"వచ్చే సోమవారం మన బడికి కొత్తపల్లి కథల పుస్తకాల వాళ్ళు వస్తారు. పిల్లల చేత కథలు రాయిస్తారు. బాగున్న వాటిని కొత్తపల్లి పుస్తకంలో వేస్తారు. అందరూ చక్కని కథలు రాయటానికి తయారుకండి" అని హెడ్మాస్టరుగారు స్కూలు అసెంబ్లీలో ప్రకటించారు. అది వింటూనే పిల్లలందరూ ఎంత ఆనందపడ్డారో!
కొత్తపల్లికోసం ఈసారి ఒక మంచి కథ రాసి ఇవ్వాలని ఉంది రమేష్‌కు. వారం రోజులుగా ఆలోచిస్తున్నాడు, కథ కోసం. చాలా ఐడియాలు వచ్చాయి; కానీ దేనికీ మంచి ముగింపు రావటం లేదు. కధల నడక కూడా సరిగా ఉన్నట్లు లేదు. సోమవారం కథారచన కార్యక్రమం మొదలయ్యేటప్పటికి కూడా రమేష్ మనసులో కథ తయారు కాలేదు. మిగిలిన పిల్లలందరూ బాగా తయారై వచ్చినట్లుంది.. కొత్తపల్లి వాళ్ళు వచ్చారు. కథలు రాయడంలో మెళకువలు చెప్పారు కొన్ని. పిల్లలతో కలిసి కూర్చొని అప్పటికప్పుడు కొన్ని కథలు సృష్టించారు. తరువాత టీచర్లు పిల్లలందరికీ తెల్ల కాగితాలు ఇచ్చి కథలు రాయమన్నారు. అందరూ హుషారుగా రాయడం మొదలు పెట్టారు..
కానీ రమేష్ కు ఒక్క కథ కూడా మనసులోకి రావడం లేదు. చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు. బాగా ఆలోచిస్తే తప్పకుండా ఒక మంచి కథ దొరుకుతుంది...గట్టి నమ్మకంతో ప్రయత్నిస్తున్నాడు. టీచర్లు ఒకరి తరువాత ఒకరు అడుగుతున్నారు - "ఏం, నువ్వింకా మొదలు పెట్టనే లేదేం?" అంటున్నారు. "మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నాను సార్, కథ రెడీ అవుతానే రాసేస్తాను సార్" అని బదులిస్తున్నాడు..
సమయం గడచిపోతోంది..పిల్లలంతా కథలు రాసేసి టీచర్లకు ఇచ్చేస్తున్నారు. "ఇచ్చేసిన వాళ్ళు ఇళ్ళకు వెళ్ళి పోవచ్చు" అన్నారు హెడ్మాస్టరుగారు. "కథ రాయక పోయినా ఫర్వాలేదులే, నువ్వు ఖాళీ కాగితం ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు" అని చెప్పారు టీచర్లంతా, రమేషుకు. "లేదు సార్, నేను తప్పకుండా ఒక మంచి కథ రాసిన తర్వాతనే ఇంటికి పోతాను సార్" అని బదులిచ్చాడు రమేష్.
"కానీ మంచి ఐడియా ఏదీ, తట్టటమే లేదేం?" బడి మూసేసే టైమయింది. పిల్లలందరూ వెళ్ళి పోయారు. చాలా మంది టీచర్లు కూడా వెళ్ళిపోయారు.
"కొత్తపల్లివాళ్ళు రేపు ప్రొద్దున కూడా వస్తారు- నువ్వు రేపు రాద్దువులే, ప్రస్తుతానికి ఇంటికెళ్ళు" అని టీచర్లు, హెడ్మాస్టరు గారు ఎన్ని విధాలుగా చెప్పినా రమేష్ పట్టువదల్లేదు. "సార్, నేను కథ రాసిన తర్వాతనే ఇంటికి పోతాను. నాకొక మంచి ఐడియా వస్తా ఉంది. దాన్ని సరిగ్గా ముగించాలి సార్. చివర్లో ఇరుక్కు పోయింది. దాని చిక్కు తీస్తానే రాసేస్తాను సార్" అని పట్టు పట్టాడు.
ఇక లాభం లేదనుకొని, "సరేలే, మేం ఇంటికి వెళ్తున్నాం. నువ్వు కథ పూర్తి చేసి, ఆ కాగితాల్ని నా ఆఫీసు రూము కిటికీ గుండా లోపల పడేసి ఇంటికి పో, జాగ్రత్త మరి!" అని చెప్పి హెడ్మాస్టరుగారు, టీచర్లు తమ ఇళ్ళకు వెళ్ళి పోయారు.
అందరూ ఇంటికి వెళ్ళిపోయినా, రమేష్ మాత్రం అట్టా-పేపరు ఒళ్ళో పెట్టుకొని కథ కోసం అలోచిస్తూనే ఉన్నాడు- ఎంత ఆలోచించినా మనసుకు నచ్చేట్టు ఒక్క కథా రావడం లేదు.
