పల్లెన్నగారి పల్లిలో ఇంద్ర, చంద్ర అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు రోజూ బడికి పోయేవాళ్ళు; బాగా చదువుకునేవాళ్ళు. ఇంద్ర చాలా లావుగా ఉండేవాడు. చంద్ర ఏమో, చాలా సన్నగా ఉండేవాడు. వాళ్ళ బళ్ళో పిల్లలందరూ వీళ్ళని 'దుబ్బోడా', 'బక్కోడా' అని ఎగతాళి చేసేవాళ్ళు.
ఇంద్ర, చంద్రలు ఇళ్ళల్లో బాగా పని చేసేవాళ్ళు. రోజూ పశువుల కొట్టం శుభ్రం చేసేవాళ్ళు; తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు; సెలవుల్లో కొండల పైకి పశువుల్ని తోలుకెళ్ళి మేపేవాళ్ళు. పొలంలో కూడా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు- ఈ పనులన్నీ చాలా సరదాగా, ఆటపాటల్లాగా చేసేసేవాళ్ళు. పశువులతో కొండల్లో తిరిగేటప్పుడు, బలిస పళ్ళు, రేణి పళ్ళు, నేరేడు పళ్ళు, కలివి పళ్ళు, ఈత పళ్ళు బాగా తినేవాళ్ళు. చేన్లో పని చేసేటప్పుడు శనక్కాయలు, కంది కాయలు లాంటివి బాగా తినేవాళ్ళు. ఇలా పనిచేస్తూ, అనుకోకుండానే వాళ్ళిద్దరూ చాలా విద్యలు నేర్చుకున్నారు: ఎద్దుల బండి నడపడం, మడక(నాగలి)దున్నడం, తోటకు నీళ్ళు కట్టడం లాంటి పనులు అలవోకగా, సరదాగా నేర్చేసుకున్నారు.
ఇంద్ర, చంద్రలంటే వాళ్ళ అమ్మానాన్నలకు చాలా ఇష్టం. ఏనాడూ వాళ్ళు వీళ్ళని పనులు చేయమని బలవంతపెట్టలేదు- పిల్లలే వాళ్లంతట వాళ్ళు ఇష్టంగా చేసేవాళ్ళు, అన్ని పనుల్నీ. అలా పనులు చేసుకుంటూ వాళ్ళిద్దరూ అమ్మా నాన్నల నుండి ఎన్ని కథలు విన్నారో; పాటలు, పొడుపు కథలు లాంటివి కూడా, ఎన్ని నేర్చుకున్నారో! అన్నింటి కంటే ముఖ్యమైనది, వీళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడే అమ్మా నాన్నలు వాళ్లకు బావిలో ఈత కొట్టడం నేర్పారు. సెలవుల్లో ఇది కూడా వాళ్ళకు గొప్ప సరదాగా ఉండేది.
అయితే ఊళ్ళో పిల్లలందరూ చాలా నాజూగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలు, బట్టలు, స్కూలు బ్యాగులు, తిండి, నడక, అభిరుచులు అన్నీ ఒక విధంగా ఉండేవి. ఇంద్ర, చంద్రలేమో పాత కాలపు పల్లె పిల్లల్లాగా ఉండేవాళ్ళు. అందుకని కూడా అందరూ వీళ్ళను కొంచెం చులకనగా చూసేవాళ్ళు.
ఒకసారి ఊళ్ళో పిల్లలు కొందరు బావిలో ఈత కొట్టడానికి వెళ్ళారు. ఇంద్ర-చంద్రలు ఇద్దరూ అక్కడే ఏవో పనుల్లో మునిగి ఉన్నారు. మిగిలిన పిల్లలందరూ నీళ్ళలోకి దిగారు. అంతలో నీళ్ళలో జరజరా పాక్కుంటూ పోతున్న పాము ఒకటి కనిపించింది వాళ్ళకు.
అంతే! మరుక్షణం పిల్లలందరూ ఒకరిమీద ఒకరు పడుతూ, లేస్తూ బావిలోంచి బయటికి వచ్చేసారు. అయితే ఈ గందరగోళంలో సోము అనే పిల్లవాడికి బావి అంచు 'ధడాల్'మని కొట్టుకున్నది. తిరిగి నీళ్ళలో పడిపోయాడు- "కాపాడండి, కాపాడండి!" అని అరుస్తూ ఉన్నాడు.
మిగిలిన పిల్లలందరూ భయస్తులు; వాళ్ళకి ఈత కూడా అంతగా రాదు. దాంతో వాళ్ళు బయట నిలబడి ఏడవటం మొదలుపెట్టారు. ఈ హడావిడి విని ఇంద్ర, చంద్ర పరుగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్ళారు. గబుక్కున బావిలోకి దూకి, భయంతో వణికి పోతున్న సోమును బయటికి తీసుకొచ్చారు.
వాడు అప్పటికే కొన్ని నీళ్ళు మింగేసి ఉన్నాడు- వీళ్ళిద్దరూ వాడిని బోర్లా పడుకోబెట్టి, వీపు మీద నొక్కి, నీళ్ళన్నిటినీ కక్కించారు. మిగిలిన పిల్లలందరూ వాళ్ళు చేస్తున్న ఈ పనుల్ని నోళ్ళు వెళ్ళబెట్టి చూశారు.
"ఈ సంగతులన్నీ మీకు ఎవరు నేర్పించారురా?" అడిగాడు సూరి ఆరోజు సాయంత్రం, మిగతా పిల్లలంతా అబ్బురంగా చూస్తుండగా. "అమ్మానాన్నలకు వాళ్ల పనిలో సాయం చేస్తూ చేస్తూ, మేమే నేర్చుకున్నాం!" చెప్పారు ఇంద్ర, చంద్ర గొప్పగా.
అటు తర్వాత వాళ్ళిద్దరికీ తోటి పిల్లల్లో భలే గౌరవం వచ్చేసింది!