మిత్రులారా,

నా పేరు చరిత గంగి. నేను ఇండియాలోనే పుట్టాను. నాకు రెండేళ్లప్పుడు మా నాన్నగారి ఉద్యోగం పని మీద మేం అందరం అమెరికాకు వెళ్లాం. నాకు ఐదేళ్ళొచ్చేసరికి నేను అక్కడే బడికి వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ టీచర్లు బడి పిల్లలను ఎంతో ప్రేమగా‌ చూస్తారు. మా తరగతిలో పిల్లలు కూడా నాలాగే వేరు వేరు దేశాలనుండి వచ్చారు .

అయితే మా బడిలో పిల్లలంతా ఇంగ్లీషులో మాట్లాడతారు కదా, అందుకని నేను తెలుగు పూర్తిగా మరచిపోయాను. మా అమ్మ, నాన్న తెలుగులో మాట్లాడినా నేను మాత్రం ఇంగ్లీషులోనే జవాబు ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఈ సంగతులు కూడా నేను ఇంగ్లీషులో చెబితే మా నాన్న తెలుగులో‌రాసి పెడుతున్నారు.

డిసెంబరులో మాకు చలికాలం సెలవలు ఇస్తారు. ఆ సమయంలో మేం అందరం కలిసి ఇండియాకు వచ్చాము. విమానంలో 26 గంటలు ప్రయాణం చెయ్యాలి, తెలుసు గద! దాంతో బాగా అలసిపోయి, మరుసటి రోజంతా నిద్రపోయాం!

తరువాతి రోజున రైలులో 'షిర్డి'కి బయలుదేరాం. మేం రైలు ఎక్కేసరికే మిగిలిన ప్రయాణీకులంతా నిద్రపోతున్నారు. ఇంకేం చేస్తాం, అందుకని మేము కూడా నిద్రపోయాం.

అకస్మాత్తుగా ఎవరెవరో అరవటం మొదలు పెట్టారు- "పేపర్, పేపర్, టీ, టీ , కాఫీ, కాఫీ, ఇడ్లీ, ఇడ్లీ, దోసె, దోసె" అని. గబుక్కున నిద్రలేచి చూస్తే సమయం ఇంకా ఐదున్నరే!

"నాన్నా! ఏంటి ఆ అరుపులు ?" అడిగాను, బెదురుగా లేచి కూర్చొని.

"ప్రయాణం చేస్తున్నవాళ్లకి అవసరమయ్యే వస్తువులు అమ్ముకుంటున్నారమ్మా, వాళ్లంతా" అన్నారు నాన్న.

"వాళ్లు రైలులోకి రావచ్చా? టిక్కెట్లు కొంటారా, వాళ్లంతా?" అడిగాను నేను.

"లేదమ్మా, అయితే ప్రతిరోజూ అమ్ముకునే-వాళ్లకి మటుకు రైలువాళ్ళు గుర్తింపు పత్రాలు ఇస్తారు. అవి ఉంటే వాళ్లనెవ్వరూ ఏమీ అనరు" చెప్పారు నాన్న.

"చిన్న పిల్లలు కూడా పని చెయ్యాలా, ఇక్కడ?" అడిగాను నేను.

"ఇండియాలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారమ్మా. అందుకని ఇక్కడ పిల్లలు కూడా పనిచేస్తారు. డబ్బులున్న వాళ్ల పిల్లలైతే పనిచెయ్యక్కర్లేదు.." అన్నట్లు ఏదో చెప్పారు నాన్న. అది విని నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే అమెరికాలో పిల్లలెవ్వరూ పనిచెయ్యరు మరి!

అంతలో మానాన్న లేచి వెళ్ళి న్యూస్ పేపరు కొనుక్కొచ్చుకున్నారు. మా నాన్న పేపరు చదువుతుంటే, నేనేమో రైలు కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తూ ఉండిపోయాను.

కొంచెం సేపటికి చూస్తే ఎందుకనో, మా నాన్న సంతోషంగా‌ లేరు! "ఏంటి నాన్నా, విషయం?" అని అడిగాను.

"ఇందాక నేనొక న్యూస్ పేపర్ కొనుక్కొచ్చాను కదా, అది నిన్నటిది! ఎవరో నాకు పాత న్యూస్ పేపరు అమ్మారు!" బాధగా చెప్పారు మా నాన్న. అది మోసం. ఇక్కడి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. కాని, ఈ సంఘటన నా మనస్సును ఎంతో బాధించింది.

ఎందుకంటే అమెరికాలో చిన్న పిల్లలు కూడా ఎప్పుడూ కూడా మోసం చేయరు.

తర్వాత షిర్డీలో మేం అందరం దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చాము గదా, అక్కడ చాలా మంది గుంపుగా ఉన్నారు. ఒకళ్లనొకళ్ళు నెట్టుకుంటూ, తోసుకుంటూ గొడవ చేస్తున్నారు. "వాళ్లు ఏం చేస్తున్నారు నాన్నా?"అని అడిగాను మా నాన్నను.

"దేవుడి ప్రసాదం కోసం ఒకరి మీద ఒకరు పడుతున్నారమ్మా" అని చెప్పారు మా నాన్నగారు .

అది విన్న తరువాత నాలో నాకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ అందరూ "క్యూ" ఎందుకు పాటించరు? "వరుసలో నువ్వు ఒక్కదానివే ఉన్నాకూడా క్యూ పాటించాలి. ఎవరు ముందుగా‌ వస్తే వాళ్లు ముందుగా 'క్యూ'లో నిలబడాలి " అని మా నాన్న నాకు ఎప్పుడూ చెబుతుంటాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా తిరిగి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఆ రోజు చాలా వేడిగా ఉన్నది. స్టేషనంతా జనాలతో నిండిపోయి ఉంది.

అకస్మాత్తుగా నాకు ఒక కుక్క, దాని ఐదు పిల్లలు- కనబడ్డాయి. ఆ కుక్క పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో! కాని వాటికి సరైన పాలు, అన్నం దొరుకుతున్నట్లు లేదు. బక్కగా చిక్కి పోయి ఉన్నాయవి.

హఠాత్తుగా , నాకు గుర్తొచ్చింది- నా దగ్గర బిస్కెట్లున్నాయి కదా, వాటిని తీసి ఆ కుక్క పిల్లలకు ఇచ్చాను. ఆవురావురని తినేశాయి వాటిని అవి. "ఈ కుక్క పిల్లల్ని మనం తీసుకెళ్లి పెంచుకుందాం, ప్లీజ్" అని మా అమ్మ-నాన్నలను ఎంత అడిగానో! కానీ వాళ్లు దానికి ఒప్పుకోలేదు. "మనం మళ్లీ అమెరికాకి వెళ్లి పోవాలి కదా, వీటిని విమానంలో రానివ్వరు" అన్నారు.

అంతలోనే రైలు వచ్చింది. మా నాన్న నా చెయ్యి పట్టుకొని నన్ను రైలులోకి తీసుకెళ్లారు- కానీ నా మనసంతా ఆ కుక్క పిల్లలపైనే ఉంది. అప్పుడే నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది: "నేను పెద్దైన తరువాత బాగా డబ్బులు సంపాదించి, ఇండియాలో ఉన్న అన్ని వీధికుక్కలకు, పిల్లులకు, ఆవులకు నివాసమూ, ఆహారమూ కల్పిస్తాను" అని.

మీరు కూడా మీకు కనిపించిన ఏ జంతువుకూ హాని చేయద్దు. మీకు చేతనైన సహాయం చెయ్యండి వాటికి.

ఉంటాను ఇక. బై!