అనుకున్న విధంగానే తనూజ్, మనోజ్‌లు అమెరికా నుండి హైదరాబాదులో కాలు పెట్టారు. విమానం దిగగానే తాతయ్య, మామయ్య సిద్ధంగా ఉన్నారు. తాతయ్యను చూడగానే ఏనుగును ఎక్కినంత సంబరం అయింది వాళ్లకి. అందరూ అక్కడినుండి నుండి బస్సులో కర్నూల్‌కి చేరుకున్నారు. ఆసరికే పాలేరు కట్టుకొని వచ్చిన ఎద్దుల బండి నిలబడి ఉన్నది అక్కడ. ఆ బండి ఎక్కి అందరూ తాతయ్యగారి ఊరు- రావులపాళెంకు బయలుదేరారు. బండిలో ఎత్తుగా వరిగడ్డి పరిచి ఉంది. దాని మీద దుప్పటి- బండంతా మెత్తగా, చల్లగా ఉంది. అప్పటికి సాయం సమయం అయ్యింది కూడాను. బండి నెమ్మదిగా, ఉయ్యాల ఊగినట్లు సాగుతున్నది. దానికి అనుగుణంగా ఎద్దుల మెడలో చిరు గంటలు గణగణమని మ్రోగుతున్నాయి.

బండిలో చాలా హాయిగా ఉంది. దోర జామ పండ్లు తింటూ, తాతయ్య చెప్పే కబుర్లకు ఊఁ కొడుతూ , మధ్య మధ్య ఎదురవుతున్న చింత తోపులను, తాటిదుబ్బలను చూసుకుంటూ, ఈత గుబుర్లలోంచి పారే వంకలను దాటుకుంటూ ప్రయాణం చేయడం భలే ఉంది!
ఇంకా ఊళ్ళోకి చేరకనే తాతయ్య గారిల్లు వచ్చేసింది. బండి నెమ్మదిగా ఇంటిముందు ఆగింది. ఇంట్లోంచి అమ్మమ్మ హడావిడిగా బయటికి వచ్చి ఇద్దరినీ ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకొని పోయింది.

అమ్మమ్మ ఇల్లు భలే బాగుంది. అచ్చం వాళ్ళు డ్రాయింగ్‌లో వేసే బొమ్మ ఇల్లులాగా ఉంది. పెద్ద స్థలానికి ఒక వైపున చక్కని ఇల్లు. ఇంటి ప్రక్కనే ఒక చెరువు! వెనక ప్రక్కన దూరంగా కనబడుతున్న కొండలు! చిన్నగా ఉన్నప్పటికీ అందంగా, పొందిగ్గా ఉంది ఇల్లు. ఇంట్లో ఎటువంటి పెద్దపెద్ద సామానులూ లేవు. 'ఇలా వీళ్ళు ఎలా బ్రతుకుతారబ్బా' అనుకుంటూ ఉండగానే, "రండిరా స్నానం చేద్దురు!" అంటూ అమ్మమ్మ కేక వేసింది.

గోరు వెచ్చటి నీటితో ఆరుబయట బండమీద స్నానం చేయటం బలే తమాషాగా ఉంది. తరువాత అందరూ కలసి భోజనం చేశారు. వేడి వేడి అన్నం, ముద్దపప్పు , గుత్తి వంకాయ కూర , గుమ్మడి వడియాలు, గోంగూర పచ్చడి, కాకర కాయ వేపుడు, ఆవకాయ, గడ్డపెరుగుతో భోజనం ముగించే సరికి భుక్తాయాసం అయింది. ఇంత మంచి రుచికరమైన భోజనం ఎప్పుడూ చెయ్యలేదు.. అమ్మమ్మ చేతి వంట నిజంగా అమృతంలాగా ఉంది. తరువాత ఆరుబయట మంచాలు వేసుకొని అందరూ పడుకున్నారు. ఇంతలో పాలేరు రంగయ్య వచ్చాడు; ఎద్దులను కట్టేసి వచ్చి, తాతయ్యతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు.

చల్లటి గాలిలో పడుకున్న మనోజ్,తనూజ్‌లు ఆకాశం కేసి చూస్తూ ఉన్నారు:

"నిజంగా ఎంత బాగుంది, ఇక్కడ! వెన్నెల వెలుగులో మునగ చెట్టు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. మడుగులోని నీళ్లలో చంద్రుడి వెన్నెల పడి వింత కాంతులను వెదజల్లుతోంది. పూల వాసనను మోసుకొస్తున్న గాలి అలా అలా నెమ్మదిగా వీస్తోంది. ఆకాశంలో మబ్బులు వింత వింత ఆకారాలలో కదులుతూ "మా వెంట రండి" అని పిలుస్తున్నాయి...”

"రేయ్ ...తనూ, మనూ ! 'గెట్ అప్ ప్లీజ్ ' అని మమ్మీ పిలిచిన పిలుపుకు ఇద్దరూ ఒకే సారి అదిరి పడి దిగ్గున లేచారు. చూడగా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. "అబ్బా!.. ఇంతసేపు కన్నది కలా?! ఎంత బాగుంది! అమ్మ చెప్పినట్లు, ఈ సారి వేసవి సెలవులలో తాతయ్య వాళ్ళ ఊరికి తప్పకుండా వెళ్ళాలి!" అనుకుంటూ బడికి తయారయ్యేందుకు గబగబా లేచారు.