రాజకుమారులు నలుగురి హృదయాలూ అమితమైన సంతోషంతో‌ చివుర్లు తొడిగాయి. వికసించిన పద్మాల్లాంటి మనస్సులతో వాళ్ళు నలుగురూ విష్ణుశర్మ చుట్టూ చేరి, "స్వామీ! మీ సేవ చేసిన భాగ్యం వల్లనే మేం మిత్రభేదాన్ని వినగలిగాం. మా మనసులకు ఎంతో‌ సంతోషం కలిగింది. ఇక 'విగ్రహం' కూడా తెలియజెప్పి, మమ్మల్ని కృతార్థుల్ని చేయండి. దయచేసి ఆ కొత్త కథల అమృతధారల్ని త్వరగా కురిపించండి. ఆకలిగొన్న మా చెవులకు కధల విందు చేయండి" అన్నారు.

విష్ణుశర్మ వాళ్ళ మాటలకు సంతోషించి, పంచతంత్రంలోని మూడవ భాగమైన 'విగ్రహాన్ని', ఆదరం కొద్దీ చెప్పటం మొదలుపెట్టాడు: "సమానమైన బలమూ, పరాక్రమమూ గల ఒక నెమలికి, హంసకు పోట్లాట మొదలైంది ఒకసారి. చిలికి చిలికి గాలి వాన అయినట్లు, వాటి పోట్లాట చివరికి యుద్ధంగా పరిణమించింది. ఆ సమయంలో ఒక కాకిని నమ్మిన హంస, చివరికి ఓటమి పాలైంది. మీకు ఆ కథ చెబుతాను, చక్కగా వినండి:

కర్పూర ద్వీపంలో పద్మకేళి అనే కొలను ఒకటి ఉండేది. అందులో హిరణ్యగర్భుడు అనే హంస నివసిస్తూ ఉండేది. ఆ కొలను చుట్టూ నివసించే నీటి పక్షులు ఆ హంసను తమ రాజుగా చేసుకొని సంతోషంగా కాలం గడిపేవి. ఆ హంసరాజు దిక్కులన్నిటినీ జయించి, అన్ని వైపులా తన తేజస్సు ప్రకాశించగా, ఒకనాడు ప్రొద్దున సూర్యుడు ఉదయించిన తర్వాత, తనకు ఇష్టమైనవాళ్ళు, పండితులు, అందరూ తన చుట్టూ చేరగా, రాజఠీవితో సింహాసనం మీద సుఖంగా కూర్చొని కొలువుదీరింది.

ఆ సమయంలో 'దీర్ఘముఖుడు'అనే కొంగ ఒకటి వాకిట నిలచి, ద్వారపాలకుల ద్వారా తన రాకను తెలియపరచింది. ఆ కొంగ అంతకు ముందు చాలా నెలల క్రితం విదేశాలకు వెళ్ళి తిరిగివచ్చిన చెలికాడే; కనుక హిరణ్యగర్భుడు దాన్ని సాదరంగా లోనికి ఆహ్వానించింది.

దీర్ఘముఖుడు అప్పుడు తగిన రీతిగా సభను చేరి, వినయంతో వంగి నమస్కరించి, గౌరవంగా నిలబడ్డది. రాజుగారు ఆదరంతోటీ, సంతోషంతోటీ ఆ కొంగను చూస్తూ "రా, కూర్చో" అని చెయ్యి చూపి, తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకున్నది.

"ఓయీ! దీర్ఘముఖా! కులాసాగా ఉన్నావా? చాలాకాలానికి నిన్ను ఇలా చూడగల్గుతున్నాం. విదేశాలలో నివసించటంలో నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు- బాగా చిక్కి-పోయావు కూడాను. ఇంతకాలమూ ఏ ఏ దేశాలు తిరుగుతూ‌ ఉన్నావు? ఏ ఏ ప్రాంతాల్లో ఏలాంటి విచిత్రాలు కనబడ్డాయి, నీకు? మంచి దృశ్యాలేమైనా నీ కనులకు పండగ చేశాయా? నీ ముఖం విప్పారటం చూస్తుంటే ఎక్కడో , ముఖ్యమైనదే ఏదో నీకంట పడినట్లు తోస్తున్నది. నువ్వు వెళ్ళినచోట్ల వింతలు విశేషాలకు ఏమి కొదవ? త్వరగా చెప్పరాదూ, అందరం వింటాం!" అన్నది.

