పూర్వం ఒకప్పుడు కోసల దేశాన్ని విశాలుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ఏడుగురు కొడుకులు. రాజుకు, రాణికి వాళ్లంటే ప్రాణం. అయితే తమకు ఒక్క కూతురుకూడా లేదని కొంత అసంతృప్తి ఉండేది రాణీ గారికి.
ఇలా ఉండగా ఏడుగురు కొడుకులూ ఒకరోజున రాజ్యానికి సరిహద్దులలో ఉన్న అడవికి వేటకని వెళ్ళారు. సాయంత్రం అయింది... చీకటి పడింది. అయినా వాళ్ళు నగరానికి తిరిగి రాలేదు. ఆ రాత్రి వాళ్ల కోసం అందరూ ఎదురు చూశారు. ఇక తట్టుకోలేక, వేకువఝామున్నే తన కుమారులను వెతకడానికి మంచి గుర్రం ఎక్కి స్వయంగా బయలుదేరాడు విశాలుడు.
పిల్లలను వెతుకుతూ ఆరోజు సాయంత్రం వరకూ ఆగకుండా అడవుల్లో ప్రయాణించాడు అతను. అడవి మధ్యలో అకస్మాత్తుగా అతనికి ఎదురు వచ్చిందొక అవ్వ! నిర్జనమైన మహారణ్యంలో భయంలేకుండా తిరుగుతున్న ఆ ముసలమ్మను చూసి రాజు ఆశ్చర్యంతో "ఎవరు అవ్వా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? మా కుమారులు ఏడుగురు, నిన్న అనగా ఈ అడవిలోకి వచ్చారు. వాళ్ళేమైనా కనబడ్డారా, నీకు?" అని అడిగాడు.
"రాజా! నేను నీకు సహాయం చేయాలనే వచ్చాను. నీ కుమారులు నీకు తప్పకుండా దొరుకుతారు. ఇదిగో! ఇది మాట్లాడే చిలుక. ప్రయాణంలో నీకు విసుగు కలగకుండా కబుర్లు చెప్తుంది. అంతేగాక నీకు ప్రమాదం జరగబోతుందనుకుంటే నిన్ను తన ముక్కుతో పొడిచి మరీ హెచ్చరిస్తుంది" అని చెప్పి చిలుకను రాజుకు ఇచ్చింది అవ్వ. విశాలుడు ఆమెకి నమస్కరించి గుర్రం ఎక్కుతుండగా - "ఉండు రాజా! తొందరపడకు. ఇకనుండీ నువ్వు నిదానంగా ఆలోచించి పనులు చేసుకోవాలి. ఇవిగో మూడు రాళ్ళు. మొదటి రాయిని విసిరేస్తే నిప్పును, రెండవది నీటినీ, మూడవది మొసలినీ పుట్టిస్తుంది. అవసరమైనపుడు ఈ వస్తువుల్ని వాడుకో" అని చెప్పి రాజుని దీవించి పంపిందామె. ఆమెకు మరోసారి నమస్కరించి రాళ్ళను జాగ్రత్తగా తన అంగీలో దాచుకొని, ప్రయాణం మొదలు పెట్టాడు విశాలుడు. చిలుక ఎగిరి వచ్చి అతని భుజం మీద కూర్చున్నది.
నిండా చీకట్లు అలుముకుంటున్నాయి. రాజు పూర్తిగా అలిసిపోయాడు. కానీ పిల్లల జాడ తెలియలేదు. పట్టు వదలకుండా ముందుకు వెళుతున్న రాజుకి దూరంగా ఒక తెల్లని భవనం కనిపించింది. రాత్రికి అక్కడ తల దాచుకుని, ఉదయాన్నే తన కుమారులను వెతకవచ్చుననుకుని ఆ భవనం వైపుకి తన గుర్రాన్ని దౌడు తీయించాడు విశాలుడు. అప్పటి వరకూ ఏవేవో మాట్లాడుతున్న చిలుక, భవనాన్ని చేరగానే మాట్లాడటం ఆపేసింది! భవనం ప్రక్కగా గుర్రాన్ని కట్టి వేసి, ద్వారం దగ్గరకు వెళ్ళాడు రాజు. కీచురాళ్ళ శబ్దం, గబ్బిలాల ధ్వని తప్ప అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది..
