హాయ్ ఫ్రెండ్స్! నేనే, మీ అమ్మానాన్నలకు ఎంతో అవసరమైన దానిని. మీక్కూడా నేనెంతో అవసరమే! నేను లేకుండా మీబైకులు,స్కూటర్లు నడవ్వు . నన్ను గుర్తుపట్టారా? ఆ...నేనే పెట్రోల్ని!
నేను అసలు ఎట్లా పుట్టానో తెలుసా, మీకెవరికైనా? సరే, పరవాలేదు-నేనే చెబుతాను- "నేను ఒక 'శిలాజ' ఇంధనాన్ని- అంటే ఏంటో తెలుసా? ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్న అడవులు అగ్ని పర్వతాల వల్ల, భూకంపాలవల్ల మన భూమిలోతుల్లో కూరుకుపోయి ఉండిపోయాయి. ఎన్నో రాళ్ళు రప్పలు వాటిమీద పడి, అధిక పీడనాన్ని కలిగించాయి. ఇక అక్కడ వాటికి సరిపడ ప్రాణవాయువూ లభించలేదు- అట్లా అవి అన్నీ పాక్షికంగానే కాలాయి- అట్లా శిలాజ ఇంధనాలు నేల లోతుల్లో తయారయ్యాయి.
అట్లా నేను నదుల ఒడ్డుల్లోను, సముద్రం అట్టడుగుల్లోనూ తయారయి ఉండటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. అట్లా నేల లోతుల్లో దాక్కొని ఉన్న నన్ను, అష్టకష్టాలూ పడి వెలికి తీసుకువస్తున్నారు మీ మానవులు.
అయితేనేమి, నా నిలవలు తగ్గిపోతున్నాయి! అందుకని నన్ను త్రవ్వి తీసేందుకయ్యే ఖర్చూ రాను రానూ పెరిగిపోతున్నది. ఇప్పుడు నన్ను కొనడానికి కూడా భయపడుతున్నారు మీరు. ఎందుకు అనుకుంటున్నారా ? నా నిలవలు తగ్గినకొద్దీ నా ధరలు అంతగా పెరిగి పోతున్నాయి మరి! ఆగండి- ముందు మీకు ఓ కథ చెబుతాను-
అనగనగా ఓ గ్రామంలో రామయ్య అనే పేద వ్యవసాయదారుడు ఒకడు ఉండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు. అతని తల్లి కూడా వారింట్లోనే ఉండేది. ఈ కుటుంబాన్ని పోషించటానికి సరిపోయేంత సంపాదన లేదు రామయ్యకు. ఎప్పటికప్పుడు, ఏవో అప్పులు సొప్పులు చేసుకొని బ్రతుకు ఈడుస్తున్నారు వాళ్ళు.
ఒక రోజు రామయ్య పొలం పనికి పోయాడు. అకస్మాత్తుగా ఆ పొలపు మూలలనుండి ఓ దేవత వచ్చి రామయ్యకెదురుగా నిలబడి, ఏం కావాలో కోరుకోమంది. "ఒక్కో కోరిక తీర్చినందుకూ ఒక్కో రూపాయి ఇవ్వాలి. కోరిక ఈ ఒక్కరోజుకూ పరిమితం అయి ఉండాలి" అని నియమం విధించింది. రామయ్య ఎంతో సంతోషించాడు. తనకు మంచి బట్టలు, తినడానికి తిండి కావాలని కోరుకున్నాడు. దేవతకు రెండు రూపాయలు ఇచ్చాడు. రామయ్య ఇచ్చిన ఆ రెండు రూపాయల్నీ తీసుకుని రెండు కోరికలూ తీర్చింది దేవత. ఆరోజు రామయ్య ఇంటికి వెళ్లగానే తన దగ్గరున్న వస్తువులన్నీ చూపించి, ఇంట్లో వాళ్ళకు జరిగిందంతా చెప్పాడు.
ఇట్లా రెండు రోజులు గడిచేటప్పటికి, సంగతి పొరుగింటి సీతయ్య చెవుల్లో పడింది. సీతయ్య, రామయ్యకు మిత్రుడు. అతను రామయ్యను కలిసి, తననూ ఆ దేవతకు పరిచయం చేయమన్నాడు. 'నాదేం పోతుంది?' అని రామయ్య సీతయ్యను వెంటబెట్టుకెళ్ళి ఆ దేవతకు పరిచయం చేసాడు. ఇద్దరూ కోరికకు ఒక రూపాయి చొప్పున కావలసినన్ని కోరికలు తీర్చుకున్నారు.
అట్లా రాను రాను దేవత వెంట పడే జనాలు ఎక్కువయ్యారు. చివరికి ఆమె రోజూ వెయ్యి మందికి- రెండు వేల మందికి కోరికలు తీర్చవలసి వచ్చింది.
ఇక ఆ దేవత సహించలేక పోయింది. కోరికకు ధరను పెంచేసింది. అయినా రామయ్య, ఇతర జనాలు అందరూ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మరీ వచ్చేవాళ్ళు. ప్రతీదీ ఆ రోజే అయిపోగొట్టాలి గదా! చివరికి ఆ దేవత మనుషులంటే విసిగిపోయింది. ఇక ఇప్పుడు ఎవ్వరికీ కనబడడం లేదు. కోరికలు తీర్చటం ఆపేసింది. ఇప్పుడు రామయ్య గతి నిజంగా ఘోరమే అయ్యింది. తినటానికి తిండి లేదు; అప్పు తీర్చడానికి డబ్బు లేదు. దేవత అన్నీ ఇస్తుందనే నమ్మకంతో పొలాన్ని కూడా గాలికి వదిలేసాడు- పని అలవాటు తప్పి పోయింది.
చూసారా? దురాశా దు:ఖానికి చేటు అంటే ఇదే!
ఇప్పుడు నా విషయంలో కూడా ఇదే జరుగబోతోంది! నన్ను వాడుకొనే వాహనాలు ఎక్కువ అయిపోతున్నాయి. నన్ను దిగుమతి చేసుకొనే దేశాలూ ఎక్కువ అవుతున్నాయి. నన్ను త్రవ్వి తీసేందుకు శ్రమ ఎక్కువవుతున్నది. కనుక నా ధరలూ పెరుగుతున్నాయి. ఇది గనక ఇలాగే కొనసాగితే, నేను శాశ్వతంగా మాయమవ్వటం ఖాయం. అప్పుడు ఇక ఎంత డబ్బు కట్టినా నన్ను కొనడం మీ తరం కాదు!
కాబట్టి నన్ను రక్షించుకోండి! వాహనాల ఉపయోగాన్ని తగ్గించండి. వాటి నుండి వచ్చే కాలుష్యాన్ని నాశనం చేయండి. అప్పుడు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను. మరి మీరు జాగ్రత్త! మా భూమి తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అసలే అనేక రోగాలతో మా అమ్మ బాధపడుతోంది. నన్ను వాడుకోండి, కానీ మితి మీరి కాదు! అర్థమైంది కదూ, ఉంటానిక! బై!