అప్పుడాకొంగ "అయ్యా! తమరి పరిపాలనలో ఉన్న భూభాగంలో ఏమూల చూసినా కుశలము, క్షేమం తప్పకుండా ఉంటాయంటే, ఇక ఎల్లకాలమూ దేవరవారి పాదాలను ఆశ్రయించుకొని, తమ ఆస్థానంలో‌ మెలిగేవాళ్ళం- మమ్మల్ని 'క్షేమమా' అని వేరుగా అడగవలసిన పని ఏమున్నది? ఇక దేశాంతరాలలో ఉన్నప్పటి సుఖం సంగతంటారా, అది కుందేటికొమ్ము లాంటిది. దాని సంగతి తమరు నా శరీర కాంతిని చూడగానే గ్రహించారు. అదంతా అటుండనివ్వండి- ఏమంత విశేషం కాదది-

ఆ రోజున తమరి పాదాల ఆదేశాన్ని అనుసరించి వెళ్ళినది మొదలు, 'ఈ, ఆ దేశమ'ని ఏం చెప్పేది, అన్నిచోట్లూ తిరిగి తిరిగి, ఎలాగో వెనక్కి తిరిగివచ్చి, నా భాగ్యం కొద్దీ తమకు ఎదురుగా ఇలా నిలబడ్డాను. ఈ మధ్యకాలంలో నేను అక్కడా అక్కడా చూసిన వింతలు లెక్కలేనన్ని ఉన్నాయి- వాటిని అన్నిటినీ విన్నవించాలంటే అనేక సంవత్సరాలు చాలవు. నిలకడ మీద తమకు ఒక్కటొక్కటిగా విన్నవించుకుంటాను-
అయితే తిరిగి వస్తూ వస్తూ తమరి ఈ సేవకుడు ఒక అపరాధం కావించాడు: ఒక్క నిముషంలో నా ప్రయాణపు బడాలిక తీర్చుకొని, అసలు ఏం జరిగిందో వివరంగా చెబుతాను. ప్రభువులవారు తమ దివ్య చిత్తంతో శ్రద్ధగా అవధరించగలరు" అని కళ్ళు సగం మూసుకొని, వేడి నిట్టూర్పులు వదిలి, క్షణంపాటు ఊరకనే ఉండి, మెల్లగా ఇలా చెప్పసాగింది.

"జంబూ ద్వీపంలో 'వింధ్యం' అనే పర్వతం ఒకటి ఉన్నది. ఆ కొండ పైభాగంలో నివసిస్తుంటాడు, చిత్రవర్ణుడు అనే నెమలిరాజు. అక్కడి పక్షిజాతులన్నిటికీ ఆయనే ఆరాధ్యదైవం.

నేను అనేకయోజనాలు ప్రయాణించి, అలసి, ఆ పర్వత సమీపంలోని అడవిలోకి ప్రవేశించగానే, ఆయన అనుచరులైన పక్షులు కొన్ని నన్ను చూసి నా దగ్గరికి వచ్చాయి. అతిథులకు చేసే మర్యాదలన్నిటినీ చేసి అవి నాకు అమృతంతో సమానమైన రుచిగల పళ్లను తెచ్చిపెట్టాయి.

వాటి ఆతిథ్యాన్ని స్వీకరించి, పండ్లుతిని, విశ్రాంతిగా కూర్చున్న నాతో అవి మర్యాద పురత్సరంగా మాట్లాడుతూ, "ఓ కొంగరాజా! మీ పుట్టుకవల్ల తరించి, ఖ్యాతినొందిన ఆ దేశం ఏది? ఏ ఏ దేశాలను విచార సముద్రంలో వదిలిపెట్టి వచ్చి, తమరు ఈ దేశాన్ని పావనం చేస్తున్నారు? ఇటుపైన ఏ ఏ దేశాలు తమరి పాదస్పర్శవల్ల పునీతం కానున్నాయి? ధర్మం తప్పకుండా మీ దేశాన్ని ఏలుతూ, మీవంటి శుచిమంతులను సేవకులుగా పొందిన భాగ్యశాలియై, మీ రాజ్యాన్ని అలంకరిస్తున్న ఆ రాజ రత్నం ఎవ్వరు? మీ కధనాన్ని వినాలని మా అందరి చెవులూ కుతూహలపడుతూ, వేచి ఉన్నాయి. మీ‌ ప్రయాణపు తొందరను ఒక్కింత తగ్గించగలిగితే, ఒక నిముషంపాటు ఇక్కడ ఆగి, మీ కథను ఆసాంతంగా మా‌ చెవులకు ప్రసాదించండి" అని.

