ఆఫ్రికా ఖండంలో 'మలావీ' అనే చిన్న దేశం ఒకటుంది. ప్రపంచంలోని చాలా పేద దేశాల్లో అదీ ఒకటి. ఆ దేశంలో ఒక చిన్న ఊరిలో విలియం కంక్వంబా ఉండేవాడు. వాళ్ళది ఒక మామూలు రైతు కుటుంబం. పదేళ్ళ క్రితం మాలావీ దేశంలో వచ్చిన కరువు- దాని తరువాత వచ్చిన కుటుంబ కష్టాల వల్ల, అప్పటిదాకా బడిలో చదువుకుంటున్న విలియం ఇక డబ్బుల్లేక స్కూల్ మానేయాల్సి వచ్చింది. అలా అక్కడ చదువు మానేసిన వాడు మరో ఐదేళ్ళ దాకా బడికి వెళ్ళలేక పోయాడు. ఇంట్లో అందరూ కలిసి వ్యవసాయం పనులు చేసుకుంటూ వచ్చారు.
అయితే, ఈ కష్టాలేవీ విలియంను నిరాశ పరచలేదు. అతనికి వీలైనప్పుడల్లా వాళ్ళ ఊళ్లో ఉన్న గ్రంథాలయానికి వెళ్లి అక్కడ సైన్సు పాఠాలు సొంతంగా చదువుకుంటూ వచ్చాడు. ఒకరోజున అతనికి శక్తిని ఎలా వినియోగించుకోవచ్చో తెలియజేసే పుస్తకం ("Using Energy"అనేది)ఒకటి దొరికింది. గాలిమరలతో విద్యుత్తును ఎలా తయారు చెయ్యచ్చో బొమ్మలతో సహా వివరించి ఉంది అందులో! ఆ పుస్తకాన్ని చదివాక ఇక విలియం ఆగలేకపోయాడు. తనుకూడా అలాంటిది ఒకటి తయారు చేయాలనుకున్నాడు. అంతవరకూ వాళ్ళ ఇంట్లో కిరోసిన్ దీపాలే వాడేవాళ్ళు. ఆ ఊళ్లో విద్యుత్తు ఉన్న ప్రాంతాలు తక్కువ. అసలు మాలావీ దేశం మొత్తంలోనూ విద్యుత్ సరఫరా అందే ప్రాంతాలు రెండు శాతమేనట! అలాంటి చోట మరి, సొంతంగా కరెంటును ఉత్పత్తి చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది!!
సరే, తను పుస్తకంలో చదివిన దాన్ని తయారు చేయాలంటే, ఎంత లేదన్నా కొన్ని పరికరాలు కావాలి కదా? మరి, వాటిని కొనేందుకు డబ్బు కూడా అవసరమౌతుంది! కానీ, విలియం దగ్గర డబ్బులు ఏమున్నాయి గనక? అందుకని వాళ్ల ఊళ్ళో పనికిరాని వస్తువుల్ని పడేసే చోటుకి వెళ్ళి తన పనికి ఉపయోగపడే వస్తువుల్ని వెతుక్కున్నాడు- పాడైపోయిన ఒక ట్రాక్టరు ఫ్యాను, పనిచెయ్యని ఓ షాక్ అబ్సార్బరు, బాగున్న ఒక సైకిలు ఫ్రేము, ప్లాస్టిక్ పైపులు, సైకిల్ డైనమో, పాత చెక్కముక్కలు, వాళ్ల ఊళ్ళో పెరిగే ఒక రకం వెదుర్లు- ఇవన్నీ దొరికాయి! వీటిని ఉపయోగించాడు. ప్లాస్టిక్ వస్తువుల్ని కరిగించి గాలిమర రెక్కలకు ఓ రూపం తెచ్చాడు. వెదుళ్లతోటీ, చెక్క ముక్కలతోటీ ఎత్తైన మంచె ఒకటి తయారు చేశాడు. సైకిలు ఫ్రేమును దానిపైకి ఎక్కించి, దానిలోని గేర్ల వ్యవస్థను వాడుకున్నాడు. చివరికి గాలి రాగానే తిరిగేలా ఒక నిజం గాలిమరను తయారు చేసాడు! ఆ గాలిమర సైకిల్ డైనమోని తిప్పగానే తన గదిలో బిగించిన లైటు వెలిగింది!
ఇక దానికి ఒక కారు బ్యాటరీని బిగించాడు; గాలి లేనప్పుడూ ఇంట్లో విద్యుత్ సరఫరా నిలచిపోకుండా చేయగల్గాడు. ఇలా కంక్వంబా తన మొదటి ప్రయోగంలో 12వాట్ల కరెంటును ఉత్పత్తి చేయగల్గాడు! అతను తయారు చేసిన విద్యుత్తు నాలుగు బల్బుల్ని వెలిగించటమే కాక , ఇరుగుపొరుగున ఉన్న రెండు రేడియోలని పలికించేది!
ఈ గాలిమర ప్రయోగం ఎందరినో ఆకర్షించి, క్రమంగా పత్రికల వాళ్ళని చేరింది. ఆ తరువాత క్రమంగా విలియంకి పేరు రావడం మొదలైంది. క్రమంగా అతను ఇలాంటి మరల్నే మరికొన్నిటిని తయారు చేసాడు. వాటిలో ఒక గాలిమర వ్యవసాయానికి నీళ్ళని కూడా తోడుతుంది! అతని ప్రతిభను గుర్తించిన కొందరు అతను చదువుకునే ఏర్పాట్లు చేసారు. అలా స్కూలు చదువు పూర్తి చేసుకున్నాక, "ఆఫ్రికన్ లీడర్షిప్ అకాడెమీ"లో కొన్నాళ్ళు చదువుకుని, ఇప్పుడు పై చదువుల కోసం అమెరికాలో ఉన్నాడు కంక్వంబా. అలా సొంత ఊళ్ళో మొదలైన అతని ప్రయాణం ఇప్పుడు ఆగకుండా సాగిపోతోంది.
ఏడాది క్రితమే అతను వేరే పాత్రికేయుడొకరితో కలిసి తన కథను ఒక పుస్తకం గా రాసాడు: దాని పేరు - "The boy who harnessed the wind". ఈమధ్యే ఎవరో సినిమావాళ్ళు విలియం కంక్వంబా గురించి ఒక లఘు చిత్రం కూడా నిర్మించారు!
ఇంతకీ, ఇప్పుడు ఇతని గురించి రాయడం ఎందుకంటే- 'అసలు ఏలాంటి వసతులూ లేని ఆఫ్రికా కుగ్రామంలో పుట్టి, కరువు బారిన పడి, బడికి కూడా పోలేని పరిస్థితుల్లో చిక్కుకొని కూడా పట్టు వదలని విలియం కంక్వంబా తాను అనుకున్నది సాధించాడు కదా; మనం అతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే బాగుంటుంది కదా!' అని.
మనం చదువుకునే విషయాలను బయట, ప్రపంచంలో, పదిమందికీ ఉపయోగపడేలా ఎలా ఉపయోగించాలో మనందరం ఆలోచించాలి, నిజంగా.