మనం చిన్నప్పుడు ఎట్లా ఉంటామో పెద్దయ్యాకకూడా‌ అట్లాగే ఉంటామని లేదు.

చిన్నప్పుడు పీలగా, సన్నగా, బక్కగా, పాలిపోయి ఉండే పిల్లవాడు- పెద్దయ్యాక వాళ్ళ నాన్నంత బొర్ర పెట్టుకొని, గుండ్రంగా అవ్వొచ్చు. చిన్నప్పుడు చీమిడి ముక్కుతో, పీక్కుపోయిన ముఖంతో, మూగమొద్దులాగా కనిపించిన పాప పెద్దయ్యాక వాళ్ళ అమ్మలాగా అందంగా, బొద్దుగా, గలగలా మాట్లాడుతూ రేడియో యాంకర్ పని చేయచ్చు.

చిన్నప్పుడు 'రాముడు మంచిబాలుడు' అనిపించుకున్న రాముళ్ళు, పెద్దయ్యేసరికి తుంటరిగాళ్ళు కావొచ్చు; అట్లాగే చిన్నప్పుడు అల్లరి పనులు చేసి కూడా, పెద్దయ్యే క్రమంలో ఆ తప్పులన్నిటినీ దిద్దుకొని ఆ అల్లరి పిల్లలే మహాత్ములు అయిపోవచ్చు.

చిన్నప్పుడు ఒక్కో పరీక్షలోనూ అతిగా కంగారు పడిపోయి, ఏదేదో రాసేసి, సున్నా మార్కులు తెచ్చుకొని, ఫెయిలయి, తిట్లు తిని, ముఖం ముడుచుకొని, ఆ తర్వాత పెద్ద అయ్యాక గొప్ప శాస్త్రవేత్తలు అయిన వాళ్ళున్నారు.

చిన్నప్పుడు బాగా చదువుకొని, ఆ తర్వాత దురలవాట్లకు లోనై, వాటి చక్రవ్యూహంలోంచి బయటపడటం రాక, వాటిలోనే కూరుకుపోయిన అభినవ అభిమన్యులూ ఉన్నారు.

చిన్నప్పుడు ఏదో ఒక మోస్తరుగా ఆడుకొని, పెద్దయినాక గొప్ప కోచ్ లుగా ఎదిగిన ఆటగాళ్ళున్నారు. చిన్నప్పుడు బళ్ళు, కాలేజీలు ఎగగొట్టి తిరిగి, పెద్దయినాక గొప్ప విశ్వవిద్యాలయాల్లో‌ ప్రొఫెసర్లయిన వాళ్ళున్నారు. పదో తరగతి తప్పి, ఆపైన ఏదో‌ఒక పని చేసుకుంటూ గణితశాస్త్రంలో మేధావులకుకూడా అర్థంకాని సమస్యలకు పరిష్కారం సూచించిన రామానుజన్‌లు ఉన్నారు. చిన్నప్పుడు గోడలకు రంగు వేసుకుంటూ తిరిగి, పెద్దయినాక అద్భుతమైన రచనలు చేసి ఖ్యాతి గడించిన వాళ్ళున్నారు.

చిన్నప్పుడు దొంగపనులు చేసి, అటుపైన అందులోని తప్పును గుర్తించి, పశ్చాత్తాపపడి, వాటిని వదిలేసి, పెద్దయినాక నీతికి, సత్యానికి, శాంతికి ప్రతీకలుగా నిల్చిన బాపూజీలూ ఉన్నారు.

ప్రపంచంలో అన్నింటా మార్పులు వస్తూనే ఉన్నాయి. ప్రతిక్షణమూ మార్పు సంభవిస్తూనే ఉన్నది. అయితే, "మనం ఎటువైపునుండి ఎటువైపుకు మార్పు చెందుతాం" అన్నది నిజానికి మన చేతుల్లోనే ఉన్నది- అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, అవిద్య నుండి విద్యలోకి, అశాంతినుండి శాంతిలోకి, ద్వేషంనుండి ప్రేమలోకి చేర్చే మార్పులు ఊరికే రావు: వాటికోసం మనం కొంచెంగానైనా సరే, ప్రయత్నించాల్సి ఉంటుంది.

అలా ప్రయత్నిస్తున్నవాళ్లంతా మహాత్ములౌతారు, ఏదో ఒక నాటికి.

మిగిలినవాళ్ళందరికీ మార్గదర్శకులౌతారు వాళ్ళు.

అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు.
కొత్తపల్లి బృందం.