అప్పుడు నేను వాటితో ఇలా చెప్పాను: "కర్పూర ద్వీపం" అన్నపేరు గతంలో వినే ఉంటారు గదా?! ఆ ద్వీపానికి ప్రభువు, హిరణ్యగర్భుడు అనే హంసరాజు. నేను ఆ ప్రభువుకు అనుంగు అనుచరుడిని. మా రాజుగారి బల పరాక్రమాలను గురించిన కథలు అనేకం చిన్న పిల్లలకు కూడా పరిచయమే- కనుక ఆయన పేరుతో మీకందరికీ ఈ సరికే పరిచయం ఉండి ఉండవచ్చు. అందరూ నన్ను 'దీర్ఘముఖుడు' అంటారు. ఆ హంసరాజు నన్ను ప్రాణంకంటే మిన్నగా గౌరవిస్తుంటే, ఆయనకు అంతరంగికుడుగా అనేక సంవత్సరాలు గడిపాను. ఒక నాడు ఈ‌ ప్రపంచంలోని అంతులేని విషయాల్లో గల విశేషాలను, వింతలను చూడాలని నాకు కోరిక కలిగింది. మా ప్రభువు అనుమతి తీసుకొని, మాదేశాన్ని వదిలి, ఎండనక, వాననక దేశాలుకాని దేశాలు అన్నింటినీ సందర్శిస్తూ, వాటిలోని విశేషాలు నా మనస్సుకు సంతోషం కలిగిస్తుంటే, వచ్చి వచ్చి అదేపనిగా ఈనాడు ఈ‌ దీవిలోకి ప్రవేశించాను. ఇక్కడి వింతలన్నిటినీ చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది. పక్షివరులారా! ఈ రోజంతా మీతోబాటు మీ దీవిలోని వింతలు-విశేషాలను అన్నింటినీ చూసి కాలక్షేపం చేస్తాను. ఈ రాత్రికి కూడా మీతో ముచ్చట్లు పెట్టుకొని, రేపు ఉదయాన్నే బయలుదేరి మా దేశానికి వెళ్తాను" అని.

అప్పుడా పక్షులు సంతోషపడి, "సరే, అట్లాగే కానివ్వ"మని, కొంచెం విశ్రాంతి తీసుకున్నాక నన్ను తమ వెంట తీసుకొని పోయి, ఆ ద్వీపంలో చూడగదిన ప్రదేశాలనన్నిటినీ నాకు చక్కగా చూపించాయి.

ఆ తర్వాత నన్ను మళ్ళీ తాము ఉండే చోటుకు తీసుకు వచ్చి, నన్ను అక్కడనే దూరంగా ఒకచోట నిలిపి, లోపల విశ్రాంతి తీసుకుంటున్న తమ రాజును చూపించాయి. అటు తర్వాత అవి "ఓ పక్షివర్యా! మీ భూమిని, మా భూమిని- రెండింటినీ బాగా చూశారు కదా! ఈ‌ దేశాలు రెండింటిలోను మీ కంటికి ఇంపుగాను, సొంపుగాను ఏది అనిపించింది? మన రాజులు ఇద్దరిలోనూ ఎవ్వరు గొప్పగా తోచారు? సొంతవారి పట్ల అభిమానాన్ని, 'మేం ఏమనుకుంటామో' అన్న అనుమానాన్ని- రెండింటినీ ప్రక్కన పెట్టి, నీ మనసుకు వాస్తవంగా ఏం‌ తోచిందో‌ చెప్పు" అని అడిగాయి. అప్పుడు నేను చిరునవ్వుతో ఇలా బదులిచ్చాను:

"మిత్రులారా! మీరంతా బావిలోని తాబేళ్ళమాదిరి, ఎప్పుడూ ఇక్కడే నివసిస్తూ ఉండటం మూలాన, ఇతర దేశాలలోని సంగతులు మీకు కలలో కూడా‌ తెలియటం లేదు. అందువల్లనే మీ మాటలు ఇలా ఉన్నాయి తప్ప, వేరే కారణం‌ ఏమీ లేదు. మీ మనసుల్లో ఉన్న అనుమానాలన్నిటినీ తీర్చుకోవటంకోసం చాలా ఆత్రంగా అడుగుతున్నారు కనుక, మన మధ్య కలిగిన స్నేహాన్ని పురస్కరించుకొని, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, వినండి: నిజంగా మా దేశానికి, మీదీవికి ఏనుగుకు-దోమకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. మా రాజ్యం ఎవ్వరినైనా ముగ్ధుల్ని చేసేంత సుందర ప్రదేశం; నివాస యోగ్యమైన ప్రాంతం. దానితో పోలిస్తే మీ నివాసం నిజంగా మహారణ్యమే. ఇక రాజుల్ని చూస్తే, మా రాజుకు- మీ ప్రభువుకు పర్వతానికి-పరమాణువుకు ఉన్నంత తేడా ఉన్నది. మా రాజుకు నివాసం పద్మాలకు ఆలవాలమైన సరస్సు. ఆహారం నిజంగా అమృతమే. ఆయన అనుచరులమైన మేమందరమూ ఎల్లప్పుడు సరసుల సరసన ఉండే కవివరేణ్యులమే. మా ప్రభువు వైభవాన్ని సంపూర్ణంగా వర్ణించాలంటే వెయ్యినోళ్ళవాడికే చేతకాదంటే, ఇక మావంటివాళ్లం ఏం చెప్పగలం?

చూడగా మీరాజు పరిస్థితి దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. మీ రాజు నివసించేది ఘోరమైన అడవి మధ్యలో. ఇక తినేది ఏంటా అని చూస్తే కాయలు, గడ్డలు! ఇక సేవకులు ఎటువంటివాళ్ళు? ఎల్లప్పుడూ మూర్ఖులతోటి తిరిగే పలుగాకిమూకలు. ముంజేతికి పెట్టుకున్న కంకణాన్ని చూసేందుకు అద్దం అవసరం ఏమున్నది? ఇలాంటి మీ ప్రభువు వైభవం ఎలాంటిదో‌ మీ మనసులకే స్పష్టం.

అది అట్లా ఉంచండి. మీరంతా ఈ నెమలి పంచన చేరి చెట్లలోనూ, పుట్టలలోనూ తిరుగుతూ పరితపించవలసిన అవసరం ఏమున్నది? కాయగసుర్లు ఏరుకొని తిని బ్రతకవలసిన ఖర్మ ఏం వచ్చింది? మిమ్మల్ని చూసినప్పటినుండీ‌ నాకు ఇదే విచారంగా ఉన్నది. ఏం చేయాలి? ఇదంతా మిమ్మల్ని ఈ విధంగా‌ పుట్టించిన ఆ దేవుడి తప్పుగాని, మీ తప్పు కాదు.

కేవలం‌ ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన, మంచివాళ్ళు స్నేహం కలుపుకుంటారు. ఆ విధంగా మీరంతా నాకు ఇప్పుడు ఆప్తమిత్రులు అయిపోయారు. సత్పురుషులు పరాయి వాళ్ల కష్టాలను చూసి కూడా‌ తట్టుకోలేరట; ఇక ఆప్తమిత్రుల కష్టాలను ఎలా సహిస్తారు? ఈ శరీరం‌ ఉన్నది ఇతరులకు సాయం చేసేందుకే- గనుక స్నేహంకొద్దీ మీకొక మంచి సలహా ఇస్తాను- నా మాటల్ని తీసి పారేయకండి- కొంచెం చెవుల్లో వేసుకోండి. తెలివిగలవాళ్ళు; మీకు ఎక్కువ చెప్పనక్కరలేదు. బాగుపడాలనుకుంటే, ఇక ఎక్కువ ఆలోచించకండి; వెంటనే ప్రయాణమై, రేపు ప్రొద్దునే బయలుదేరి, నాతోబాటు మా దేశానికి రండి. అక్కడ మీకు "ఇంకా ఇది కావాలి" అనిపించని విధంగా, అన్ని వసతులతోటీ కూడిన జీవితం లభిస్తుంది.

మా రాజుకూడా చాలా గొప్పవాడు; ఎంతటి వారిచేతనైనా గౌరవాన్ని అందుకునేంత ఉదారుడు; చాలా దయగలవాడు; ఆశ్రయించినవాళ్లను రక్షించేవాడు- మిమ్మల్నందరినీ తన ప్రజలుగా తప్పక ఆదరిస్తాడు. ఆయనను ఆశ్రయించు-కున్నారంటే, మీరు మీకు నచ్చినట్లు హాయిగా కాలం గడపవచ్చు అక్కడ. కాదనకుండా దీనికి అంగీకరించండి. వేరే ఆలోచనలు మాని, ప్రయాణమై రండి. ఆడుతూ పాడుతూ పోదాం" అన్నాను. (తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం...)