"లోపల ఎవరైనా ఉన్నారా?" అరిచాడు విశాలుడు. బదులుగా లోపల్నుంచి శబ్దాలు వినబడ్డాయి. కొద్ది క్షణాల్లో తలుపులు తెరుచుకుని ఒక ముసలివాడు వచ్చాడు లోపలినుండి. విశాలుడు తను ఎందుకు వచ్చాడో చెప్పాడు. రాత్రికి అక్కడ ఉండటానికి అనుమతి అడిగాడు.
"అయ్యో! ఈ దేశాన్ని ఏలే రాజు నన్ను అనుమతి అడగడమా!? ఇది మీ ఇల్లే అనుకోండి. రండి!" అని నవ్వుతూ విశాలుడిని లోనికి ఆహ్వానించాడు ముసలివాడు.
నిజానికి వాడు ఒక మాంత్రికుడు. అర్థరాత్రి దాటాక రాక్షసుడి రూపం ధరించి, ఆ అడవిలోని జంతువులను, దారి తప్పి వచ్చిన మనుష్యులను పీక్కు తింటూ ఉంటాడు వాడు. ఆ రోజు ఉదయమే వాడికి ఏడుగురు రాజకుమారులూ దొరికారు. అయితే అప్పటికే వాడికి కడుపు నిండి ఉండటం చేత, రాజకుమారులనెవ్వరినీ ఇంకా తినలేక పోయాడు. రోజుకొకరిని చొప్పున మెల్లగా తినచ్చులెమ్మని, వాళ్లందరినీ వాడే ఓ పెద్ద పెట్టెలో పెట్టి బంధించి ఉంచాడు ! "ఆహా! ఈ రోజు ఎంత సుదినం! మళ్ళీ ఇంకో మనిషి దొరికాడు. అర్థరాత్రి దాటేలోపు వీడిని మాయచేసి పెట్టెలో పడేట్లు చేయాలి!" అనుకున్నాడు వాడు, రాజుని చూడగానే.
ఎక్కడలేని గౌరవాన్నీ ప్రదర్శిస్తూ రాజుని లోపలకి తీసుకెళ్ళి, తినడానికి పండ్లు వగైరాలు పెట్టాడు వాడు. "మహారాజా! అదిగో, ఆ మంచం మీద విశ్రాంతి తీసుకోండి. నాకు నిద్ర ముంచుకొస్తోంది " అంటూ వాడు చాప వేసుకుని పడుకున్నాడు.
బాగా అలసిపోయిన రాజుకూ నిద్రవస్తున్నది. పడుకునేందుకు గాను ఆ మంచాన్ని చేరబోయాడు. అంతలో చిలుక ప్రమాదాన్ని హెచ్చరిస్తూ రాజుని ముక్కుతో పొడిచింది. దాంతో విశాలుడు "తర్వాత పడుకుంటానులే తాతా! నువ్వు పడుకో!" అన్నాడు, తను దగ్గర్లోనే ఉన్న ఓ కుర్చీలో కూర్చుంటూ.
కొంతసేపటికి మాంత్రికుడు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించిన చిలుక "రాజా! ఆ మంచానికి నులక అల్లలేదు. దుప్పటి మాత్రమే పరిచి ఉంది. కూర్చోగానే మంచం క్రింద ఉంచిన మాయా పెట్టెలో పడిపోతావు. వీడొక మాంత్రికుడు. అర్థరాత్రి దాటిందంటే రాక్షసుడిగా మారిపోతాడు. రకరకాల మాయలతో నీ బిడ్డలను ఆ మూలనున్న పెట్టెలో బంధించాడు. ఆ పెట్టెను పగలగొట్టి, వాళ్ళను తీసుకుని త్వరగా ఇక్కడ నుండి బయట పడాలి" అంది విశాలుడి చెవిలో, గుసగుసగా.
రాజు గబుక్కున మంచం క్రిందికి చూశాడు. మాయా పెట్టె అక్కడే ఉంది. రాజు శబ్దం చేయకుండా ఆ పెట్టెను ఎత్తుకొని బయటికి నడిచాడు. కొంచెం దూరం వెళ్ళాక రాయి ఒకటి తీసుకొని ఆ పెట్టెను పగలగొట్టి చూస్తే ఏముంది? రాకుమారులందరూ నిశ్చింతగా పడుకొని నిద్రపోతున్నారందులో! విశాలుడు త్వరత్వరగా కుమారులను నిద్ర లేపాడు. అందరూ ఇంటివైపుకు పరుగు తీయడం మొదలు పెట్టారు.
