగ
మసలుతాడు ఏనుగయ్య!
రకరకాలు ఖాద్యాలు నోటకరిచి
గింజలను, పుప్పొళ్ళను సేకరించి
ఎక్కడెక్కడో తిరిగి తిరిగి
పుట్టలో గదుల్లో పదిల పరుచు
ముందు చూపు చీమలది!
క్షణం తీరిక లేక
శ్రమిస్తోన్న చీమలను
ఏనుగయ్య చూసాడు
హేళనగా నవ్వాడు
చిరాకుగా చీదాడు
మధ్యాహ్నం చెట్టునీడ
చల్లదనం ఈయగా
పుట్టప్రక్క ఎడంగా
గరికమీద మేను వాల్చి కులాసాగ-
చీమల నాయకుణ్ణి పిలిచాడు
ఏనుగయ్య చిన్నచూపు చూసాడు
రెక్క లు విరుచుకు క్షణక్షణం
ఎందుకింత యాతనంటు
ఏవగింపు చూపాడు!
తనలాగ ఒళ్ళు పెంచితే
చింతలే ఉండవంటు
అల్పమైన చీమలని
అలుసు చేసి వాగాడు!
ఎగతాళి చేసాడు
హేళనగా నవ్వాడు
చీమలన్ని ఎగిరి పడగ
పక్క బెదురు ప్రక్కనుంచి
తొండంతో ఊదాడు!
చీమల బారు చెదిరిపోయింది
కూడిన కూడు జారిపోయింది
చీమలన్నీ కుమిలాయి
నాయకుడొచ్చి ఓదార్చాడు
కష్టం చేసే కండ చీమలను
ఒక్కటి చేసి కూడదీశాడు
దండు కట్టి ఎదురు నిలిచి
హెచ్చరికలు చేసాడు!
నిద్రమత్తు న మదమెక్కి
ఏనుగయ్య నవ్వాడు
ఎకసెక్కం చేశాడు
చిన్ని చీమల గొప్పదనం తెలియక
హీనంగా ఇకిలించాడు!
కండ చీమ నాయకుడు
గొంతు పెంచిచెప్పాడు-
"పడుకున్న ఏనుగుకన్న
పనిచేసే చీమే మిన్న"
పని సంస్కృతి సమిష్టి తత్వం
తను చీమల బలమంటూ
ఏనుగయ్య తొండానికి
చీమకుట్టు చాలంది!
మంటలొచ్చి భగ్గుమంటే
చీమలమంతా గుండ్రంగా
వుండ చుట్టుకొని ద్రొల్లుకుంటూ
గండాన్ని గడుస్తామని
అందరి కోసం కొంతమందిమి
ఆత్మత్యాగం తమ సొత్తని
చీమల జీవన సంస్కృతిలో
ఔన్నత్యాన్ని చాటిచెప్పాడు
నీరు పొంగి పొరలుతుంటే
పొరలు పొరలుగా చీమలమంతా
నీటి అలలపై తేలుకొంటూ
ఒడ్డుకు చేరే తెలివి తమదని
అందరికోసం కొంతమందిమి
ఆత్మత్యాగం తమ సొత్తని
చీమల జీవనశైలిని తెలపగ
ఏనుగయ్య కొండంతగా
అవాక్కయ్యాడు! బిక్కపోయాడు!

నీఅంత నీవని
నా అంత నేనని
గౌరవాన్ని ఇచ్చినపుడె
గౌరవం వస్తుందని
హితవు పలుక చూచాడు
కండ చీమ నాయకుడు
పుట్ట లోని చీమలన్ని
చిటికలోన కూడబలికి
ఏనుగంతగా గుమికూడె
చీమల ఏనుగు రూపొందె!
సంఘటిత శక్తిరూపాన్ని
చీమల్లో చూసినంత
ఏనుగయ్య చలించాడు
తన తప్పును గుర్తించాడు
లోలోపల గుండెజారి
బిక్కు బిక్కుమన్నాడు!

పుట్టముందు చెరుకు గడను
బహుమతిగా పెట్టాడు
చీమలతో నేస్తాన్ని
చిరునవ్వుతొ కలిపాడు!
చీమలన్ని గొంతుకలిపి
శ్రమగీతం పాడారు
ఏనుగయ్య పిల్లలతో
చిందులేసి ఆడారు
తేనె తీపి స్నేహాన్ని
విందులుగా చేసుకొని
ముచ్చటగా మురిసారు
ఒద్దికగా మెలిగారు!
ఎక్కువ తక్కువ తేడాలొదిలి
నేలన అందరు ఒక్కటని
నినాదాలతో మారు మ్రోగి
కొత్తబాటలే వేశారు
ఒక్క పాటనే పాడారు!