విదిషా రాజ్యాన్ని పరిపాలించే జగన్నాధ మహారాజు ప్రజలను కన్నబిడ్డలకంటే మిన్నగా చూసుకునేవాడు.
ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది.
ప్రజలందరూ సంతోషంగా ఉన్నా, రాజు మాత్రం ఎప్పుడూ విచారంగా ఉండేవాడు: కారణం, తన నలుగురు కొడుకులూ చదువు సంధ్యలు లేకుండా తిరగటం. ఒక్కరికీ పొట్ట పొడిస్తే అక్షరం ముక్కరాదు. 'రేపు తనకు వృద్ధాప్యం వచ్చాక, ఇలాంటి అయోగ్యులకు రాజ్యభారం ఎలా అప్పగించేది? ప్రజల గతేంటి?' అని రాజుగారి బాధ. 'వీళ్ళకు ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పించగలరా? వీళ్ళను వివేక వంతులుగా తీర్చిదిద్దలేరా?' అని కనిపించిన ప్రతి పండితుడినీ అడిగేవాడు రాజు. అయినా రాజకుమారుల దుందుడుకుదనం, మంకు పట్టు చూసాక, సరేనని ఏ పండితుడూ ముందుకు రాలేదు. ఎవ్వరూ సాహసించ లేదు.
ఇట్లా చాలా కాలం గడిచాక, 'నేను ప్రయత్నిస్తాను' అని ముందుకొచ్చాడు, విద్యాధరుడు అనే గురువుగారొకరు. 'రాజకుమారులకు విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులను చేస్తాను' అని వాగ్దానం చేసాడాయన.
ఆ సరికి రాజకుమారులు రోజూ పావురాలు ఎగుర వేస్తూ ఆడుకుంటున్నారు. ప్రతిరోజూ వారికి అదే వ్యాపకం. విద్యాధరుడు వారి వద్దకు వెళ్ళి తనుకూడా పావురాలు ఎగురవేయడం ప్రారంభించాడు.
త్వరలోనే వారికంటే బాగా ఎగరవేసి, వారి మన్నన పొందాడాయన. అలా వారితో స్నేహం చేసి వారితో కలిసిపోయాడు. ఒకరోజున ఆయన "మీకు నేనొక పావురాల పోటీ పెడతాను. మీరు సిద్ధమేనా?" అని అడిగారు వాళ్లను.
"ఎట్లాంటి పోటీకైనా సరే, మేము సిద్ధం. చెప్పండి ఏం పోటీ?" అన్నారు రాజకుమారులు ఉత్సాహంగా.
"ఇదిగో తెలుగు భాషలో అక్షరాలు ఇలా ఉంటాయి. ఇది 'అ' ఇది 'ఆ', ఇ, ఈ, ఉ...........ఇదిగో, ఇది 'ఱ'.
ఇట్లా ఉన్న మొత్తం అక్షరాలనూ ఒక్కొక్కదాన్నీ ఒక్కో అట్టమీద వ్రాసి పావురాల కాళ్ళకు కట్టి ఎగురవేశాను.
ఇప్పుడు మీలో 'క' అక్షరం గల పావురాన్ని తెచ్చి చూపిన వాళ్లకు ఓ చక్కని బహుమతినిస్తాను" అన్నాడు విద్యాధరుడు.
ఇంకేముంది? రాకుమారులు పావురాల వేటలో పడ్డారు- అందరూ ఉత్సాహంగా 'క'పావురాన్ని వెతకడానికి బయలుదేరారు. కనబడ్డ ప్రతి పావురాన్నీ పట్టుకొని దానికి కట్టి వున్న అక్షరాన్ని పరిశీలించటం మొదలు పెట్టారు. అట్లా త్వరలోనే ఏ అక్షరం ఏమిటో, దాన్ని ఎలా చదువుతారో తెలుసుకున్నారు.
ఇంక ఆ తర్వాత ఒక్కొక్క రోజునా గురువుగారు వాళ్ళకు ఒక్కోరకం పోటీ పెట్టారు. మొదట అక్షరాలు, ఆ తరువాత పదాలు, వాక్యాలు, వ్యాకరణం, నీతిసూక్తులు....ఇట్లా అన్నీ అందించారు వాళ్లకు.
రాజకుమారుల్లో నేర్చుకోవాలనే ఉత్సాహం కలిగింది.
ఇక ఆపైన విద్యాధరుడి పని సులభమైంది. క్రమంగా అందరూ మంచి విద్యార్థులైపోయారు. సకలశాస్త్రాలు, వినయ విధేయతలు, మర్యాద-మన్ననలు నేర్చుకొని గొప్ప రాజనీతిజ్ఞులయ్యారు.