చీకటి పడుతోంది. రమేష్ గట్టివాడు. అతనికి చీకటంటే ఏమీ భయం లేదు. గ్రౌండులో అలాగే కూర్చున్నాడు. ఇంతలో వర్షపు చినుకులు మొదలయ్యాయి.. అయినా వాడు కదల్లేదు. ఉరుములు, మెరుపులు. వర్షం వేగం పుంజుకుంటోంది. రమేష్ లేచి హెడ్మాస్టరుగారి గది ముందు వసారాలోకి మారాడు. ఇప్పుడు వాడికి మొండితనం ఎక్కువయింది. "..చూద్దాం, మంచి కథ రాయడానికి ఎంత సేపు ఆలోచించాలో" అని అలాగే కూర్చున్నాడు.
ఇంతలో "ఘల్, ఘల్, ఘల్..." అని శబ్దం వినపడింది.
"..ఎక్కడినుంచి వస్తోందది?"
అదేదో తనవైపే వస్తున్నట్లు ఉంది.. నిదానంగా శబ్దం ఎక్కువవుతోంది..
ఇప్పుడు రమేష్‌కి కొంచెం కొంచెంగా భయం పుడుతోంది.. "దయ్యమేమో..! అయినా దెయ్యాలు, భూతాలు ఉండేది కథల్లోనే కదా?! అవి నిజంగా ఉండవు" అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు.
"ఘల్..ఘల్..ఘల్.." -శబ్దం మరింత దగ్గరకు వచ్చినట్లయింది.
చిమ్మ చీకటి! ఏమీ కనిపించడం లేదు! అప్పుడప్పుడు మెరుపులు! మెరుపుల వెలుగులో కూడా ఏమీ కనిపించడం లేదు. ఆగకుండా "ఘల్..ఘల్.." శబ్దం, అప్పుడప్పుడు ఉరుములు. వర్షం కురుస్తూనే ఉంది. నీళ్ళ జల్లు కొంచెం కొంచెంగా తనమీద పడుతూనే ఉన్నది! అంతలో- ఆశ్చర్యం!! ఉన్నట్టుండి రమేష్ చేతిలోని పెన్ను కాగితం మీద రాయటం మొదలు పెట్టింది! అప్రయత్నంగా రాసేస్తున్నది చెయ్యి! 'ఎవరో తన చెయ్యి పట్టుకొని పేపరు మీద రాయిస్తున్నారా' అన్నట్లుంది. మొదట్లో వాడికి భయం వేసింది. కానీ భయపడి ఏం ప్రయోజనం..?
కొంతసేపట్లోనే రమేష్‌కి ఇదంతా భలే గమ్మత్తుగా అనిపించసాగింది. అతని చెయ్యి రాసుకుంటూ పోతున్నది..ఒక పూర్తి కాగితం రాయడం అయిపోయింది..ఎలా తిరిగిందో మరి, కాగితం వెనక్కి తిరిగింది.. తను ఇప్పుడు ఆ కాగితం వెనకాల రాస్తున్నాడు..ఆ కాగితం అయిపోతూనే ఇంకో కాగితం..రమేషుకు ఇదంతా భలే తమాషాగా ఉంది. చెయ్యి రాస్తూనే ఉంది..ఏదో చక్కని కథ తయారౌతున్నట్లుంది..
"నాన్నా, రమేషూ, లేరా, స్కూలు టైమయిందిరా, తొందరగా నిద్రలేవరా" అని అమ్మ గట్టిగా అరవడంతో నిద్ర లేచాడు రమేష్. "ఓహో! ఇదంతా కలా!?" అని ఒక్కసారిగా విచారం వేసింది. "అయితేనేం, దీన్నే నేను కథగా మారుస్తాను!" అని తన నోట్ బుక్ తీసి గబ గబా రాయడం మొదలు పెట్టాడు.
అమ్మ సమయం గుర్తు చేసేసరికి తొందరగా స్నానం చేసి వచ్చి, మళ్ళీ రాసాడు. బస్సుకోసం ఎదురు చూస్తూ కొంత రాసాడు. బస్సులో కూడా కొంచెం రాసాడు. స్కూలు అసెంబ్లీ అయిపోగానే ఇంకొంచెం రాసి, కథను చక్కగా ముగించాడు. ఆ కాగితాలను హెడ్మాస్టరుగారి టేబిలు మీద పెట్టి, తన క్లాసు రూముకు పరిగెత్తాడు.
మరుసటి రోజు అసెంబ్లీలో, "రమేష్ ఒక చక్కని కథ రాసాడు, దాన్ని కొత్తపల్లికి పంపుతున్నాను, వాళ్ళు తప్పకుండా దాన్ని కొత్తపల్లిలో వేస్తారని అనుకుంటున్నాను" అని హెడ్మాస్టరుగారు చెప్పారు. రమేష్ ఎంత ఆనందించాడో!