ఎప్పటిలాగే ఆ రోజు కూడా పిల్లలంతా బిలబిలమంటూ తాతయ్య చుట్టూ చేరి, కథ చెప్పమని అడిగారు. తాతయ్య మెల్లగా గొంతుసవరించుకున్నాడు. "అబ్బా! వినండర్రా, గోలచేయకండి మరి" అంటూమొదలు పెట్టాడు.
దసరా నవరాత్రుల సమయం. ఊరంతా సందడిగా ఉంది. అందరి మొహాల్లో ఆనందం. అయితే ఊరికి ఒక చివరన నివసించే గంగయ్య మాత్రం దిగాలుగా ఉన్నాడు. అతనికి ఒక మనుమడు ఉన్నాడు-చంద్రం. ఆ పిల్లాడి అమ్మానాన్నలు మొన్నటి వరదల్లో కొట్టుకుపోయారు.
పండగరోజుల్లో ఆ పిల్లవాడిని చూసుకొని విచార పడుతున్నాడు గంగయ్య. 'తనా వయస్సు పైబడినవాడు- ఈ వయస్సులో వీడినెట్లా సాకాలి?' అని ఆవేదన చెందుతున్నాడు.
గంగయ్య వయసులో ఉన్నప్పుడు మేస్త్రీ పని చేసేవాడు. ఆ రోజుల్లో ఇళ్ళు కట్టాలంటే 'ఎవర్ని పిలవాలి' అన్న ప్రశ్నే ఉండేది కాదు- ఊళ్ళో ఏ ఇల్లు కట్టాలన్నా గంగయ్య మేస్త్రీనే. మేస్త్రీ పనిలో గంగయ్య బాగా సంపాదించేవాడు. అయితే ఏనాడూ ఒక్క పైసా కూడబెట్టిన పాపాన పోలేదు- బీడీలలోను, సిగిరెట్లలోను, పేకాటలోను, సారాయిలోను ఆ డబ్బు మొత్తాన్నీ తగలేసేవాడు. కాలం గడచేకొద్దీ కొత్త మేస్త్రీలు పుట్టుకొచ్చారు.
ప్రమాదంలో పైనుండి క్రింద పడ్డ గంగయ్య కుంటివాడయ్యాడు. క్రమేణా అతన్ని పనికి పిలిచేవాళ్ళు తగ్గిపోయారు. అందరికీ ఇళ్ళు కట్టించిన గంగయ్యకు ఇల్లే కాదు; తినేందుకు తిండీ కరువైంది. అప్పటికే హాస్టలులో ఉండి చదువుకుంటున్న కొడుకు అంది వస్తాడనుకున్నాడు గంగయ్య. వాడు నిలదొక్కుకున్నట్లే నిలదొక్కుకున్నాడు- ఇప్పుడు ఇదిగో, ఈ పిల్లవాడిని తనమీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి భవిష్యత్తును తలచుకొని ముసలి గంగయ్య కుమిలిపోతున్నాడు.
భైరవాపురంలోనే రామయ్య-సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్ననాటి నుంచీ ఏ పనైనా కలిసి చేసుకొనేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు, స్థితిమంతులయ్యారు. జీవితంలోని ఆటుపోట్లన్నీ ఎదుర్కొని ఉన్నారు. పదిమందికి పనికొచ్చే పనులు చెయ్యటమంటే ఇద్దరికీ ఇష్టం. దసరా పండుగ రోజున ఘనంగా దేవీ పూజ జరిపి ఊరంతటినీ పిలిచి విందు చేయాలని అనుకుంటున్నారు ఇద్దరూ.
అదాటుగా అటు పోతున్న సోమయ్యకు కనబడ్డాడు గంగయ్య. సోమయ్య మొదటి ఇంటిని కట్టింది గంగయ్యే. "ఏం గంగయ్యా?! ఎట్లా ఉన్నావు? కాలికి దెబ్బ తగిలాక పని తగ్గించుకున్నట్లుందే? అస్సలు కనబడటం లేదు. ఈ పిల్లాడెవరు? నీ కొడుకు ఏం చేస్తున్నాడు?" పలకరించాడు సోమయ్య.
గంగయ్య కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. "నాదేముంది, ఎలాగో ఒకలాగా బ్రతికేస్తాను. ఈ చంద్రం గురించి ఆలోచిస్తేనే, దిగులు వేస్తోంది" అన్నాడు తన పరిస్థితిని వివరించి.
గంగయ్య కథ సోమయ్యను ఆలోచనలో పడేసింది. 'భగవంతుడి పేరిట తనూ, రామయ్యా చేసే ధర్మకార్యాలు చాలా ఉన్నై. కానీ తోటి మనిషికి నేరుగా సాయపడే పనులు ఎందుకు చేపట్టకూడదు తాము? గంగయ్యలాంటి ముసలివాళ్లకి, చంద్రం లాంటి పిల్లలకీ పనికి వచ్చేట్లు ఏదైనా చేయగలిగితే బాగుండు గదా?' అనుకున్నాడు.
