"పిల్లలకు జాగ్రత్తగా నేర్పాలి, దగ్గరుండి. అప్పుడే వాళ్లకి ఏ పనైనా చేతనవుతుంది"- పెద్దవాళ్లకి తమ పెద్దరికాన్ని, ఇంపార్టెన్సును కాపాడుకోవటానికి ఈ భ్రమలో ఉండటం చాలా ఇష్టం. నిజానికి ఎవరో చెప్పినట్లు, 'నేర్పితేనే నేర్చుకునేట్లయితే పిల్లలకి అసలు ఏమీ చేతనవ్వకపోను'. పిల్లలు నడక నేర్చుకున్నంత సహజంగా, అలవోకగా మనం లెక్కపెట్టలేనన్ని పనులు చక్కగా చెయ్యటం ఇట్టే నేర్చుకుంటారన్నది అక్షర సత్యం. దానికి కావలసిందల్లా వాతావరణం, గడిగడికీ అడ్డుపడకుండా స్వేచ్ఛనివ్వటం. ఈసారి సంపాదకీయంలో చెప్పిన ఆటలు, ఆటలుగా కన్పించే పనులూ- చదువులు, టివి గొడవలో పడి చాలామంది పిల్లలు వీటి రుచైనా చూడలేకనే పెద్దవాళ్లైపోతున్నారని బాధేస్తుంది.
పిల్లలు ఎన్ని సంతోషాల్ని పోగొట్టుకుంటున్నారో అని దిగులేస్తుంది.
ఈ సంచికలో పిల్లల కథలన్నిటిలోనూ వైవిధ్యం కానవచ్చింది.
తనతో దెబ్బలాడిన కాకిని కోకిల కోపగించుకోకుండా ఎంత సులువుగా దాని అసూయని పోగొట్టింది?! అశ్విని కథ పెద్దలకి పాఠం చెప్పినట్లుంది.
రామాపురంలోని ప్రజలలా ఉంటే ఏ రాజ్యానికీ రాజు అవసరం లేనే లేదు కదూ! 'అందరికోసం' చిన్న కధైనా ఎంతో మంచి సందేశాన్నిచ్చింది. ఇంతకీ ఆ రాజుకి ఎందుకో, ఎవరిపైనో, కోపం!?
పిల్లల మంచి చెడులలోను, వ్యక్తిత్వ నిర్మాణంలోను టీచర్ల పాత్ర తగ్గిపోతున్న రోజుల్లో- మంచి టీచరు ఓ పిల్లాడి జీవితంలో ఎంతో మార్పు తేవచ్చని నమ్మాడు స్టీఫెన్. పాఠం చెప్పటం మినహా ఏం చెయ్యగలమని నిరాశలో ఉన్న టీచర్లందరికీ ఈ నమ్మకం ఓ ఆశాకిరణం, ఓ స్ఫూర్తి.
'ఎవరికీ చెప్పద్దు'- మేం చెప్పకపోతే కథ చివర్లో వినయ్ చెప్పిన జాగ్రత్త పిల్లలందరికీ చేరేదెలా? వినయ్‌ది ఇది స్వీయ అనుభవమో కాదోగానీ, పిల్లల అనుభవాలు కథలుగా రావటం బాగుంటుంది.
సహజీవనం ఏ ఒక్కరి అవసరమో కాదనీ, అందరూ సంతోషంగా, క్షేమంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకు పోవాలనీ చింతచెట్ల కథ చెప్తున్నట్లుంది. భూమ్మీదున్న ప్రతి మనిషీ గ్రహించాల్సిన సత్యాన్ని చెప్పేందుకు సతీష్ ఎంచుకున్న ఉదాహరణ- ఎంత చిన్నదైనా, సూటిగా, వాడిగా, ఇట్టే భావం అర్థమయ్యేలా ఉంది.
అనురాగ్ వేసిన బొమ్మలు- చెప్పినట్లు లేకుండానే కథ చెప్పటం బావుంది. కథకి మాటలు అవసరం లేదు కదా! కానీ పాపం, చందన్ కుమార్ ఎందుకు చిన్నబుచ్చుకున్నాడో, చివరికి?
బొమ్మకు పిల్లలు వ్రాసిన కథలు ఎంపిక కావటం లేదో, మరి పిల్లలెవరూ వ్రాయటం లేదో? ఎక్కువమంది పిల్లలు వ్రాస్తే బావుండేదేమో.
'అన్నదమ్ముల ఆప్యాయత' సున్నితంగా మనసుని తాకింది. 'ఆకలి దప్పులు' జీవిత సత్యాన్ని చెప్పింది. దీనికి పిల్లల స్పందన ఎలా ఉంటుందో, మరి!?
అట్టమీద స్ఫూర్తిదాతలైన గురువుల ఎంపిక బావుంది. ఇక వీరాంజనేయులికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పాలి? దసరా శలవల్లో దండిగా చదువుకోవడానికి బోల్డన్ని కథలకోసం ఎదురు చూస్తుంటాం.