అంతలో అర్థరాత్రి అయింది. ఒళ్ళు విరుచుకుని నిద్రలేచాడు మాంత్రికుడు. వికృత రూపాన్ని ధరించాడు. పెట్టెలో ఉన్న ఎనిమిది మందిని తలుచుకుంటే వాడికి నోరు ఊరినట్లయింది. కండలు తిరిగి బలంగా ఉన్న రాజుని ముందుగా తినేద్దామని పించించి వాడికి. మెల్లగా వంగి మంచం కింద వెతికాడు. అక్కడుండాల్సిన పెట్టె ఏది? పెట్టె మాయం; తను వారం రోజులకుగాను ఇష్టంగా దాచుకున్న ఆహారమూ మాయం!
ఇదంతా విశాలుడు చేసిన పనేనని అర్థమైంది వాడికి. విశాలుడొక్కడే పోయి ఉంటే ఏమీ పరవాలేదు- అతనితోబాటు తను కష్టపడి సంపాదించుకున్న ఏడుగురు రాజ-కుమారులూ తప్పించుకున్నారని వాడికి విపరీతమైన కోపం వచ్చింది. కౄరంగా అరుస్తూ, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వాళ్ళ వెంట పడ్డాడు. రాజు, రాజ కుమారులు ఎంత వేగంగా పరుగులు తీసినా, వాడు వాళ్ళను పట్టుకునేంత దగ్గరగా వచ్చేశాడు!
"మహారాజా! రాయిని విసరండి!" అంది చిలుక. తన అంగీలో దాచుకున్న రాళ్ళల్లో మొదటిదాన్ని గురిచూసి మాంత్రికుడిపై విసిరాడు రాజు. అది మంటలను పుట్టించింది. అయినా వాడు మంటలను దాటుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వస్తున్నాడు. రాజు రెండవ రాయిని విసిరాడు. లోతైన నీళ్ళ అగాథం ఏర్పడింది. వాడు నీళ్ళలో నుంచి కూడా రావడం చూసిన రాజు మూడవ రాయిని విసరగానే, పే..ద్ద మొసలి పుట్టింది- మాంత్రికుడిని గుటుక్కున మింగేసింది అది!
మరుక్షణం వాళ్లముందు ప్రత్యక్షమైంది అవ్వ. అవ్వ శరీరం బంగారు కాంతితో మెరిసిపోతున్నది. అదే సమయానికి చిలుకకాస్తా ఒక అందమైన పాప రూపు దాల్చింది. "రాజా! నీ చేత హతమైన మాంత్రికుడు వేరెవరో కాదు; నా కుమారుడే. చిలుకగా నీకు సాయం చేసింది నా మనుమరాలు.
దురాశ ఎక్కువై, చెడు దారి పట్టి, లోకకంటకుడిగా మారాడు నా కుమారుడు. నా అంతట నేను వాడిని ఏమీ చేయలేకపోయాను; కానీ ఈ పాపను మటుకు వాడి బారిన పడకుండా దూరంగా ఉంచి సాకుతూ వచ్చాను ఇన్నాళ్ళూ. ఇంక నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాను. నీకు అభ్యంతరం లేకపోతే, ఈ పాప బాధ్యత కూడా ఇకమీద నీకే ఇవ్వాలని ఉంది. నీ కుమారులకూ ఓ చెల్లి దొరికినట్లు అవుతుంది..ఏమంటావు?" అన్నది అవ్వ, రాజుతో.
రాజు, రాజకుమారులవైపు చూశాడు. రాజకుమారులు నవ్వుతూ చెల్లి చెయ్యి పట్టుకున్నారు. సంతోషంతో అవ్వ ముఖం వికసించింది. అందరూ రాజ్యాన్ని చేరుకున్నారు. రాణిగారికి ఒక చక్కని కూతురు దొరికింది. చిలుక చెల్లికి ఏడుగురు అన్నలు దొరికారు!