వెళ్లి రామయ్యకు, తమ కుటుంబాలలోని వాళ్లకు విషయం చెప్పాడు. "నిజమే, ఇన్నాళ్ళూ దేవుడి పేరిట మనం చాలా మంచిపనులు చేశాం. ఇప్పుడు మనం కష్టాలలో ఉన్నవాళ్లకు నేరుగా పనికివచ్చేట్లు ఏమైనా చెయ్యాలి" అన్నాడు రామయ్య. "అవునండీ, దసరా తర్వాత ఊరంతటికీ ఒక రోజు విందు చేసే బదులు, ఆ డబ్బుతో గంగయ్యకు, చంద్రానికీ ఇద్దరికీ ఉపాధిమార్గం చూపచ్చు" అన్నది సోమయ్య భార్య. వాళ్ల పిల్లలకీ ఆ ఆలోచన నచ్చింది.
మరునాడే రామయ్య-సోమయ్య ఇద్దరూ గంగయ్య దగ్గరికి వెళ్ళారు. అతన్ని, చంద్రాన్ని తమ వెంట పిలుచుకొని వచ్చారు. గంగయ్యకు తాళ్ళు పేనటం వచ్చు. "మేం ఇద్దరం ఇప్పుడు తాళ్ళ వ్యాపారంలోకి దిగుదామనుకుంటున్నాం గంగయ్యా, నువ్వు మాకు తాళ్ళు పేని ఇవ్వాలి. నీకు మేం నెలకు ఇంత అని ఇస్తుంటాము, అట్లాగే చంద్రానికి చదువూ చెప్పిస్తాం- అయితే ఒక్కటే షరతు-నువ్వు తాగుడుకు, పేకాటకు దూరంగా ఉండాలి" అన్నారు రామయ్య సోమయ్యలు. "నేను అవి మానేసి చాలా కాలం అయ్యిందయ్యా, తాళ్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని పేనిస్తాను-దానిదేముంది" అన్నాడు గంగయ్య ఉత్సాహంగా.
విజయదశమినాటికి గంగయ్య పేనిన తాళ్ళు, తలుగుల అమ్మకాలు మొదలు పెట్టారు రామయ్య-సోమయ్య. గంగయ్యకు ఇప్పుడు ప్రతివారమూ 'ఇంత' అని ఆదాయం వస్తున్నది. చంద్రయ్య బడికి పోయి చదువుకోవటం మొదలుపెట్టాడు. సహజంగా చురుకైన పిల్లవాడేమో, ఒక నెలలోగా వాడు ఉపాధ్యాయులందరికీ ప్రియ శిష్యుడు అయిపోయాడు. రామయ్య-సోమయ్యలు వాళ్లమీద పెట్టిన ఖర్చుకి, గంగయ్య తయారు చేసే తాళ్ళ విలువకు మొదట్లో ఏమాత్రం పొంతన ఉండేది కాదు- కానీ ఇరు కుటుంబాలకూ తెలుసు-'ఇది ఒక సామాజిక కార్యం. ఇందులో ఉన్నదంతా లాభమే- నష్టం అన్న ప్రసక్తే ఉండదు. ఈ పని ద్వారా ముసలి గంగయ్యకు కాలక్షేపం, చిన్నోడు చంద్రానికి విద్యాబుద్ధులు- లభిస్తాయి. దానికోసం కొంత డబ్బు, కొంత సమయం వెచ్చిస్తున్నాం మనం' అని.
అయితే మరి రెండేళ్లలో ఈ పనీ విస్తరించింది. ఇప్పుడు రామయ్య చంద్రయ్య కుటుంబాల నీడన ఒక వృద్ధాశ్రమం, ఒక హాస్టలు నడుస్తున్నాయి. రామయ్య-సోమయ్యలేకాక, అనేకమంది సహాయం అందిస్తున్నారు వాటికి. వృద్ధాశ్రమంలో గంగయ్యతోబాటు చాలామంది ముసలివాళ్ళు ఉన్నారు. ముసలి- వాళ్ళు తమకు చేతనైన పనులు చేస్తున్నారు. హాస్టలులో ఉన్న పిల్లలంతా వాళ్ల శక్తి కొద్దీ చదువుతున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు.
చంద్రయ్య పెద్దయ్యాక, అతనే ఆ సంస్థను నడిపించటం మొదలుపెట్టాడు. తను పుట్టి- పెరిగిన ఊరికి, తనను ఆదరించిన వారికి మంచి పేరు తెచ్చేట్లు పని చేశాడు. వాళ్ల ఊరు ఈనాడు ఒక ఆదర్శ గ్రామం .
"కథ విన్నారుగా, మీరు కూడా చంద్రయ్య లాగా ఆదర్శవంతులు కావాలి మరి!" అని తాత కథ ముగించాడు.
పిల్లలంతా ఉత్సాహంగా కథ విన్నారు.
సురేష్ ఇంకా ఏదో అడగబోతుంటే "పదండర్రా, ఇప్పుడు పోయి నేను చెప్పిన ఈ కథ గురించి బాగా ఆలోచిస్తూ పడుకోండి" అని లేచాడు తాతయ్య.